ఏడాదంతా పుష్కర స్నానం చేయవచ్చు
ముక్త్యాల(జగ్గయ్యపేట):భక్తులు పుష్కర స్నానాలు ఏడాదంతా చేయవచ్చని మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. గ్రామంలోని కోటిలింగ హరిహర మహా క్షేత్రం పుష్కర ఘాట్‌లో మంగళవారం తెల్లవారు జామున పుష్కర స్నానమాచరించి భక్తులకు హితోపదేశం చేశారు.
పుష్కరాలు 12 రోజులు జరుగుతాయని, అయితే భక్తులు స్నానాలు 12 రోజుల్లోనే చేయాలని లేదని, ఏడాదిలోపు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. మూడు కోట్ల మంది దేవతలు నదిలో ఉంటారని అందుకే నది శక్తివంతంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతమంతా కొద్ది రోజుల్లో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ ఆశ్రమం నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్, ఈవో దూళిపాళ్ల సుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.