బతుకులు.. కూలుతున్నాయ్!
► ఉచిత ఇసుక పాలసీతో ఎడా పెడా తవ్వకాలు
► ప్రమాదకర సొరంగాల్లో తోడేస్తున్న వైనం
► ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆరుగురి కూలీల మృతి
► బెరైడ్డిపల్లె పెద్ద చెరువులో మరో ఇద్దరు జలసమాధి
పలమనేరు : ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసినప్పటి నుంచి ఆ తవ్వకాలు ఊపందుకున్నాయి. కూలీలకు విఫరీతమైన డిమాండ్ ఏర్పడింది. అధిక మొత్తంలో కూలీ డబ్బులిస్తామని ట్రాక్టరు యజమానులు ఆశచూపుతున్నారు. ప్రమాదకర సొరంగాల్లో పనులు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక దిన్నె లు మీదపడి పలువురు కూలీలు మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే పలమనేరు ప్రాం తంలో ఆరుగురు మృతిచెందారు. బుధవా రం బెరైడ్డిపల్లె సమీపంలోని పెద్ద చెరువులో ఇద్దరు కూలీలు జలసమాధి అయ్యారు.
ఎటు చూసినా ఇసుక త వ్వకాలే...
పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య నదితో పాటు పలు చెరువుల్లో ప్రస్తుతం భారీగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. కొత్త విధానంతో వాహనాలను ఉపయోగించరాదు కాబట్టి కూలీలకు డిమాండ్ ఏర్పడింది. నాణ్యత కల్గిన ఇసుక కోసం వీరు 15 అడుగుల దాకా అత్యంత ప్రమాదకరంగా సొరంగాలు తవ్వి మరీ ఇసుక తోడేస్తున్నారు. నియోజకవర్గంలోని నాగమంగళం, రామాపురం, బొమ్మిదొడ్డి, గంగవరం మండలంలోని కౌండిన్యనది, పంజాణి మండల సరిహద్దులోని పలు చెరువులు, బెరైడ్డిపల్లె మండలలోని చెరువులు, వీకోట మండలంలోని పాలేరు నదుల్లో కూలీలు సొరంగాల్లా తవ్వి ప్రమాదకర పరిస్థితుల్లో ఇసుకను తోడుతున్నారు.
మూడు పూటలా భోజనం, రూ.500 కూలీ
ఇసుక తవ్వే కూలీలకు మూడు పూటలా భోజనం పెట్టి రూ.500 దాకా ఇస్తున్నారు. అధిక కూలీలకు ఆశ పడిన కూలీలు ఈ ప్రమాదకర పనులను చేస్తున్నారు. ఈ మధ్యనే బెరైడ్డిపల్లె పెద్ద చెరువులో రాత్రి పూట ఇసుకను తోడుతూ ఓ యువకుడు ఇసుక దిన్నె కింది పడి మునిగిపోయాడు. అయితే అక్కడున్న ఇతర కూలీలు అతన్ని కాళ్లుపట్టి వెంటనే లాగేయడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
ప్రభుత్వ ఆదేశాలు గాలికి
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు మీటర్ల కంటే లోతు ఇసుక తవ్వరాదు. కానీ ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. చెరువులు, వాగులు, వంకల్లో ఇసుకను తోడుతుంటే ఎంత లోతు తవ్వారు, పనులు ఎలా చేస్తున్నారని పర్యవేక్షించేవారే లేకుండా పోయారు. దీనిపై ఏ శాఖకు పర్యవేక్షణ ఉందో కూడా తెలియదు. ఈ మధ్యనే ప్రభుత్వం ప్రతి మండలంలోనూ కొన్ని రీచ్‌లను గుర్తించి వాటి నుంచే ఇసుకను తోడాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వీటి నుంచి కాకుం డా అక్రమార్కులు కౌండిన్య నదికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు, రైతుల సెటిల్‌మెంటు భూముల్లో ఇసుకను యథేచ్ఛగా తోడుతున్నారు.
ఉన్నట్టుండి కూలిపోతాయి
ముఖ్యంగా చెరువుల్లో ఇసుక తోడడం చాలా ప్రమాదకరం. మొదట చెరువులోని బంకమట్టిని తొలగిం చాలి. ఆపై లోతుగా సొరంగాలు తవ్వుకుంటూ వెళ్లాలి. ఇలాంటి సమయంలో పై నున్న ఇసుక దానిపై ఉండే బరువైన మట్టి కారణంగా ఇసుక దిన్నెలు సెకన్ల వ్యవధిలో జారిపోతాయి. దీంతో కింద ఉండే కూలీలు అక్కడే సమాధి కావాల్సిందే. కనీసం తప్పించుకోవడానికీ సమయం ఉండదు. బుధవారం బెరైడ్డిపల్లె పెద్ద చెరువులో జరిగిన ప్రమాదం కూడా ఇలాగే సంభవించింది.