
లక్నో: యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు పవిత్ర సంగమస్థలిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తాజాగా యూపీలోని 75 జైళ్లలో గల ఖైదీలు కూడా త్రివేణీ సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారు. యూపీ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాగ్‌రాజ్ నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని 75 జైళ్లకు తీసుకువచ్చారు.
జైళశాఖ మంత్రి దారా సింగ్ నేతృత్వంలో ఖైదీల పుణ్యస్నానాల కార్యక్రమం సాగింది. లక్నో(Lucknow)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రజలంతా కుంభమేళాలో స్నానాలు చేయాలని ఉత్సాహం చూపిస్తుంటే, ఇక్కడి ఖైదీలకు ఎందుకు ఆ అవకాశం కల్పించకూడదని అనిపించింది. అందుకే ఖైదీలకు కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలని అనుకున్నాం’ అని అన్నారు. జైలు అధికారులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 75 జైళ్లలో మొత్తం 90 వేల మంది ఖైదీలున్నారన్నారు. జైళ్ల డైరెక్టర్ జనరల్(డీజీ) పీవీ రామశాస్త్రి మాట్లాడుతూ పవిత్ర సంగమం నుంచి తీసుకువచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని, ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి, తరువాత డ్రమ్ములలో నింపారన్నారు. ఆ తరువాత ఖైదీలంతా ప్రార్థనలు చేసి, పుణ్యస్నానాలు చేశారన్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి తెచ్చిన అమృత కలశంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు ఆచరించారని బాగ్‌పట్ జిల్లా(Baghpat District) జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఖైదీలు గంగామాతను కొనియాడుతూ ఎంతో ఉత్సాహంగా స్నానాలు చేశారని, ఈ అవకాశం కల్పించిన జిల్లా జైలు యంత్రాంగానికి ఖైదీలు కృతజ్ఞతలు తెలిపారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sambhal: లౌడ్ స్పీకర్ బ్యాన్ చేశారని..
Comments
Please login to add a commentAdd a comment