మన దేశంలో బతుకు బాదరబందీ కోసం చాలామంది కష్టపడుతుంటారు. కాని నెదర్లాండ్స్‌కు చెందిన ఒక అమ్మాయి చాలా సింపుల్‌గా సంవత్సర కాలంగా జీవిస్తోంది. ఒక వ్యాన్‌నే ఇల్లుగా చేసుకొని దేశమంతా తిరుగుతోంది. సముద్రం ఒడ్డున బస... నక్షత్రాల కింద నిద్ర... చాలదా జీవితానికి అని ప్రశ్నిస్తుంది?
తమిళనాడు మహాబలిపురం దగ్గర వ్యాన్ నిలబెట్టుకుని సముద్రంతో కబుర్లు చెప్పే ఈ అమ్మాయిని అంతా వింతగా చూస్తుంటారు. ఆమె అందరినీ వింతగా. ఎవరి బతుకు ఎవరికి వింత?
చెన్నై దగ్గర ఉన్న మహాబలిపురం నుంచి ఇంకో ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మామళ్లపురం. చిన్న ఊరు అది. సముద్రం ఘోష. దాని ఒడ్డునే ఒక వ్యాన్‌ని చూడవచ్చు. పూలు, లతలు, మత్స్యకన్యలు గీసి ఆకర్షణీయంగా ఉండే ఆ వ్యాన్ గత సంవత్సర కాలంగా మారియా ఉండెరింక్ ఇల్లు. అదే ఆమె వాహనం కూడా.
వ్యాన్ నెత్తి మీద సర్ఫ్‌బోర్డ్, స్కేట్‌బోర్డ్‌ను కట్టి ఉంచుకుంటుంది. వ్యాన్ లోపల పడుకునే స్థలం, పుస్తకాల ర్యాకు, బట్టలు పెట్టుకునే చోటు, పాటలు వినడానికి స్పీకర్లు... ఇవన్నీ ఉంటాయి. నెదర్లాండ్స్‌కు చెందిన మారియా సంవత్సర కాలంగా దేశంలో ఉంటోంది.
రెండేళ్ల క్రితం ఆమె ‘జంపా క్రియేషన్స్’ పేరుతో చిన్న ఆన్‌లైన్ బిజినెస్ మొదలెట్టింది. ఆర్గానిక్‌గా తయారు చేసిన అగరు బత్తీలు, పరిమళ తైలాలు విక్రయిస్తుంది. వాటికేం ఆఫీసు అక్కర్లేదు కనుక ఆన్‌లైన్‌లో వచ్చిన ఆర్డర్లను కొరియర్ ద్వారా పంపిస్తుంది. వాటి మీద వచ్చే డబ్బులే ఆమె ఆదాయం. మరి మిగిలిన సమయమో? ఆమెనే అడుగుదాం.
ఎక్కడ నచ్చితే అక్కడే
సంవత్సరం క్రితం ఇండియా వచ్చిన మారియా మొదట చేసిన పని ఢిల్లీలో ఒక సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొనడం. దానిని తనకు తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం. ఆ తర్వాత దానిని తీసుకొని దేశం చూడటానికి బయలుదేరడం. ‘మొదట రాజస్థాన్ వెళ్లాను. అక్కడ చాలా రోజులు ఉన్నాను. ఆ తర్వాత గోవాలో కొన్నాళ్లు. ఈ ఊరిలో సర్ఫింగ్ పోటీలు ఉన్నాయంటే మొన్నటి జూలైలో వచ్చాను.
పోటీలో సెమీ ఫైనల్స్ దాకా వెళ్లాను. గెలవలేదు. కాని నాకు ఈ ఊరు చాలా నచ్చింది. అందుకే ఇక్కడ ఉండిపోయాను’ అంటుంది మారియా. మామళ్లపురం బెస్తవాళ్లు ఆమెను వింతగా చూస్తారు తప్ప అంతరాయం కలిగించరు. తోచినప్పుడల్లా సర్ఫ్‌బోర్డ్ తీసుకొని సముద్ర అలల మీద తేలుతుంటుంది మారియా. లేదంటే వ్యాన్‌లో కూచుని పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా ల్యాప్‌టాప్‌లో పని.
కొన్ని జాగ్రత్తలు
ప్రయాణంలో పెట్రోల్ బంకులనే తన కాలకృత్యాల కోసం ఉపయోగించుకుంటుంది. ఫోన్, ల్యాప్‌టాప్ చార్జింగ్ కావాలంటే ఏదో ఒక కాఫీ షాప్‌కు వెళుతుంది. మిగిలిన అన్ని పనులకు వ్యాన్ ఉంటుంది. ‘వ్యాన్‌ను ఎప్పుడూ నీట్‌గా పెట్టుకుంటాను. ఎందుకంటే అది నేను ఉండాల్సిన చోటు కదా’ అంటుంది.
వ్యాన్‌లో ఆమె అమ్మే వస్తువులు సువాసన వ్యాపింపచేస్తుంటాయి. ‘సోలార్ ప్యానల్స్ బిగించిన మెటాడర్ వ్యాన్ కొనుక్కోవాలని ఉంది. అదైతే ఇంకా సౌకర్యంగా ఉంటుంది’ అంటుంది మారియా. ‘జీవితం ఇలా బాగుంది. సింపుల్‌గా’ అంటుంది.
‘కొన్ని గ్రిల్ చేసిన కూరగాయల భోజనం. రాత్రిళ్లు నక్షత్రాల కింద పడక. ఇంతకు మించి ఏం కావాలి?’ అంటుంది మారియా. ఏం కావాలో తెలియక నాగరీకులు ఉదయం లేచి ఉరుకుల పరుగుల మీద అన్వేషిస్తూ ఉంటారు. వారికి మారియా ఒక వింత. వారు మారియాకు.
చదవండి: Travel Couple: ప్రేమ పెళ్లి.. సొంత కారవ్యాన్‌లో కుటుంబంతో కలిసి..
భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి.. దానినే పడవగా మార్చి.. నదిని దాటి.. ఆపై!
Comments
Please login to add a commentAdd a comment