
' చంద్రబాబు నిర్వాకం వల్లే తొక్కిసలాట'
హైదరాబాద్: సీఎం చంద్రబాబునాయుడు పుష్కరఘాట్లో ఉన్నపుడే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ కూడా ధృవీకరించారని తెలిపారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోయారని ఎస్పీ చెప్పిన తర్వాతే చంద్రబాబు వెళ్లిపోయారని పేర్కొన్నారు. అధికారుల నివేదికలు వాస్తవాలను బయట పెడుతున్నాయన్నారు.
ఎస్పీ పై ఒత్తిడి తెచ్చి తాను ఇలా చెప్పలేదని చెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ఉమ్మారెడ్డి అన్నారు. టీడీపీ మంత్రులు, నాయకులు ఈ ఘటనపై రకరకాలుగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు నిర్వాకం వల్లే దాదాపు 32 మంది చనిపోయారని మండిపడ్డారు.