ఉభయ తారక ‘మద్యం’ | ubhaya Taraka 'Alcohol' | Sakshi
Sakshi News home page

ఉభయ తారక ‘మద్యం’

Published Thu, Aug 6 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

ఉభయ తారక ‘మద్యం’

ఉభయ తారక ‘మద్యం’

పల్లెల్లో అధికారిక బెల్ట్‌షాపులు!
సాక్షి, హైదరాబాద్: పల్లెల్లో గుడుంబా విక్రయాలు, బెల్టుషాపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఉభయ తారక మంత్రం వేయబోతుంది. మండలంలో మద్యం దుకాణం పొందిన డీలర్‌కే గుడుంబా, బెల్టుషాపులు లేకుండా చేసే అధికారం కట్టబెట్టబోతోంది. అదే సమయంలో మద్యం దుకాణం (ఎ4) లెసైన్స్ పొందిన డీలర్ ఆ మండలంలో గుర్తించిన గ్రామాల్లో బి-లెసైన్స్ ద్వారా అధికారికంగా దుకాణాలు నడుపుకునే స్వేచ్ఛను ఇవ్వనుంది. మండలంలో 2014-15లో అమ్మకాలు, ఎక్సైజ్ శాఖకు చెల్లించిన రుసుముల ఆధారంగా లెసైన్సు ఫీజును నిర్ణయించి ఏడాది కాలానికి వ్యాపారాన్ని అప్పగించనుంది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మద్యం విధానంపై కసరత్తు చేసిన ఆబ్కారీ శాఖ ఈ మేరకు ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను  ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్ శర్మకు అందజేశారు. ఆయన కమిషనర్‌తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయి కొత్త విధానంలోని లోటుపాట్లను తెలియజేయగా, సీఎం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో బుధవారం కూడా సచివాలయం స్థాయిలో కమిషనర్ చర్చలు జరిపారు. గురువారం కమిషనర్ జిల్లాల వారీగా డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమావేశమై లెసైన్సు ఫీజులను నిర్ధారించనున్నట్లు సమాచారం.
 
మండలంలో ఒక్కరే యజమాని
కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో లేని మండలాల్లో ప్రస్తుతం రెండు నుంచి ఐదు వరకు మద్యం దుకాణాలున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటికి లెసైన్సులు ఇచ్చారు. అయితే ఈసారి మద్యం విధానంలో మండలాన్ని యూనిట్‌గా నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఆ మండ లంలో మద్యం వ్యాపారమంతా ఒక వ్యక్తి చేతుల మీదుగానే సాగుతుంది. ఫీజును కూడా అదే స్థాయిలో నిర్ధారించనున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం 10వేల నుంచి 50వేల జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజుగా ఉంది.

ఆ మండలంలో 4 మద్యం దుకాణాల వరకు లెసైన్సుల జారీకి అవకాశం ఉంది. 4 దుకాణాలకు లెసైన్సు రూ.1.36 కోట్లు అవుతుంది. ఇక లెసైన్సు ఫీజు కన్నా ఏడురెట్లు పైబడిన వసూళ్లతో మద్యం అమ్మితే చెల్లించిన ప్రివిలేజ్ ఫీజును కూడా ఈ లెసైన్సు ఫీజుకు జత చేస్తారు. ఈ లెక్కన గతంలో జరిగిన అమ్మకాల ఆధారంగా మండ లానికి రూ. 1.50 కోట్ల వరకు ఫీజు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంత మొత్తంలో చెల్లించే స్తోమత ఉన్నవారే డ్రాలో పాల్గొంటారు.
 
మునిసిపాలిటీల్లో వార్డుల వారీగా..
ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ‘గ్రూపు లెసైన్స్’ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వార్డుల్లో దుకాణాలు, వ్యాపారం ఆధారంగా ఒక వ్యక్తి లేదా గ్రూపుగా ముందుకొచ్చిన వారికి లెసైన్సు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక మద్యం విధానం తీసుకు రావాలని సీఎం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో దానిపైనా ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది.
 
గుడుంబా, బెల్టుషాపులు ఉండవిక!
మండలంలో మద్యం వ్యాపారానికి సంబంధించి లెసైన్సు ఒకరికే ఇవ్వడంతో పాటు రూ.15 మద్యం కూడా అందుబాటులోకి తెస్తుండడంతో గుడుంబాను గ్రామాల్లో నుంచి తరిమికొట్టే బాధ్యత కూడా అదే వ్యాపారి తీసుకుంటాడని ప్రభుత్వం భావిస్తోంది. గుడుంబా, బెల్టుషాపుల ద్వారా అనధికారిక అమ్మకాలు సాగితే తన వ్యాపారానికి దెబ్బపడే అవకాశం ఉండటంతో వీటిని ఆ వ్యాపారే నిరోధిస్తాడని ప్రభుత్వ నమ్మకం. అలాగే గుడుంబా ఎక్కువగా విక్రయించే గ్రామంలో అధికారికంగానే బి-లెసైన్సు మద్యం దుకాణం తెరవడం వల్ల రూ.15 మద్యం అందుబాటులోకి వ స్తుందని, జనం నాటుసారా జోలికి పోరని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement