ఆగని ఇసుక అక్రమ రవాణా
► అనధికారిక సీనరేజీ వసూలు యథాతథం
► నిరుపయోగంగా పోలీస్ చెక్‌పోస్టులు
► తెలంగాణకు తరలిపోతున్న ఇసుక
తిరువూరు : ఇసుక ఉచితంగా తోలుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించినా తిరువూరు మండలంలో ప్రజల నుంచి కొందరు సిం డికేట్లు ముక్కుపిండి మరీ డబ్బులు దం డుకుంటున్నారు. గానుగపాడు, చింతల పాడు వాగుల్లో ఇంకా మిగిలిన కొద్దిపాటి ఇసుకను రోజుకు 50 నుంచి 60 ట్రక్కుల లో నింపి తెలంగాణాకు తరలిస్తున్నారు. స్థానికులు ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒక్కొక్క ట్రాక్టరుకు రూ.300 చొప్పున సీనరేజీ వసూలు చేస్తున్నారు.
దొడ్డిదారిన అక్రమ రవాణా
చింతలపాడు నుంచి ముష్టికుంట్ల, వామకుంట్ల మీదుగా ఎన్‌ఎస్‌పీ కాలువ కట్టపై వెంకటేశ్వరనగర్ చేరుతున్న ఇసుక ట్రా క్టర్లు ఖమ్మం జిల్లాలోని ఎర్రబోయినపల్లి మీదుగా కల్లూరు వెళుతున్నాయి. ఈ మా ర్గంలో ఎక్కడా పోలీసు చెక్‌పోస్టు లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా అడ్డుకునే అవకాశంలేదు. పోలీసులు తిరువూరు బై పాస్‌రోడ్డు, రాజుపేట, అక్కపాలెం, వేమిరెడ్డిపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వైపునకు వెళ్లకుండా దొడ్డిదారిలో ఇసుకను తరలిస్తున్నారు. దీంతో చెక్‌పోస్టులు నిరుపయోగంగా మారాయి.
గ్రామ కమిటీల పేరుతో వసూలు
ఇసుక ఉచితంగా తెచ్చుకునే వారి నుంచి గ్రామ కమిటీల పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారు. దేవాలయాల అభివృద్ధి, గ్రామంలో కొత్త దేవాలయాల నిర్మాణం పేరు చెబుతూ కొందరు డబ్బు వసూలు చేస్తుండగా, తమ పొలం సమీపం నుంచి ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నందున డబ్బులు ఇవ్వాలని పెద్ద రైతులు డిమాండ్ చేస్తున్నారు. చింతలపాడు, గానుగపాడు, వామకుంట్ల గ్రామాల్లో నిత్యం వేలాది రూపాయలు అనధికారిక వసూళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.