సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖనిజం.. మైనింగ్ మాఫియాకు సిరులు కురిపిస్తోంది.. అధికారుల కళ్లుగప్పి మాంగనీస్ వ్యాపారులు సరిహద్దులు దాటిస్తున్నారు.. అనుమతి లేనిచోట తవ్వకాలు జరుపుతూ రూ.కోట్లు గడిస్తున్నారు.. గనులు, రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని దందా కొనసాగిస్తున్నారు.. ప్రభుత్వానికి గండి కొడుతున్నారు..
జిల్లాలో ఆదిలాబాద్, తాంసి, జైనథ్ మండలాల్లో మాంగనీస్(ఐరన్ ఓర్) లభిస్తుంది. సీజన్‌లవారీగా కంపెనీలు తవ్వకాల అనుమతి, లెసైన్స్, పర్యావరణ అనుమతి పొంది గనుల శాఖ సూచించే కొన్ని షరతులకు లోబడి తవ్వకాలు జరపాలి. లేకుంటే ఆ కంపెనీలకు మాంగనీసు తరలించేందుకు అనుమతిని మైనింగ్ అధికారులు ఇవ్వరాదు. నిబంధనలు తుంగలో తొక్కి కొన్ని కంపెనీలు రూ.కోట్ల విలువ చేసే మాంగనీసును మూడో కంటికి తెలియకుండా రాత్రిపూట సరిహద్దులు దాటిస్తున్నాయి.
ఇంకా మైనింగ్ శాఖ పర్యావరణ అనుమతి లేని కంపెనీలకు పర్మిట్లు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది క్రితం ఆదిలాబాద్ నుంచి ఆదిత్య మినరల్స్ పర్మిట్‌పై రాయల్టీ ఎగవేసి అక్రమంగా రాజస్థాన్‌కు తరలుతున్న లారీని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. కొంత మంది ప్రాస్పెక్టీవ్ లెసైన్స్(పీఎస్) అనుమతి తీసుకుని 200 టన్నుల మాంగనీసును తవ్వాల్సి ఉండగా వేలాది టన్నులు తవ్వుతూ ఏటా రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. నెలనెలా మామూళ్లు తీసుకునే భూగర్భగనుల శాఖ అధికారులు అక్రమంగా మైనింగ్ జరుపుతున్న ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్థలున్నాయి.
‘మామూలు’గా తీసుకుంటున్న మైనింగ్ శాఖ
ఆదిలాబాద్, తాంసి, జైనథ్ మండలాల్లో మాంగనీసు తవ్వకాల కోసం 16 కంపెనీలకు 12,200 ఎకరాల్లో అనుమతి ఉంది. అయితే చాలామంది వ్యాపారులు పర్యావరణ అనుమతి తీసుకోకుండానే మాంగనీసు తవ్వి తరలిస్తున్నారు. తమకు లీజు ఇచ్చిన స్థలంతోపాటు ప్రభుత్వ, రెవెన్యూ, ఫారెస్టు భూముల నుంచి కూడా అక్రమంగా మాంగనీసు తవ్వకాలు చేస్తున్నారు. ఈ విషయమై పలువురు లోకాయుక్తకు చేసిన ఫిర్యాదుపై జరిపిన విచారణలో తేలినా ఇప్పటివరకు అక్రమ మైనింగ్‌కు కళ్లెం పడలేదు.
అయితే ఇప్పుడు తవ్వకాలు జరపడం లేదని అధికారులను బుకాయిస్తున్నా, గుట్టుచప్పుడు కాకుండా కొందరు వ్యాపారులు 20 రోజులుగా ఆదిలాబాద్ నుంచి తరలిస్తుండంపై పోలీసు, రెవెన్యూశాఖల అధికారులకు ఇటీవలే ఫిర్యాదులు అందాయి. ఇదిలా వుంటే అక్రమ మైనింగ్‌కు తోడు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. బోర్‌వెల్ మిషన్లతో డ్రిల్‌చేసి పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తూ మాంగనీసు తవ్వకాలు చేపడుతున్న వ్యాపారులు, ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తుండటంపై చర్చ జరగుతోంది. అంతేగాకుండా మాంగనీసు తవ్వకాల్లో కొందరు ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదులుతూ ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ ఎగవేస్తున్నారు.
మైనింగ్ మాఫియా ఇష్టారాజ్యం
Published Thu, Nov 28 2013 2:50 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement