► గుప్తనిధులకోసం పెకిలించి ఉంటారని ఆరోపణ
► సంఘటన స్థలాన్ని పరిశీలించిన ముగ్గురు ఎస్‌ఐలు
శాంతినగర్ : గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం దేవుడి విగ్రహాలను పెకిలించారు. ఈ సంఘటన వడ్డేపల్లి మండలం తనగల గట్టులో చోటుచేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తనగల గట్టుపై వెలసి న తిమ్మప్ప స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. ఆలయ పూజారి పాండురంగయ్య ఎప్పటిలాగే శనివారం సాయంత్రం స్వామివారి ఆలయాన్ని మూసి తాళాలువేసి వెంకటాపురం చేరుకున్నాడు. బుధవారం పౌర్ణమి కావడంతో ఉదయం వెంకటాపురం భక్తులు కృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి పూజలు చేద్దామని పూజారితో ఆలయాన్ని చేరుకున్నారు. వారు వెళ్లేలోగా ఆలయం తలుపులు తెరుచుకుని ఉన్నాయి.
స్వామివారి మూల విరాఠ్ (పుట్టుశిల), వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని పెకిలించారు. వెంటనే అయిజ ఎస్‌ఐ రమేష్‌కు, సర్పంచ్ సత్యమ్మవేణుగోపాల్‌రెడ్డికి సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న తనగల సర్పంచ్ వాణిదివాకర్‌రెడ్డి శాంతినగర్ ఎస్‌ఐ జి.వెంకటేశ్వర్లకు జరిగిన సంఘటనను వివరించారు.
దీంతో స్పందిం చిన అయిజ, శాంతినగర్, రాజోలి ఎస్‌ఐ జయశంకర్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గట్టుపై ఆలయ సమీపంలో మద్యం సీసాలు, అల్పాహారాలు పడి ఉండటం, నాలుగు అడుగులమేర విగ్రహాల క్రింద తవ్వడం చూసిన పోలీసులు రాత్రి సుమారు ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు మద్యంతాగి విగ్రహాలను ధ్వంసం చేసి ఉంటారన్నారు. ఆలయ పూజారులు పాండురంగయ్య, వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాంతినగర్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్ రామనాయుడు పేర్కొన్నారు.
విగ్రహాలను పెకిలించిన దుండగులు
Published Thu, Mar 24 2016 2:12 AM | Last Updated on Sun, Sep 2 2018 3:44 PM
Advertisement
Advertisement