
ఎవరికి వారే..జనం బేజారే..!
బంజారాహిల్స్: విద్యుత్ అండర్‌గ్రౌండ్ కేబుల్ పనుల్లో శాఖల మధ్య సమన్వయం కుదరక.. పనుల్లో జాప్యం జరుగుతోంది. చలికాలంలో చేయాల్సిన పనులను వర్షాకాలంలో చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్ కాలనీ ప్రధాన రోడ్డుతో పాటు యూసుఫ్‌గూడ ఆర్‌బీఐ చౌరస్తా, శాలివాహన నగర్ ప్రాంతాల్లో కేబుల్ తవ్వకాలతో రహదారులు శిథిలమయ్యాయి. ఎటు చూసినా గోతులతో మృత్యుకుహరాలుగా మారాయి. రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్న అధికారులు ఇప్పటికీ సగం పనులు కూడా పూర్తిచేయకపోవడంతో రహదారులు బురదమయమై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
మార్చి 15న శ్రీనగర్‌కాలనీ మెయిన్ రోడ్డులో 132 కేవీ ఎలక్ట్రికల్ అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ పనులు ప్రారంభించిన అధికారులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎమ్మార్టీ ఇంజినీర్లకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. గత నెల 20న పనులను పూర్తి చేయాల్సి ఉంది.
అయితే పనులు పూర్తికాకపోవడంతో ఎక్కడి గోతులు అక్కడే ఉన్నాయి. రోడ్లపై మట్టి పేరుకుపోవడంతో వాననీరు నిలిచి బురదమయమవుతోంది. వారం రోజుల్లో పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు చెబుతుండగా, రెండు వారాలు పడుతుందని ట్రాన్స్‌కో ఇంజినీర్లు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్ మాత్రం ఇప్పట్లో పూర్తి కాదని చేతులెత్తేశాడు. ఇలా ఎవరికివారు పొంతన లేకుండా సమాధానాలు చెబుతుండటంతో స్థానికులు ఆయోమయానికి లోనవుతున్నారు.
ట్రాన్స్‌కో ఇంజినీర్లతో చర్చించాం
శ్రీనగర్ కాలనీ ప్రధాన రోడ్డుతో పాటు శాలివాహననగర్ రోడ్డులో 132 కేవీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ లైన్ పనుల్లో జాప్యంపై ట్రాన్స్‌కో డీఈ వేణుగోపాల్, ఏఈ సత్యనారాయణలతో చర్చించాం. పలుచోట్ల రాయి పడటంతో పనుల్లో జాప్యం జరుగుతున్నదని వారు చెబుతున్నారు. ఇకపై జాప్యాన్ని సహించేది లేదని వారిని హెచ్చరించడంతో వారం రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
- జీహెచ్‌ఎంసీ ఎంఆర్‌డీ ఈఈ అశోక్‌రెడ్డి
రెండు వారాల్లో పూర్తి చేస్తాం
కేబుల్ పనుల్లో పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి.రాయి రావడంతో జాప్యం జరుగుతున్నది. రెండు వారాల్లో పనులు పూర్తి చేస్తాం. కొరియాకు చెందిన ఎల్జిన్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ ఈ పనులను నిర్వహిస్తోంది. జాయింట్ బేలు చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాయి వస్తుండటంతో జీహెచ్‌ఎంసీ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాం. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం.
- సైట్ సూపర్‌వైజర్ నాగసురేష్
వారం రోజుల్లో పూర్తి చేస్తాం
అండర్‌గ్రౌండ్ 132 కేవీ ఎలక్ట్రికల్ కేబుల్ పనులు నాలుగు భాగాలు విభజించడం జరిగింది. ఇప్పటికీ మూడు స్కెచ్‌లు పూర్తి చేశాం. ఇంకో స్కెచ్‌లో రాయి రావడంతో జాప్యం జరుగుతున్నది. వారం రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాము.
- ట్రాన్స్‌కో డీఈ వేణుగోపాల్