పర్యాటకం.. ఎందుకింత జాప్యం !
పర్యాటకం.. ఎందుకింత జాప్యం !
Published Sat, Aug 6 2016 9:43 PM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM
ఆలస్యంగా మేల్కొన్న పర్యాటక శాఖ
బోట్లకు మరమ్మతులు ప్రారంభం
మరో ఐదు రోజులే వ్యవధి
హడావుడిగా పనులు
సాక్షి, విజయవాడ :
పుష్కర భక్తులను ఆకట్టుకునేందుకు ఎటువంటి అనుమతి లేకుండానే ప్రయివేటు సంస్థ హడావుడి చేస్తోంది. పర్యాటక శాఖ మాత్రం ఆలస్యంగా మేల్కొంది. హడావుడిగా బోట్లకు మరమ్మతులు చేస్తోంది. దీంతో పుష్కరాలకు పర్యాటక శాఖ బోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత దుర్గమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నిర్వహించే బోట్లలో కొద్దిసేపు కృష్ణమ్మ ఒడిలో నదీవిహారం చేస్తుంటారు. విజయవాడలోని పున్నమిఘాట్, దుర్గాఘాట్, సీతానగరంలో బోటింగ్ పాయింట్‌ల నుంచి భవానీ ద్వీపానికి బోటింగ్ సౌకర్యం ఉంది. నదిలో సుమారు పదిహేను నిమిషాలు ప్రయాణించిన తర్వాత భవానీ ద్వీపం చేరుకుంటారు. ఆహ్లాదకరంగా సాగే ఈ బోటింగ్‌పై అనేక మంది ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం కీలకమైన పెద్ద బోట్లకు మరమ్మతుల పనులు చేస్తుండటంతో ఇద్దరు ప్రయాణించే జట్క్ స్కీ, నలుగురు ప్రయాణించే స్పీడ్ బోట్లను మాత్రమే వినియోగిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది పర్యాటకులు ప్రయివేటు బోట్లను ఆశ్రయిస్తున్నారు.
నిధుల విడుదలలో జాప్యం
బోట్ల మరమ్మతులకు రూ.15లక్షల మంజూరుకు ఉన్నతాధికారులు తీవ్ర జాప్యంచేశారు. వారం రోజులు క్రితం నిధులు మంజూరుకావడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వాస్తవంగా ఇప్పటికే బోట్లకు మరమ్మతులు పూర్తికావాల్సి ఉంది. అయితే కేవలం 40శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పుష్కరాలకు ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో బోట్లకు మరమ్మతులు పూర్తవుతాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హడావుడిగా పనులు చేస్తుండటం వల్ల నాణ్యతపై కూడా ఆ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పర్యాటక శాఖ బోట్ల పరిస్థితి ఇలా..
– బోధిసిరి : ఏపీటీడీసీ ఆధ్వర్యంలోని అతి పెద్ద బోటు బోధిసిరి. ఇందులో ఒకేసారి 120 ప్రయాణించవచ్చు. ఏసీ సౌకర్యం ఉంది. విందులు, వినోదాలు నిర్వహించుకునేందుకు వేదిక ఉంది. ప్రస్తుతం ఈ బోటు ఫ్లోరింగ్ మొత్తం దెబ్బతినడంతో తిరిగి ఉడ్ ఫ్లోరింగ్ వేస్తున్నారు. చుట్టూ ఉన్న అద్దాలు దెబ్బతినడంతో వాటిని తీసివేసి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పెయిటింగ్ వేయాల్సి ఉంది. పున్నమిఘాట్‌లో ఉంచి బోధిసిరి బోటుకు మరమ్మతులు చేస్తున్నారు. పుష్కరాల నాటికి ఈ బోటును సిద్ధం చేయాలని రాత్రింబవళ్లు పని చేస్తున్నారు.
– అమర్‌పాలీ : ఈ బోటులో 50 మంది ప్రయాణించవచ్చు. దీనికి చుట్టూ బీడింగ్, ఫ్లోరింగ్ దెబ్బతింది. ఇంజిన్ కూడా మార్చాల్సి ఉంది. ప్రస్తుతం చెక్కతో బోటు చూట్టూ బీడింగ్ ఏర్పాట్లుచేస్తున్నారు. వుడ్ వర్క్ పూర్తికావడంతో పైబర్ షీట్స్ వేస్తున్నారు. ఇంజిన్‌కు మరమ్మతులు రెండు, మూడు రోజుల్లో పూర్తవుతాయి. దీనిని సీతానగరం బోటింగ్ పాయింట్ వద్ద ఉంచి మరమ్మతులు చేస్తున్నారు.
– కృష్ణవేణి : ఈ బోటులో 50 మంది ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ఈ బోటుకు ఫ్లోరింగ్ పూర్తిచేశారు. పెయిటింగ్ వేస్తున్నారు. సీతానగరంలో ఉంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ బోటు సిద్ధమవుతుందని చెబుతున్నారు.
– భవానీ : ఈ బోటులో ఒకేసారి 70 మంది ప్రయాణం చేయవచ్చు. బోటు లోపల ఫ్లోరింగ్ పని జరుగుతోంది. బోటులోని ఇనప యంత్రlపరికరాలు పూర్తిగా తుప్పుపట్టిపోవడంతో మరమ్మతులు చేస్తున్నారు. ఉండవల్లి సమీపంలోని ఘాట్ వద్ద ఉంచి మరమ్మతులు చేస్తున్నారు.
క్రూయిజ్ బోటును తట్టుకునేనా?
చాంపియన్ హ్యాపీ క్లబ్ పర్యాటక, ఇరిగేషన్ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండానే పుష్కరాలకు కృష్ణానదిలో ఏసీ క్రూయిజ్ బోటును సిద్ధం చేస్తోంది. ఈ బోటు పనులు మలిదశకు చేరుకున్నాయి. ఇందులో డ్యాన్స్‌లు, వివిధ రకాల పార్టీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం నదిలో ప్రత్యేకంగా జట్టీలు కడుతున్నారు. ఈ క్రూయిజ్‌ను తట్టుకుని ఏపీటీడీసీ బోట్లు ప్రయాణికులను ఆకట్టుకునేనా.. అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పుష్కరాల సమయంలో నదిలోకి ప్రయివేటు బోటును అనుమతించవద్దని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement