సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆందోళన విరమించి విధులకు హాజరైతేనే చర్చలకు సిద్ధమని, లేకుంటే కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించింది. రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ జరిగింది.రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట మృతులకు ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
ఈ ఘటనపై హైకోర్టు రిటైర్‌డజడ్జితో న్యాయవిచారణ జరిపించాలని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్య తీసుకోవాలని నిర్ణయించారని సమాచారం. అలాగే ‘అప్పన్నకు ఐటీ నామం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కేబినెట్లో చర్చకు వచ్చిందని తెలిసింది. సింహాద్రి అప్పన్నకు విశాఖ మధురవాడలో ఉన్న రూ.250 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు 99 ఏళ్ల లీజుకు ఈ-సెంట్రిక్ సొల్యూషన్ అనే ఐటీ కంపెనీకి కట్టబెట్టేందుకే మొగ్గు చూపారని తెలిసింది. నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారని సమాచారం. కాగా, భేటీ అనంతరం సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
* కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బాలకొలను, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ పరిధిలోని సర్వే నంబర్ 433లో 2,297.13 ఎకరాలను డీఆర్‌డీఓ పరిధిలోని డిఫెన్స్ మిసైల్ టెస్టింగ్ సెంటర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎకరాకు రూ.2 లక్షల చొప్పున చెల్లిస్తారు. రూ.500 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేస్తారు.
* విశాఖ జిల్లా ఆరిలోవ, భానోజినగర్‌లలోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 80 గజాల్లోపు ఇళ్లను క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరాల్లేని ఆక్రమణల్లో ఉన్న పేదలకు చెందిన ఇళ్లను క్రమబద్ధీకరిస్తారు.
* అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను పరిరక్షించాలని నిర్ణయించారు. ఇందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు.
* భూ ఆక్రమణలు, భూకబ్జాలను తీవ్రంగా పరిగణించాలి. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను జీఓ 80 ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలపై జిల్లాల వారీగా సమగ్ర విచారణకు ఆదేశించారు.వాటి జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తారు.
* అమరావతిలో రాష్ర్ట రాజధానిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో అరిహంత్, ఇండో ఆఫ్రికన్ ఇన్‌ఫ్రాడెవలపర్స్ అండ్ బిల్డర్స్ వద్ద 22.72 ఎకరాలను మంగళగిరి మండలం నవలూరులో ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి సమానమైన స్థలాన్ని కేపిటల్ రీజియన్ వెలుపల ఇస్తారు.
* విశాఖపట్నంలోని అల్ఫ్రాటెక్ ఆధీనంలో ఉన్న 1,400 ఎకరాల్లో ప్రభుత్వం ఇచ్చిన సమయంలోగా నిర్మాణం చేపట్టనందున వాటిని స్వాధీనం చేసుకుని ఐటీ, పరిశ్రమలకు ఇవ్వాలని నిర్ణయించారు.
* అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలని, ప్రధాని మోదీ సూచన మేరకు కజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్ వంటి దేశాల్లో పర్యటిస్తారు.తొలి దశలో మం త్రులు, రెండో దశలో సీఎం పర్యటించి తుది నిర్ణయం తీసుకుంటారు.
* సీడ్ కేపిటల్, కేపిటల్ సిటీ. కేపిటల్ రీజియన్ రోడ్ మ్యాప్‌లను మంత్రివర్గం ఆమోదించింది. సీడ్ కేపిటల్‌కు అక్టోబర్ 22న 3వేల ఎకరాల్లో ప్రధానిచే శంకుస్థాపన చేయిస్తారు. సీఆర్‌డీఏ రెగ్యులేషన్ అథారిటీగాను, సీసీడీఏ ఆపరేషన్ అథారిటీగాను ఉంటాయి. అమరావతి అభివృద్ధికి సింగపూర్, జపాన్ ప్రభుత్వాలను ఆహ్వానిస్తారు. ప్రపంచ పారిశ్రామిక రాజధానిగా ఉన్న షాంఘై మాదిరిగా ఆసియా దేశాలకు అమరావతి కేపిటల్ సిటీ నిర్మించాలని నిర్ణయించారు.
* పట్టిసీమకు ఆగస్ట్ 15లోగా మొదటి దశలో నీటిని విడుదల చేయాలని, పోలవరం సకాలంలో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పట్టిసీమకు 266 ఎస్కులేటర్లు ఏర్పాటు చేస్తారు.
* 25న పుష్కరాల ముగింపు రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటిలో పుష్కర దీపారాధన చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. అదే రోజు గోదావరికి హారతి, లేజర్‌షో నిర్వహిస్తారు. సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి మంత్రులు, అధికారుల కార్యాలయాలను మంగళగిరికి తరలించాలని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్మానించారు.
సమ్మెపై ఉక్కుపాదం
Published Thu, Jul 23 2015 1:01 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement