సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో కూడా సాంకేతికత కీలకభూమిక పోషిస్తోంది. వర్చువల్, ఆగుమెంటెడ్ రియాల్టీ (వీఆర్, ఏఆర్) సరికొత్త పర్యాటక అనుభూతులను అందిస్తోంది. పర్యాటక ప్రదేశాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకటించడం సాంకేతికత అవసరానికి ఊతమిస్తోంది. దీనితో పాటు నేషనల్ డిజిటల్ టూరిజం మిషన్‌లో భాగంగా యునిఫైడ్ టూరిజం ఇంటర్ఫేస్ కోసం కేంద్ర పర్యాటక శాఖ కృషిచేస్తోంది.
ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వెబ్‌పోర్టల్, టూరిస్టు డెస్టినీ యాప్‌లను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఇప్పటికే ఏపీ మ్యూజియాల్లో వీఆర్, ఏఆర్‌లు విశేష ఆదరణ పొందుతున్నాయి. శిల్పారామాల్లో సైతం 12డి వర్చువల్ అనుభూతులను విస్తరిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో లేజర్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్‌లను కూడా అభివృద్ధి చేస్తోంది.
వర్చువల్ టూరిజం ఇలా..
వర్చువల్ టూర్లు కేవలం ఒకే స్థలంలో కూర్చోవడం ద్వారా పర్యాటకులు కోరుకునే ప్రదేశాలను చుట్టిరావచ్చు. దేశంలోని కళలు, సంస్కృతి, గొప్ప వారసత్వ సంపద దృష్ట్యా వర్చువల్ టూరిజం అద్భుతమైన వైవిధ్యాన్ని అందిస్తోంది. ఇక్కడ పర్యాటకులు వీఆర్ కళ్లజోళ్లు ధరించి రిమోట్ కంట్రోల్‌ను ఉపయోగిస్తూ గమ్యస్థానాల్లో కలియదిరిగే అనుభూతిని పొందుతున్నారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
తమిళనాడు టూరిజం శాఖ వీఆర్ ఆధారిత బుక్‌లెట్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీని అభివృద్ధి చేసి వెబ్‌సైట్‌లో సైతం అందుబాటులో ఉంచింది. 2016లో గుజరాత్ టూరిజం సింధు లోయలోని లోథాల్, ధోలవీర, రాణి–కి–వావ్‌తో సహా అనేక పురాతన ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో లైవ్ యాక్షన్ వీఆర్ వీడియోలను రూపొందించింది. 2021లో కేరళ టూరిజం శాఖ వర్చువల్ టూర్ గైడ్ కోసం ఏఆర్ యాప్‌ని తీసుకొచ్చింది. ఇది రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను కలుపుతూ రియల్ టైమ్ ఆడియో వీడియో గైడ్‌గా ప్రసిద్ధి చెందింది.
యాప్ సాయంతో..
నిత్యం పెరుగుతున్న పర్యాటక యాప్‌లతో ట్రావెల్, టూరిజం పరిశ్రమ పోటీపడాల్సి వస్తోంది. ఢిల్లీ టూరిజం శాఖ ‘దేఖో మేరే ఢిల్లీ’ యాప్.. అన్ని టికెట్ల బుకింగ్‌తో పాటు పర్యాటకులు ఒకే ప్లాట్‌ఫామ్‌లో సకల యాత్రలను ప్లాన్ చేసుకునే వీలుకల్పిస్తోంది. ప్రసిద్ధ వారసత్వ కట్టడాలను వైబ్‌సైట్ ద్వారా వర్చువల్ వాక్–త్రూలను అందిస్తోంది. మరోవైపు మ్యూజియాలు సైతం ఆన్‌లైన్ ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి.
(చదవండి: ఆక్వాకు ఉజ్వల భవిత..స్టేక్ హోల్డర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు)
Comments
Please login to add a commentAdd a comment