
ప్రశాంతంగా ముగిసిన మాఘి పూర్ణిమ స్నానాలు
ప్రయాగ్‌రాజ్: మహా కుంభ మేళాలో మాఘి పూర్ణిమను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. జనవరి 29వ తేదీన పుణ్య స్నానాల సమయంలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో ఈసారి ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేశామని తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయం 4 గంటల నుంచే లక్నోలోని తన నివాసంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని వివరించింది.
త్రివేణీ సంగమంతోపాటు ఇతర ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవాన కురిపించామంది. మాఘి పూర్ణిమ స్నానంతో నెలపాటు కఠోర దీక్షలు చేసిన కల్పవాసీలు సుమారు 10 లక్షల మంది మహాకుంభ్‌ను వీడి వెళ్లనున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అనుసరిస్తూ, నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలను ఉపయోగించుకోవాలని వీరికి సూచించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు కుంభ్ ఎస్‌ఎస్‌పీ రాజేశ్ ద్వివేదీ చెప్పారు.
ఆపరేషన్ చతుర్భుజ్‌లో భాగంగా 2,750 హైటెక్ కెమెరాలు, డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించుకుని 24 గంటలూ నిఘా కొనసాగించినట్లు వివరించారు. మహాకుంభ్ ప్రాంతాన్ని మంగళవారం 4 గంటల నుంచే నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ నగరాన్ని సైతం నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. ఇందులో అత్యవసర, ఎమెర్జెన్సీ సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. పబ్లిక్, ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. అన్ని టోల్‌ప్లాజాల వద్ద రాకపోకలను క్రమబద్ధీకరించారు. భక్తుల కోసం ప్రతి 10 నిమిషాలకొకటి చొప్పున అదనంగా 1,200 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. 26వ తేదీ వరకు కొనసాగే మహాకుంభ్‌లో చిట్టచివరి అమృత్ స్నాన ఘట్టం మహాశివరాత్రి రోజున ఉంటుంది.
పలువురు ప్రముఖుల రాక
మాఘి పూర్ణిమ సందర్భంగా బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, తల్లి కోకిలా బెన్, కుమారులు, కోడళ్లు, మనవడు, మనవరాలు తదితరులతో కలిసి త్రివేణీ సంగమంలో స్నానాలు చేశారు. అదేవిధంగా, దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఆయన భార్య పుణ్యస్నానాలు చేశారు. వీఐపీ ప్రొటోకాల్స్‌ను బుధవారం నిలిపివేయడంతో కుంబ్లే దంపతులు మిగతా భక్తుల మాదిరిగానే పడవలో త్రివేణీ సంగమానికి పడవలో చేరుకుని, పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment