Online Visa Application
-
బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం అస్సలు కుదరదు!
రియాద్ : సాంప్రదాయ ఆయిల్ ఆర్థిక వ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా, దుబాయ్ తరహా ఆయిలేతర ఆర్ధిక వ్యవస్థను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఇటీవల దాదాపు 49 దేశాలకు ఆన్లైన్ వీసా సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. వీటిలో అమెరికా, ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య దేశాలు కూడా ఉన్నాయి. అయితే సాంప్రదాయిక పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఆ దేశంలోని ప్రజలకు, ముఖ్యంగా మహిళలపై ఎన్నో ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు పర్యాటకుల ద్వారా వాటికి భంగం కలగకుండా చూసేందుకు ఆదేశం కొన్ని నిర్దిష్ట చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా విదేశీ పర్యాటకులు సౌదీలో పర్యటించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలంటూ కొన్ని మార్గదర్శకాలను శనివారం విడుదల చేసింది. వాటిల్లో డ్రెస్‌కోడ్ అతి ముఖ్యమైంది. మహిళలు భుజాలు, మోకాళ్లు కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం లాంటివి అస్సలు కుదరదు. అశ్లీలత, అసభ్యత లాంటి వాటికి పర్యాటకులు దూరంగా ఉండాలి. ఇలా దాదాపు 19 నిబంధనలను ఆదేశ పర్యాటక శాఖ తన వెబ్సైట్లో ఇంగ్లీష్ భాషలో విదేశీ పర్యాటకుల కోసం అందుబాటులోకి ఉంచింది. అయితే నిబంధనలను అతిక్రమిస్తే ఎంత జరిమానా విధిస్తారనేది స్పష్టం చేయలేదు. -
ఆస్ట్రేలియా కొత్త వీసా విధానం, భారతీయులకే
మెల్బోర్న్ : భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త వీసా దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. జూలై 1 నుంచి సందర్శన వీసాలను దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆన్ లైన్ లోనే ఈ ప్రక్రియను చేపట్టవచ్చని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ మినిస్టర్ అలెక్స్ హాక్ ఈ విషయాన్ని తెలిపారు. ఆన్ లైప్ దరఖాస్తు విధానంతో తమ దేశ సందర్శన వీసాను అప్లయ్ చేయడం భారతీయులకు చాలా తేలికగా, మెరుగ్గా మారుతుందని చెప్పారు. భారత్ లో ఆస్ట్రేలియా వీసాలకు భారీగా డిమాండ్ పెరుగుతుందని, ఈ డిమాండ్ హాలిడే ప్రాంతాలకు మరింత ఉంటుందని ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 2017 తొలి నాలుగు నెలల్లోనే ఇమ్మిగ్రేషన్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ డిపార్ట్ మెంట్ భారతీయులకు 65వేల వీసాలను జారీచేసిందని పేర్కొంది. ఆస్ట్రేలియాను సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు ఈ విధానం ఎంతో సహకరించనుందని హాక్ చెప్పారు. 24/7 సౌలభ్యం, వీసా దరఖాస్తు ఛార్జ్ ను ఎలక్ట్రిక్ పేమెంట్ చేయడం, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత స్టేటస్ ను చెక్ చేసుకునే అవకాశం వంటి ప్రయోజనాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వీటన్నింటిన్నీ డిపార్ట్ మెంట్ ఇమ్మిఅకౌంట్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్ లైన్ అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోగలిగినా వెంటనే వీసాను తుది ఆమోదిస్తామని, భారతీయ దరఖాస్తుదారులు వెంటనే ప్రయాణ ఏర్పాట్లకు సంసిద్ధం కావచ్చని పేర్కొన్నారు.