మంత్రులకు సీఎం క్లాస్!
♦ విపక్షాల ఆరోపణలపై సరిగా స్పందించడం లేదని ఆగ్రహం
♦ అసెంబ్లీ సమావేశాల్లో సమర్థంగా వ్యవహరించాలని సూచన
సాక్షి, హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలు సహా అనేక అంశాల్లో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సందర్భంలో మంత్రులు స్పందిస్తున్న తీరు ఏమాత్రం బాగా లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా స్పందించాలని సూచించినట్లు సమాచారం. శనివారం 5గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతుల ఆత్మహత్యలతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న అనేక ఆరోపణలపై చర్చ జరిగింది. నూతన పారిశ్రామిక విధానానికి అంతటా ప్రశంసలు వస్తున్నాయని, తన చైనా పర్యటన సందర్భంగా పారిశ్రామికవేత్తలు దీనిని గుర్తుచేశారని చెప్పిన సీఎం, ఇక్కడ కొందరు మంత్రులు మాత్రం ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల ఆత్మహత్యలకు సంబంధించి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏదో చెప్పబోతుండగా, ఆయన తీరు తాను ఆశించిన రీతిలో లేదని సీఎం ఒకింత ఆగ్రహంతో అన్నట్లు తెలిసింది. ఇదే అంశంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిపైనా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని, దీన్నీ ప్రతిపక్షాలు రాజకీయం చేసే ప్రయత్నం చేయడం దారుణమన్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ఎన్‌కౌంటర్ ప్రభుత్వానికి అపప్రథ తెచ్చిపెట్టిందన్న భావన వ్యక్తమైంది. అయితే హోం మంత్రి నాయిని వివరణతో కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కడిగి పారేస్తా..!
వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపైనా క్షుణ్నంగా సమాధానాలు చెప్పాలని మంత్రులను సీఎం ఆదేశించారు. రైతుల ఆత్మహత్యలపై తాను సభలో వివరణ ఇస్తానని, కాంగ్రెస్ రాజకీయాన్ని కడిగి పారేస్తానని చెప్పినట్లు తెలిసింది. దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు మంత్రులంతా హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం.