
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా(Kumbh Mela)కు భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఇప్పటివరకూ అంటే ఫిబ్రవరి 23 వరకూ మొత్తం 62 కోట్లకుపైగా జనం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజల మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలోనే గత నెలన్నర రోజులుగా కుంభమేళా ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న సిబ్బందిని సీఎం సత్కరించనున్నారు.
కుంభమేళా ప్రాంతంలో పరిశుభ్రతా కార్యక్రమాలు(Sanitation) నిర్వహిస్తున్న సిబ్బంది సేవలను సీఎం కొనియాడారు. అలానే వారిని సన్మానించనున్నామని తెలిపారు. ఆయన త్రివేణీ సంగమ ప్రాంతంలో తిరుగాడుతూ స్వయంగా అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మహాకుంభమేళా ముగిసేందుకు ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. మహాశిరాత్రి రోజున భక్తులు కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు. గడచిన నాలుగు రోజులుగా కుంభమేళా ప్రాంతానికి వస్తున్న సీఎం అక్కడి సాధువులను, అధికారులను కలుసుకుంటున్నారు.
కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు పూర్తియిన మర్నాడు అంటే ఫిబ్రవరి 27న సీఎం యోగి మరోమారు ప్రయాగ్‌రాజ్ రానున్నారు. ఆరోజున ఆయన కుంభమేళాకు తరలివచ్చిన భక్తులకు సేవలు అందించిన వారిని సన్మానించనున్నారు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులను, పడవలు నడిపినవారిని సీఎం సత్కరించనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు(sanitation workers) సమాజంలో తగిన గౌరవ కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో ప్రధాని మోదీ వారణాసిలో పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగి, సమాజంలో వారి స్థానాన్ని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..