జనహారతి | suscessfully completed godhavari pushkarlu with jana harathi | Sakshi
Sakshi News home page

జనహారతి

Published Sun, Jul 26 2015 8:42 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

జనహారతి

జనహారతి

  •      పుష్కరుడు పులకరించిన వేళ!
  •      12 రోజుల్లో 2.92 కోట్ల మంది పుణ్యస్నానాలు
  •      మహాహారతితో ముగిసిన పన్నెండేళ్ల పండుగ
  •  పుష్కరుడు పులకరించేలా.... గోదారమ్మ పరవశించేలా పన్నెండేళ్ల పండుగ  వైభవంగా ముగిసింది. గోదావరి మహాపుష్కరాలు ఆరంభమైంది మొదలు ముగిసేవరకు భక్తులు వెల్లువలా తరలివచ్చారు. గతంలో ఏ పుష్కరాలకు లేనంతగా 12 రోజుల్లో 2,92,17,992 మంది భక్తులు జిల్లా వ్యాప్తంగా పుష్కర స్నానమాచరించారు. పన్నెండు రోజుల పండుగతోపుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలో 6 కోట్ల మందికి పైగాపుష్కరస్నానమాచరిస్తే అందులో సగం మంది మన జిల్లాకే వచ్చారు.
     సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
     గోదావరి మహా పుష్కరాలు ముగిశాయి. 14న ఉదయం 6.20 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా ధర్మపురిలో పుష్కరాలు ప్రా రంభించిన నాటి నుంచి మొదలు శనివారం సాయంత్రం 6.21 గంటలకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ దంపతుల చేతుల మీదుగా మహాహారతి కార్యక్రమంతో పుష్కర పండుగకు ఘన వీడ్కోలు పలికేంతవరకు జనం తండోపతండాలుగా పుష్కర ఘాట్లకు వస్తూనే ఉన్నారు. గోదావరి పుష్కరాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన దాఖలాల్లేవు. రాష్ర్టవ్యాప్తంగా 6 కోట్ల మందికిపైగా పుష్కర స్నానమాచరిస్తే అందులో సగం మంది కరీంనగర్ జిల్లాకే రావడం విశేషం. వీరిలో పుష్కర స్నానం చేసి వివిధ ఆలయాల్లో దైవదర్శనం చేసుకున్న వారు 1.73 కోట్ల మంది ఉన్నారు. సాధారణ భక్తులతోపాటు పుష్కర స్నానం చేసేందుకు జిల్లాకు తర లివచ్చిన ప్రముఖులెందరో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, సినీ, కళారంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు... ఇలా ప్రముఖులెందరో వచ్చారు. పన్నెం డు రోజుల పండుగతో పుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతిరోజు లక్షల మంది భక్తులతో ధర్మపురి దద్దరిల్లింది. కాళేశ్వరం కిటకిటలాడింది. కోటిలింగాల కోటేశ్వరుడి నామస్మరణతో ఊగిపోయింది. మంథని మహాజాతరలా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే.... గోదావరి పుష్కరాలు కరీంనగర్‌కు ప్రత్యేక శోభను సంతరించి వెళ్లాయి.
     కాళేశ్వరంలో...
     త్రిలింగ క్షేత్రం... త్రివేణి సంగమంలో 12 రోజుల పండగ మహా వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ కర్ణాటకతోపాటు ఇతర  రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య లో భక్తులు తరలివచ్చారు. 12 రోజుల్లో 83 లక్షల పైచిలుకు భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. ఇందులో 30 లక్షల మంది కాళేశ్వర ముక్తీరస్వామిని దర్శించుకున్నారు. అభిషేకాలు, దర్శన టికెట్లు, లడ్డూ, పులి హోర ప్రసాదాల ద్వారా రూ.1.40కోట్ల ఆదాయం ఆలయూనికి సమకూరింది. అంచనాకు మించి భక్తులు తరలిరావడంతో పలుమార్లు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. 5 నుంచి 8వ రోజు వరకు రోజుకు 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు తరలిరావడంతో కాస్త అసౌకర్యం తప్పలేదు. కాటారం నుంచి కాళేశ్వరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండు రోజులు కాళేశ్వరంలోనే బస చేయగా, స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు పన్నెండు రోజులు ఇక్కడే మకాం వేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఓఎస్డీ సుబ్బరాయుడు నిరంతర పర్యవేక్షణతో ట్రాఫిక్ సమస్య సహా భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా అపశ్రుతులు దొర్లాయి. పుష్కర స్నానానికి వస్తూ కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు, మంథని మండలం ఎగ్లాస్‌పూర్ వద్ద ఆరుగురు మృతి చెందారు. మహారాష్ట్రలోని వెంకటాపురానికి చెందిన ఒకరు, కథలాపూర్ మండలం తాం డ్రియాల సర్పంచ్ పానుగం టి శంకర్ అస్వస్థతతో మరణించారు. పుష్కరాలను రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించగా, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మహాహారతితో ముగింపు పలికారు.
     ధర్మపురి... భక్తకోటి
     ధర్మపురి పుష్కరఘాట్లలో 93 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు చేశారు. మొదటి నుంచే భారీగా తరలివచ్చారు. మొదటి రెండు రోజు లు భక్తుల సంఖ్య 1.50 లక్షల నుంచి 2.25 లక్షల మధ్యలో ఉండగా తరువాత రోజుల్లో భక్తజనం పెరిగింది. గడిచిన శని, ఆదివారాల్లో అత్యధికంగా జనం వచ్చారు. ట్రాఫిక్ ఇబ్బం దులతో భక్తులు సమస్యల పాలయ్యారు. స్పీకర్ మధుసూదనాచారితో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుష్కర స్నానాలు ఆచరించారు. ఆర్టీసీ వారు ధర్మపురిలో 60-100 ఉచిత బస్సులు నడిపి భక్తులకు ఘాట్ల వద్దకు చేర్చారు. ధర్మపురి గోదావరి పుష్కర స్నానాల అనంతరం లక్ష్మీనృసింహస్వామివారిని 50 లక్షల మంది దర్శించుకున్నారు. మొత్తం 12 రోజుల వ్యవధిలో గుడికి రూ.1.38 కోట్ల ఆదాయం సమకూరింది. సాయంత్రం ధర్మపురి అన్ని ఘాట్లలో పూర్ణాహుతి నిర్వహించడంతోపాటు మంత్రి ఈటల చేతుల మీదుగా మహాహారతి ఇచ్చి పన్నెండు రోజుల పండుగకు ముగింపు పలికారు.
     మంథని, గోదావరిఖనిలోనూ...
    మంత్రపురిగా పిలువబడే మంథనిలో సైతం పుష్కర గోదావరి పరవశించింది. పన్నెండు రోజుల్లో 24 లక్షల మంది భక్తులు పుష్కర స్నా నం చేశారు. పది లక్షల మంది భక్తులు గౌతమేశ్వరున్ని దర్శించుకున్నారు. గోదావరిఖని వద్దనున్న మూడుఘాట్ల వద్ద 12రోజులుగా 17.25 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు పుష్కరఘాట్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా జడ్జి నాగమారుతీశర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ఢిల్లీకి చెందిన బోర్డు డెరైక్టర్ డీఎన్ ప్రసాద్ గోదావరిఖని పరిసర ప్రాంత పుష్కరఘాట్లలో స్నానం చేసి వెళ్లారు.
    కోటిలింగాలలో 20 లక్షలు
    కోటిలింగాలలో పుష్కరాల మొదటిరోజు ప్రారంభమైన భక్తుల ప్రవాహ ఝరి చివరిరోజు వరకు కూడా తగ్గలేదు. శనివారం లక్ష మంది పుష్కరస్నానం చేశారు. మొత్తం 12 రోజుల్లో 20 లక్షలమంది స్నానమాచరించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు మొదలైన రద్దీ ఘాట్లు ముగిసే వరకు కొనసాగింది. మంత్రి ఈటల, చీఫ్ విప్ కొప్పుల, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కోటిలింగాల పుష్కర ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటిలింగాల పుష్కర ఘాట్ నుంచి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బోట్‌లో వెళ్లి వచ్చారు. కోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. డెప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement