ప్యాకేజ్ ట్రావెల్ డీల్స్ ఉత్తమమేనా?
మనం స్వతహాగా టూర్ ప్లాన్ చేసుకొని తిరిగి రావడానికి, ట్రావెల్స్ వారు ప్రకటించే ప్యాకేజ్‌లను ఎంచుకొని కొత్త ప్రదేశాలు చూసి రావడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్యాకేజ్ ట్రావెల్ డీల్స్‌లో మనకు ఖర్చు తక్కువవుతుంది. ప్యాకేజ్ టూర్‌లో ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్తారు. అంటే ఉదాహరణకు క్యాబ్‌ను షేర్ చేసుకుంటే తక్కువ చార్జ్ అవుతుంది. అదే ఒక్కరే వెళితే ఎక్కువ చార్జ్ చెల్లించాలి. ఇదే సూత్రాన్ని ప్యాకేజ్ టూర్‌కి కూడా అన్వయించుకోవాలి. అలాగే ప్యాకేజ్ టూర్ డీల్‌లో టూర్‌ను ఆఫర్ చేసే సంస్థ సందర్శించనున్న ప్రాంతాల్లోని చాలా కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది.
అప్పుడు ఆయా కంపెనీలు అందించే రాయితీలను టూర్ నిర్వహించే సంస్థ టూరిస్ట్‌లకు బదిలీ చేస్తుంది. అప్పుడు టూరిస్ట్‌లకు ఖర్చు తగ్గుతుంది. కాక్స్ అండ్ కింగ్స్ కంపెనీ పది రోజుల యూరప్ టూర్ ప్యాకేజ్‌ను ప్రకటించిందనుకుందాం. ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, యూకే ప్రాంతాల సందర్శన కూడా ఇందులో భాగమే అనుకోండి. ఈ ప్యాకేజ్ విలువ ఒక వ్యక్తికి రూ.1.57 లక్షలుగా ఉందనుకోండి. మనం ఈ టూర్ ప్యాకేజ్‌ను ఎంచుకోకుండా సొంతంగా అదే ప్రాంతాలకు వెళితే రూ.2 లక్షలకు పైనే ఖర్చవుతుంది. అందుకే ప్యాకేజ్ ట్రావెల్ డీల్స్ చాలా మందికి అనువుగా ఉంటాయి. అయితే ఇక్కడ టూర్ ఆపరేటర్ నిర్దేశించిన నియమాలను పాటించాల్సి ఉంటుంది.