తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. బుధవారం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తుల అనుమానాలను నివృత్తి చేస్తామంటూ అధికారులు గురువారం గ్రామసభ నిర్వహించారు. ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ, తుగ్గలి, పత్తికొండ ఎస్‌ఐలు, భారీగా పోలీసులు వచ్చారు. ఈ సభ గందరగోళంగా మారింది. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ గ్రామసభలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు మాట్లాడుతూ 607 సర్వే నంబరులో 102.54 ఎకరాలున్న చెన్నంపల్లి కోట విజయనగర రాజుల కాలం నాటిదని చెప్పారు.