19 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు..
చెన్నై:అంతరాష్ట్ర ట్వంటీ 20 టోర్నమెంట్లో భాగంగా ఇక్కడ మంగళవారం గురునానక్ కాలేజ్ గ్రౌండ్ లో తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో గోవాకు ఘోర ఓటమి ఎదురైంది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ పేలవ ప్రదర్శనకే పరిమితమైన గోవా 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గోవా జట్టు 16.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. గోవా జట్టుకు ఓపెనర్లు కామత్(26), అస్నోద్కర్(33)లు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ, ఆ తరువాత చతికిలబడిన గోవా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తన ఇన్నింగ్స్ లో 88 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయి పటిష్టంగా కనిపించిన గోవా వరుస విరామాల్లో వికెట్లను సమర్పించుకుంది. 19 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లను నష్టపోయిన గోవా శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. ఎనిమిది మంది గోవా ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడం గమనార్హం.
అటు తరువాత గోవా నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు 13.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్(68 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించగా, మరో ఓపెనర్ మురళీ విజయ్(16) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరుణంలో ముకుంద్ కు జతకలిసిన జగదీశన్(19 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి తమిళనాడు విజయానికి సహకరించాడు.