ఉచితం ముసుగులో అక్రమాలు
► ఇసుక తవ్వకాలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్సీ డీవీ
► విచారణ జరపాలని డిమాండ్
కైలాసపట్నం (కోటవురట్ల): ఉచిత ఇసుక ముసుగులో అక్రమాలకు తెగబడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ సెల్ అధ్యక్షుడు డి.వి.సూర్యనారాయణరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కైలాసపట్నంలోని వరాహనదిలో ఇసుక రీచ్‌లో తవ్వకాలను శనివారం రైతుల ఆధ్వర్యంలో ఆయన అడ్డుకున్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు సునీలారాణికి తక్షణమే తవ్వకాలు నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు. అనుమతులకు మించి ఇసుకను అక్రమంగా పట్టుకెళ్లిపోతున్నారని ఆరోపించారు. మైనింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖలతో విచారణ జరిపి ఇప్పటివరకు ఎంత ఇసుక పట్టుకెళ్లారో తేల్చాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తవ్వకాలను జరగనీయమని స్పష్టం చేశారు.
రైతాంగానికి ఇంత నష్టం జరుగుతుంటే ప్రభుత్వం కళ్లు అప్పగించి చూస్తోందని విమర్శించారు. 14,500 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించాల్సి ఉండగా ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల్లో అంతకు మించి పట్టుకెళ్లారని ఆరోపించారు. ఉచిత ఇసుకను నర్సీపట్నానికి చెందిన ఓ వ్యక్తి కైలాసపట్నంలో డంపింగ్ చేసుకుని నిబంధనలను అతిక్రమిస్తున్నారని మాజీ సర్పంచ్ సిద్దాబత్తుల నాగేశ్వర్రావు ఆరోపించారు. మున్సిపాలిటీకి తరలిస్తున్నామని సాకు చూపుతూ కైలాసపట్నంలో డంపింగ్ చేసి విక్రయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాజుపేటకు చెందిన ప్రసాద్ మాట్లాడుతూ నిబంధనలను అతిక్రమించి నది ఒడ్డును ఆనుకుని మీటరు లోతుకు మించి తవ్వకాలు జరుపుతునఔన్నందున రైతుల పంట భూములకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. దీనిపై తహసీల్దార్ సునీలారాణి మాట్లాడుతూ ఎయిర్‌పోర్టుకు 4 వేల క్యూబిక్ మీటర్లు, నర్సీపట్నం మున్సిపాలిటీకి 900 క్యూబిక్ మీటర్ల ఇసుకకు ఆర్డీవో అనుమతులు ఇచ్చారన్నారు. ఎయిర్‌పోర్టుకు చెందిన వాహనాలు నదిలోకి వెళ్లే పరిస్థితి లేనందున నదికి సమీపంలో డంపింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్ చేయడానికి అనుమతులు లేవని అలా చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.