- ఒక్కమాటైనా మాట్లాడని సీఎం
- తీవ్ర నిరాశలో ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ అమలు విషయంపై సోమవారం నాటి రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ‘ఏ దో జరిగిపోతుంది’ అని వెయ్యికళ్లతో ఎదురుచూసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మంత్రి వర్గం మొత్తం పీఆర్సీ విషయంపై ఒక్కమాటైనా మాట్లాడకుండా మౌనం దాల్చింది. దీంతో తమ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంతమాత్రమూ చిత్తశుద్ధి లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
అదేసమయంలో హెల్త్‌కార్డులు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఉద్యమ బాటపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఉద్యోగులు తమ జేఏసీ వైఖరిని తప్పుబట్టారు. సకాలంలో ఉద్యోగ సంఘాల జేఏసీ స్పందించలేదని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో.. మంగళవారం నిర్వహించనున్న ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యవర్గ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఉద్యమబాట పడుతూ కార్యాచరణను సిద్ధం చేసే అవకాశముంది.
రేపు ఉపసంఘం తొలి భేటీ: పీఆర్సీ అమలుపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి బుధవారం భేటీ కానుంది.