క్షుద్ర పూజలతో వణికిపోతున్న వికారాబాద్‌ ప్రజలు.. పుర్రె, విగ్రహం లభ్యం | Superstition in rural areas More And Some Mens Perform Witchcraft | Sakshi
Sakshi News home page

Vikarabad-Witchcraft: క్షుద్ర పూజలతో వణికిపోతున్న వికారాబాద్‌ ప్రజలు.. పుర్రె, విగ్రహం లభ్యం

Published Fri, Dec 10 2021 11:02 AM | Last Updated on Fri, Dec 10 2021 4:32 PM

Superstition in rural areas More And Some Mens Perform Witchcraft - Sakshi

దోమ (వికారాబాద్‌): పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న నేటి హైటెక్‌ సమాజంలోనూ మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. ఇలాంటి కోవలోకి వచ్చే ఘటనలు కొన్ని  దోమ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో తరచూ జరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా వారం రోజుల క్రితం ఖమ్మం నాచారం గ్రామం చెరువు దగ్గర ఉన్న అటవీ ప్రాంతాంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం కలకలం రేకెత్తించింది. దీంతో పూజలను చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 

గుప్త నిధుల అన్వేషణలో..  
గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల అన్వేషణలో పడి పూజలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలు మండల ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.   మండల పరిధిలోని దిర్సంపల్లి, పాలేపల్లి గ్రామల మధ్యలో ఉన్న ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వేశారు.  కొండయపల్లిలోని పోచమ్మ ఆలయం సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలను జరిపారు.

బడేంపల్లిలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. గుండాల గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం రాత్రి వేళల్లో క్షుద్రపూజలు చేస్తూ తవ్వాకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో ఓ విగ్రహంతో పాటు ఓ మనిషి పుర్రె లభ్యమైనట్లు గ్రామస్తులు అనుమానించి అధికారులకు తెలిపారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ఓ కారు గుర్తించి తనిఖీ చేశారు. కారులో గుప్త నిధుల్లో వెలికి తీసిన ఓ విగ్రహం బయటపడింది. బయటపడ్డ విగ్రహం పోలీసులకు అప్పగించారు. 

మంత్రతంత్రాలను నమ్ముతూ..  
గ్రామీణ ప్రాంత ప్రజలు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. ఆస్పత్రులకు వెళ్లకుండా మంత్రాలు చేసే వ్యక్తుల దగ్గరకు వెళ్లి క్షుద్రపూజలతో పాటు తదితర పూజలు నిర్వహించుకుంటున్నారు. వీటిని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పొలం దగ్గరకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుని  క్షుద్రపూజలు, మూఢనమ్మాకాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.  

గుండాల సమీపంలో గుప్తనిధుల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహం,  ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుప్తనిధుల కోసం తవ్వకాలు

భయాందోళనకు గురవుతున్నాం... 
గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు   సంచరిస్తూ గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఇలాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు  నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి.  
యాదయ్య, ఖమ్మంనాచారం గ్రామం  

అవగాహన లేకపోవడం వల్లే.. 
మూఢనమ్మకాలపై పల్లెవాసులకు అవగాహన లేకపోవడం వల్లే       మంత్రాలను నమ్ముతున్నారు. ఆయా గ్రామాలలో మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులంటూ ఎన్నో రకాల పూజలు నిర్వహిస్తున్నారు. వాటితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూఢనమ్మకాల నివారణకు అధికారులు   చర్యలు చేపట్టాలి.  
– నిమ్మలి వెంకటమ్మ, కొండయపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement