కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: కర్ణాటక ప్రాంతం నుంచి వరద నీరు జిల్లా మీదుగా ప్రవహిస్తున్నా చెరువుల్లో చుక్క నీరు చేరని పరిస్థితి. నేతల మౌనంతో వీటి కింద 80,190 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమవుతోంది. రెండు మూడేళ్లుగా వరుస కరువుతో చెరువులు ఒట్టిపోయాయి. ఈ ఏడాది వర్షాకాలంలో రెండు నెలలు గడిచినా 10 శాతం చెరువుల్లోనూ నీరు చేరకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 479 పంచాయతీరాజ్, 163 చిన్న నీటిపారుదల చెరువులతో పాటు సుమారు 1000 పైగా చిన్న చెరువులు, ఊట కుంటలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వర్షాలు ఆశాజనకంగా లేకపోవడం.. చెరువుల్లో ఆశించిన నీరు చేరకపోవడం గమనార్హం.
ఆదోని, తుగ్గలి, హలహర్వి, మద్దికెర, వెలుగోడు ప్రాంతాలను మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో వర్షపాతం అంతంతమాత్రమే నమోదైంది. కర్ణాటక, మహరాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరద నీరు రావడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. అయితే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో నీటి పారుదల శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వృథాగా దిగువకు వదిలే బదులు కాల్వలకు అనుబంధంగా ఉన్న చెరువుల్లో నింపుకునే అవకాశాలున్నా.. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం రైతన్నకు శాపమవుతోంది. ఈ కారణంగా సీజన్‌లో చెరువుల కింద ఆయకట్టు సాగు ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల డివిజన్‌లోని మహానంది మండలంలో ఆరు చెరువుల పరిధిలో 1892.41 ఎకరాల ఆయకట్టు ఉండగా వర్షాలు లేకపోవడంతో బీడావారుతున్నాయి. పాణ్యం, బనగానపల్లె, అవుకు మండలాల్లో 21 చెరువుల కింద 7914.31 ఎకరాల ఆయకట్టు సాగవుతుండగా.. ఇప్పటి వరకు ఏ ఒక్క చెరువులో చుక్క నీరు చేరకపోవడంతో రైతులు బెంగపెట్టుకున్నారు. కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లోని చెరువుల కింద నేటికీ విత్తనం పడకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కర్నూలు డివిజన్ విషయానికొస్తే పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని 16 చెరువుల్లో మాత్రమే నీటి నిల్వలు ఉండగా.. మిగతా మండలాల్లోని చెరువుల్లో నీరు లేక సాగు ప్రశ్నార్థకమైంది. ఈ విషయాన్ని ‘న్యూస్‌లైన్’ ఎస్‌ఈ ఎ.సుధాకర్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లాలోని చిన్న నీటి పారుదల శాఖ పరిధిలోని చెరువులను కాల్వల ద్వారా నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదన్నారు. ఉత్తర్వులు అందిన వెంటనే చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
గుండె ‘చెరువు’
Published Mon, Aug 12 2013 3:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement