రియాద్ : సాంప్రదాయ ఆయిల్ ఆర్థిక వ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా, దుబాయ్ తరహా ఆయిలేతర ఆర్ధిక వ్యవస్థను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఇటీవల దాదాపు 49 దేశాలకు ఆన్‌లైన్ వీసా సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. వీటిలో అమెరికా, ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య దేశాలు కూడా ఉన్నాయి. అయితే సాంప్రదాయిక పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఆ దేశంలోని ప్రజలకు, ముఖ్యంగా మహిళలపై ఎన్నో ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు పర్యాటకుల ద్వారా వాటికి భంగం కలగకుండా చూసేందుకు ఆదేశం కొన్ని నిర్దిష్ట చర్యలు చేపడుతోంది.
అందులో భాగంగా విదేశీ పర్యాటకులు సౌదీలో పర్యటించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలంటూ కొన్ని మార్గదర్శకాలను శనివారం విడుదల చేసింది. వాటిల్లో డ్రెస్‌కోడ్ అతి ముఖ్యమైంది. మహిళలు భుజాలు, మోకాళ్లు కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం లాంటివి అస్సలు కుదరదు. అశ్లీలత, అసభ్యత లాంటి వాటికి పర్యాటకులు దూరంగా ఉండాలి. ఇలా దాదాపు 19 నిబంధనలను ఆదేశ పర్యాటక శాఖ తన వెబ్‌సైట్‌లో ఇంగ్లీష్ భాషలో విదేశీ పర్యాటకుల కోసం అందుబాటులోకి ఉంచింది. అయితే నిబంధనలను అతిక్రమిస్తే ఎంత జరిమానా విధిస్తారనేది స్పష్టం చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment