గుడి సమీపంలో బావిలొ తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు గుడి వెనుక కింద భాగంలో జరిపిన తవ్వకాలు
విజయనగరం, కొత్తవలస రూరల్: కొత్తవలస పంచాయతీ బలిఘట్టం గ్రామ సమీపంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయం వద్ద మూలవిరాట్టును ఆనుకుని వెనుక భాగంలో సుమారు మూడడుగుల మేర జరిగిన తవ్వకాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విగ్రహాన్ని సైతం పెకలించి దాని కింద తవ్వకాలు జరిగిన వైనం చూస్తుంటే గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేసుంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలనాటి రాజుల గుప్తనిధులు దాచి ఉంచారన్న సమాచారంతోనే ఈ తవ్వకాలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. సోమవారం భక్తుల కంట పడిన తవ్వకాల పనులు ఆదివారం రాత్రి జరిగి ఉంటాయని చెబుతున్నారు. ఈ తవ్వకాల వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని అపచారం జరిగిందని పేర్కొంటున్నారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలో మద్యం సేవిస్తుండడంతో ఆకతాయిలు చేసిన పనై ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు.
పెద్దాపురం రాజుల కాలం నుండి...
శ్రీవేణుగోపాలస్వామి ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నాటిదని పాతసుంకరపాలెం గ్రామపెద్ద పెదిరెడ్ల సూరిబాబు తెలిపారు. అప్పటి రాజులు స్వామికి నిత్యం పూజలు చేసేవారని నిత్య స్నానాధుల కోసం బావి కూడా తవ్వారని పేర్కొన్నాడు. ఈ ఆలయంలో అప్పటి రాజులు గుప్త నిధులు దాచారని చాలా కాలంగా ప్రచారం సాగుతుందని గతంలో జీర్ణావస్థకు చేరుకున్న ఆలయానికి 1987లో పునఃనిర్మాణ పనులు చేపట్టే సమయంలో రాగి చెంబు ఒకటి తవ్వకాల్లో దొరికిందని అప్పటి నుంచి ఈ ఆలయం వద్ద గుప్త నిధులు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగలు తవ్వకాలు జరిపి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తవ్వకాల వద్ద క్షుద్ర పూజలు
ఆలయం వెనుక తవ్విన ప్రాంతంలో తవ్వడానికి ముందు వివిధ రకాల పూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లు కనిపించాయని బహుసా క్షుద్రపూజలు ఏమైనా నిర్వహించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా గుప్త నిధులు ఉన్నాయా ఏమైనా తస్కరించారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. దేవుని విగ్రహం పగులగొట్టి తవ్వకాలు జరపటం అపచారంగా భావిస్తున్నామని పోలీసులకు సమాచారం అందించామని పెదిరెడ్ల సూరిబాబు తదితరులు తెలిపారు. బుధవారం సీఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో వచ్చి ఆలయ ప్రాంగణం పరిశీలన చేసారని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment