సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాదేదీ దోచుకునేందుకు అనర్హమనే రీతిలో ఇసుక, మట్టి నుంచి రాజధాని భూముల వరకూ చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఏకంగా చరిత్రాత్మకమైన కోటపై ఉన్న గుడి సంపదపైనా కన్నేశారు. ఆ సంపదను దిగమింగేందుకు ఏకంగా ప్రభుత్వ అధికారులనే రంగంలోకి దింపారు. కర్నూలు జిల్లాలో చెన్నంపల్లి కోటపై ఉన్న పీర్ల గుడికి సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతుండడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోటపై పెద్ద కడియాల స్వామికి చెందిన పీర్లు దొరికాయని, మొహర్రం సందర్భంగా కోటపైనే గ్రామస్తులంతా అలాయి గుంత తవ్వుకుని పీర్లస్వామిని ఎత్తుకోవడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు. కోటపై అత్యంత విలువైన గుప్త నిధులు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ గుప్త నిధులపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారని, వాటిని దోచుకునేందుకు అధికారులను సైతం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు
చెన్నంపల్లి కోటలో ఈ నెల 13న మొదలైన తవ్వకాలు 8 రోజులుగా అధికారుల పర్యవేక్షణ మధ్య కొనసాగుతున్నాయి. బంగారం, వజ్రాల కోసం అన్వేషిస్తున్నామని మొదట్లో చెప్పిన అధికారులు.. ఇప్పుడు విలువైన ఖనిజాల కోసం అంటూ మాట మారుస్తుండడం గమనార్హం. ఇక్కడ నిధులు వెలికితీస్తామని ఒక ప్రైవేట్ ఏజెన్సీ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) దరఖాస్తు చేసుకుందని, అక్కడి నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు రావడంతో తవ్వకాలు సాగిస్తున్నామని బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తవ్వకాలు చేపడుతున్నామని, ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. ఎనిమిది రోజులుగా సాగుతున్న తవ్వకాల్లో ఇప్పటిదాకా ఇటుకలు, ఎముకలు మినహా ఏమీ బయటపడలేదు. అయితే, కోటపై పవిత్రమైన గుడికి సమీపంలో ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అంటున్నారు.
గుప్త నిధుల కోసం కాదట!
గుప్త నిధుల కోసం కాదు, విలువైన ఖనిజాల కోసమే చెన్నంపల్లి కోటలో తవ్వకాలు సాగిస్తున్నట్లు ఆదోని ఆర్డీవో బుధవారం చెప్పారు. మరికొన్ని రోజులు ఈ తవ్వకాలు చేపడతామన్నారు. వాస్తవానికి ఈ కోటలో విలువైన ఖనిజాలు ఉన్నాయని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ) గానీ, రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులు గానీ గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా ఏయే ఖనిజాలు ఉన్నాయో ప్రభుత్వం బహిర్గతం చేయాలి. ఆ తర్వాతే తవ్వకాలు చేపట్టాలి. ముందస్తుగా ఏ విషయం చెప్పకుండానే తవ్వకాలు సాగించడం మైనింగ్ కన్‌సెషన్ నిబంధనలకు (ఎంసీఆర్) విరుద్ధమే. విమర్శలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే గుప్త నిధుల కోసం కాదు, ఖనిజాల కోసమే అన్వేషణ అంటూ ప్రభుత్వ పెద్దలు నమ్మబలుకుతున్నట్లు తెలుస్తోంది.
పవిత్రమైన గుడి పక్కన తవ్వకాలా?
‘‘మా గ్రామానికి సమీపంలోని చెన్నంపల్లి కోటపై పెద్ద కడియాల స్వామి పీర్లు దొరికాయి. కోటపైనే గుడి, అలాయి గుంత ఉంది. పవిత్రమైన ఈ గుడికి సమీపంలోనే తవ్వకాలు జరుపుతుండడం దారుణం’’
– మహమ్మద్, చెన్నంపల్లి
చరిత్రక కట్టడంపై తవ్వకాలు వద్దు
‘‘మా ఊరి కోటపై అధికారులు తవ్వకాలు చేపట్టడం మంచిది కాదు. గతంలోనూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. అప్పుడు మేం అధికారులకు ఫిర్యాదు చేసి అడ్డుకున్నాం. ఇప్పుడు నేరుగా ప్రభుత్వ అధికారులే దగ్గరుంచి మరీ తవ్వకాలు జరిపిస్తున్నారు. చరిత్రక కట్టడమైన కోటపై, పీర్లగుడి పక్కన తవ్వకాలు జరపడం తగదు’’
– సుధాకర్‌రెడ్డి, చెన్నంపల్లి
Comments
Please login to add a commentAdd a comment