అరేబియా అద్భుతం | Sakshi Guest Column On Arabia By Karan Thapar | Sakshi

అరేబియా అద్భుతం

Published Sun, Dec 22 2024 12:08 AM | Last Updated on Sun, Dec 22 2024 12:08 AM

Sakshi Guest Column On Arabia By Karan Thapar

అబూ ధాబీలోని షేక్‌ జయేద్‌ నేషనల్‌ మ్యూజియం

కామెంట్‌

చాలామంది దుబాయికి వెళ్తారు. కానీ దాని పొరుగునే ఉండే అబూ ధాబీని ఎక్కువమంది పట్టించుకోరు. దుబాయిని న్యూయార్క్‌తోనూ, అబూ ధాబీని ప్యారిస్‌తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టిపడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్‌... ఒక్కమాటలో అబూ ధాబీకి వెళ్తే అరేబియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!

మీకు దుబాయి తెలుసుగా? బంధుమిత్రుల్లో చాలామంది వెళ్లి ఉంటారు కూడా. అయితే దుబాయి నుంచి ఓ గంటన్నర ప్రయాణం దూరంలో ఉండే ఎమిరేట్స్‌ రాజధాని అబూ ధాబీ గురించి మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. వెళ్లి ఉండరు కూడా. ఇవ్వాళ మీతో కొన్ని దేదీప్యమానమైన విషయాలను పంచుకుంటాను. పోయిన వారం నేను అక్కడికి వెళ్లాను. చూడముచ్చటగా ఉందని చెప్పాలి. చూసి వచ్చినందుకు మనసులో ఓ సంతృప్తి మిగిలిపోయింది. దుబాయి మాదిరి తళుకుబెళుకుల్లేవు. గ్లామర్, హడావిడి అంతకంటే లేవు!

అబూ ధాబీలో ప్రపంచం పరుగులు పెట్టదు. నెమ్మదిగా ఓ నదిలా హొయలు పోతూ సాగుతూంటుంది. పోలిక కావాలంటే... దుబాయ్‌ని న్యూయార్క్‌తోనూ, అబూ ధాబీని ప్యారిస్‌తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టి పడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్‌... వీటన్నింటి మధ్య అక్కడక్కడా లెక్కలేనన్ని ఆడంబ రాలు, హోటళ్లు, రెస్టా రెంట్లు! ఇదీ అబూ ధాబీ వర్ణన!

ఎమిరాతీ జనాలు తమ నగరాన్ని బాగా ఆస్వాదిస్తూంటారు. షాపింగ్, డైనింగ్‌ ఏదైనా కానీ దుబాయి కంటే బాగా ఎంజాయ్‌ చేస్తూంటారు. విదేశీయులు ఎక్కువగానే ఉన్నా... వారు దుబాయిలో మాదిరిగా స్థానికులను బెదరగొట్టేంత స్థాయిలో లేరనే చెప్పాలి.  

అబూ ధాబీలో ఉన్న సాంస్కృతిక అద్భుతాల గురించి చెప్పాలంటే ‘ది లూవ్‌’, ‘షేక్‌ జాయెద్‌ మ్యూజియం’లను ప్రస్తావించాలి. ఈ రెండు ఉదాహరణలు కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే. షేక్‌ జాయెద్‌ సంగ్రహాలయంలో నేనుకొన్ని గంటల సమయం గడిపాను. అందులో ఉన్న వస్తువులు మాత్రమే కాదు... ఎంతో అద్భుతమైన ఊహతో వాటిని ప్రదర్శించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. 

చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఒక్కో కాలానికి ప్రతిరూపంగా ఈ సంగ్రహాలయ గదులను తీర్చిదిద్దారు. అలాగే చాలా తెలివిగా వేర్వేరు నాగరికతలకు సంబంధించిన వస్తువు లను ప్రదర్శించారు. ఫలితంగా వీటిని వేర్వేరు వస్తువు లుగా కాకుండా... ఒకే కాలంలో మానవ నాగరికతలు సాధించిన విజయాలను చూసినట్టుగా ఉంటుంది. 

చైనా నుంచి మెసపటోమియా వరకూ... అలాగే మెక్సికో నుంచి ఫ్రాన్స్‌ వరకూ వేర్వేరు నాగరికతలకు సంబంధించిన చారిత్రక అవశేషాలను ఇక్కడ భద్రపరిచారు. ఇంకోలా చెప్పాలంటే చోళుల కాలం నాటి విగ్రహాలు మొదలుకొని పర్షియన్ల కుండలు, బెల్జియం నేతపనుల నుంచి టర్కీ విగ్రహాలను ఒకే గదిలో చూడవచ్చు! ఏ శతాబ్దంలోనైనా మనిషి ఊహ ఎంత అద్భుతంగా ఉందో చెప్పే ప్రతీకాత్మ కత అన్నమాట!

షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌ను ఒక్క మాటలో వర్ణిస్తా. చాలా పెద్దది. చూడటం మొదలుపెడితే పూర్తయ్యేందుకు రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. కానీ ఇందులోని వైపరీత్యాలను మాత్రం కచ్చితంగా అధ్యయనం చేయా ల్సిందే. భూగర్భంలోని కారు పార్కింగ్‌ తరువాత స్టార్‌ బక్స్, కోస్టా కాఫీలతోపాటు చాక్లెట్లు, సుగంధ ద్రవ్యాల దుకాణాలున్న షాపింగ్‌ ప్రాంతానికి వెళతాం. 

ఆ తరువాత స్వచ్ఛమైన తెల్లటి పాలరాతి పరచుకున్న గోడలున్న భారీ హాల్‌లోకి ప్రవేశిస్తాం. హాల్‌లోని స్తంభాలపై అతి కౌశల మైన కళాకృతులు, అది కూడా విలువైన రంగురాళ్లు పొదిగి నవి ఉన్నాయి. పైకప్పు నుంచి జిలుగు వెలుగుల క్రిస్మస్‌ ట్రీల మాదిరిగా వేలాడే భారీ షాండ్లియర్లు... ఓహ్‌! అరే బియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!

అతిథులను మనసారా ఆహ్వానించే రెస్టారెంట్లు దుబాయిలో మాత్రమే ఉంటాయని అనుకునేవాడిని. అబూ ధాబీ కూడా ఈ విషయంలో ఏమీ తీసిపోదు. ఫోర్‌ సీజన్స్‌లోని బర్గర్లు, స్టీక్స్‌ కానివ్వండి... సెయింట్‌ రెజిస్‌ లోని భారతీయ వంటకాలైనా కానివ్వండి... ఫాక్వెట్‌లోని ఫ్రెంచ్‌ మాధుర్యాలు, సముద్ర తీరంలోని ‘తాషా’లో తీరికగా చేసే భోజనం కానివ్వండి... ఒక్కోటి పొట్టకు స్వర్గాన్ని రుచి చూపించేవే. కాకపోతే, ఇక్కడికొస్తే అప్పటి వరకూ లేని తిండిపోతుతనం మనల్ని చుట్టేయడం మాత్రం గ్యారెంటీ!

నేను ఇప్పటివరకూ చాలా దేశాల్లోని హోటళ్లలో బస చేశాను కానీ... ‘ది ఎమిరేట్స్‌ ప్యాలెస్‌’ ముందు అవన్నీ దిగదుడుపే! భారత్‌లోని ‘లేక్‌ ప్యాలెస్‌’, ‘తాజ్‌మహల్‌’లు కూడా దీనిముందు గల్లీ హోటళ్లలా చిన్న బోతాయి. పచ్చటి పచ్చికబయళ్లున్న రూమ్‌ టెర్రస్‌లో కూర్చుని సముద్రాన్ని చూస్తూ కాఫీ తాగడం... డిసెంబరు చలిలో సూర్యకిరణాలు నులి వెచ్చగా తాకడం... కవిత్వం చెప్పుకునేంత అద్భుతమైన అను భూతి. మొబైల్‌ ఫోన్‌ లేకుండా కూడా కాలం ఎంచక్కా గడచి పోతుందనేందుకు ఈ అనుభూతి ఒక ఉదాహరణంటే ఒట్టు!

ఇంకో ముఖ్యమైన సంగతి. తప్పక చెప్పాల్సింది కూడా! ఎమిరాతీ ప్రజలు ట్రాఫిక్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. అందుకే ఇక్కడ అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతూంటుంది. ఒకవేళ పొరబాటున ఎవరైనా నిబంధనలు మీరారో... జరిమానాలు వీపు విమానం మోత మోగిస్తాయి. రెడ్‌ లైట్‌ దాటారంటే ఐదు వేల దిర్హమ్‌ల చమురు వదులుతుంది. వచ్చే ఏడాది నుంచి దీన్ని ఏకంగా యాభై వేల దిర్హమ్‌లకు పెంచుతున్నారు. డాలర్లలో చెప్పాలంటే 15 వేలు. రూపాయల్లోనైతే రూ. 12.73 లక్షలు! రోడ్లపై అడ్డదిడ్డంగా నడిచే మనిషిని గానీ, ఒక్క హారన్‌ మోతగానీ వినలేదంటే నమ్మండి!

అబూ ధాబీ ఓ అద్భుత ప్రపంచం అనేంతగా దాన్ని వర్ణించానా? వాస్తవం ఏమిటంటే, దుబాయిలా కాకుండా... అబూ ధాబీ నిశ్శబ్దంగానే మీ అభిమానాన్ని చూరగొంటుంది. మీకు తెలియను కూడా తెలియదు. దుబాయిదంతా చెమ్కీల అంగీలే! కళ్లూ, చెవులు మదిపై చెడామడా దాడులు చేసే టైపు! 

దుబాయిని చూడంగానే ఆహా ఓహో అనిపిస్తే... పొరుగునే ఉండే అబూ ధాబీ మాత్రం నెమ్మదిగా మీ మనసుల్లోకి చేరి మత్తెక్కిస్తుంది. చిరకాలం ఒక జ్ఞాపకంలా నిలిచిపోతుంది. ఎప్పుడైనా అరబ్‌ దేశాల వైపు వెళ్లే పని పడిందనుకోండి... అబూ ధాబీని చూసి రావడం మరచి పోకండే! మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అందుకే, నేనూ ఇంకోసారి అక్కడకు వెళ్లాలని ఇప్పటికే తీర్మానించుకున్నా!


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement