IRCTC packages
-
ఇలా చేస్తే ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు! ఖర్చు ఎంతవుతుందో తెలుసా?
IRCTC Entire Train Or Coach Booking In Online: భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు విమానాలను మాత్రమే కాకుండా ట్రైన్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. కుటుంబం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు ముందుగా రిజర్వ్ చేసుకున్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో చోట సీట్లు అలాట్ చేస్తారు. కానీ మీరందరూ కలిసి వెళ్లాలనుకున్నప్పుడు ఒక కోచ్ మొత్తమ్ బుక్ చేసుకోవచ్చు. ఇది 'ఐఆర్సీటీసి'లో ఎలా బుక్ చేసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుక్ చేసుకునే విధానం ఏదైనా టూర్ వెళ్లాలనుకుని ఒక బృందం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు 'పుల్ టారిఫ్ రేట్' అనే బుకింగ్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసు కింద ఒక కోచ్ లేదా మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఒక ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటివి క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం మీరు https://www.ftr.irctc.co.in/ftr/ అనే వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఈ విధంగా మీరు తర్వాత మీరు మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవాలా.. లేదా ఒక కోచ్ మాత్రమే బుక్ చేసుకోవాలా.. అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని అవసరమైన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ పే చేసిన తరువాత మీ బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇందులో మీరు ఏసీ ఫస్ట్ క్లాస్,ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, స్లీపర్ కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం, మీరు ఒక కోచ్ బుక్ చేసుకోవాలనుంటే ముందుగా రూ. 50,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది మీరు ప్రయాణించే దూరం, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకవేళా ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు రూ. 9 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇలాంటి బుకింగ్ కోసం కనీసం 30 రోజులు లేదా 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. -
పర్యాటకులకు శుభవార్త.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పర్యాటకులు, తీర్థయాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ–అరకు–విశాఖ (రైల్ కం రోడ్ ) ఈ టూర్ ప్రతిరోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్లో అరకు వ్యాలీ (ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, ధింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరి అదేరోజు రాత్రి విశాఖపట్నానికి చేరుస్తారు. తిరుమల దర్శన్ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు) ఈ టూర్ ప్రతిశుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి తీసుకువెళ్లి, మళ్లీ అదే రైలులో విశాఖ తీసుకొస్తారు. సదరన్ డివైన్ టెంపుల్ టూర్ (ఫ్లైట్ ప్యాకేజీ) ఈ టూర్ ఆగష్టు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మొత్తం 5రాత్రులు, 6పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో దక్షిణాదిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, త్రివేండ్రం వంటి దర్శనీయ స్థలాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో గానీ, 0891–2500695, 8287932318 నంబర్లలో గానీ సంప్రదించాలని చంద్రమోహన్ సూచించారు. -
ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ టి.మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ స్వదేశ్ దర్శన్‌లో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్సర్ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నెల 27న రేణిగుంట–తిరుపతి నుంచి బయల్దేరే రైలు విజయవాడ, సికింద్రాబాద్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని ఏడు రాత్రులు, 8 పగళ్లు ప్రయాణించి వచ్చే నెల 3న గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. భోజన వసతితో పాటు స్లీపర్ క్లాస్ ప్రయాణ ధర రూ.18,120, థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.22,165గా ఉంటుందన్నారు. వారణాసి, ప్రయాగ సంగమ్, గయ యాత్రకు సెప్టెంబర్ 15న సికింద్రాబాద్ నుంచి మహాలయ పిండ్‌దాన్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 5 రాత్రులు, 6 పగళ్లు స్లీపర్ క్లాస్ ప్రయాణ ధర రూ.14,485, థర్డ్ ఏసీ రూ.18,785గా నిర్ణయించినట్టు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో ప్రయాణికులు రైలు ఎక్కే సౌకర్యం ఉంటుందన్నారు. మరోవైపు విజయ గోవిందం ఎక్స్‌ప్రెస్ పేరుతో తిరుమల, తిరుచానూరుకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నామన్నారు. 2 రాత్రులు, 3 పగళ్లు ప్రయాణ టికెట్ ధర విజయవాడ నుంచి రూ.3,410, రాజమండ్రి–సామర్లకోట నుంచి రూ.3,690 ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఆసక్తి గలవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 8287932312, 9701360675 ఫోన్ నంబర్లు లేదా విజయవాడ రైల్వే స్టేషన్‌లోని కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరారు. పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రత్యేక రైళ్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే నాన్–టెక్నికల్ కేటగిరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రాంతీయ విమాన ప్యాకేజీలు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి ప్రాంతీయ విమాన టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలి పారు. ఈ నెల 27న అల్టిమేట్ ఉత్తరాఖండ్ పేరుతో డెహ్రాడూన్, హరిద్వార్, ముస్సోరి, రుషికేష్ చుట్టివ చ్చేలా రూ.23,635తో ప్రత్యేక ప్యాకేజీ రూపొందించామన్నారు. 29న రాయల్ నేపాల్‌యాత్రలో భాగం గా ఖాట్మండు, పోఖరా ప్రయాణానికి రూ.40 వేల నుంచి టికెట్ ధర ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 12, 14, 19, 21, 26, 28 తేదీల్లో తిరుపతి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమలతో కలిపి రూ.12,260తో విమాన ప్యాకేజీని నిర్వహిస్తున్నట్టు వివరించారు. చదవండి: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. నెల గ్యాప్ తర్వాత రూ.50 పెంపు -
విశాఖపట్నం టూ ఢిల్లీ టూర్.. ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు ఇవే
సాక్షి,విశాఖపట్నం: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు డిప్యూటీ జనరల్మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ తెలిపారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ లోని వీఐపీ లాంజ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరులసమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా యాత్రలకు సంబంధింన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.ఐఆర్సీటీసీ ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలు, ఉత్తర భారతయాత్రలను విజయవంతంగా పూర్తిచేసిందని ఆయన తెలిపారు. రానున్న రెండు నెలల్లో రెండు ప్రత్యేక రైళ్లునడుపుతున్నట్టు ఆయన చెప్పారు. మొత్తం 13 కోచ్‌ల రైళ్లను కేవలం ఈ యాత్రల కోసమే నడుపుతున్నట్లు, రైలుమొత్తం 1300 ఉన్నప్పటికీ కోవిడ్ నేపథ్యంలో కేవలం సగం ఆక్యుపెన్సీతో మాత్రమే ఈ రైళ్లు నడుపుతామన్నారు. ప్రయాణికులకు ప్రతి రోజూ కోవిడ్ కిట్లు అందజేస్తామన్నారు. ఈ రైళ్లలో బయటవారికి ఏ విధమైనఅనుమతి లేకుండా ఈ టూర్ ప్యాకేజిలో ఉన్న వారికి ప్రత్యేక ఐడీ కార్డులు ఇచ్చి వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. ఇటువంటి తీర్థయాత్రలను వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని, దీనికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తక్కువ చార్జీలతోనే సందర్శించే అవకాశం కల్పిస్తుందని సిబ్బంది తెలిపారు. ఈసమావేశంలో స్టేషన్ మేనేజర్ సురేష్, స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ,సిబ్బంది పాల్గొన్నారు. ఈ యాత్రల గురించి మరింత సమాచారం కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో గేట్ నం.1 వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 82879 32318 / 82879 32281 / 7670908300 / 0891 2500695 నంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. ఉత్తర భారత యాత్ర ఈ యాత్ర మొత్తం 10 రాత్రుళ్లు 11 పగళ్లు ఉంటుంది. ఈ యాత్రలో ఆగ్రా, వైష్ణోదేవి, స్వర్ణదేవాలయం, వాఘాసరిహద్దు, మానస దేవి మందిరం, గంగా ఆర్తి, ఎర్రకోట, అక్షర్ధామ్ టెంపుల్, కుతుబ్మీనార్, లోటస్ టెంపుల్,ఇండియా గేట్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈటూర్ ఆగస్టు 27 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 6వతేదీన ముగుస్తుంది. ఈ టూర్లో ప్రయాణించాలనుకునేవారు విజయవాడ లేదా గుంటూరులో రైలెక్కాల్సి ఉంటుంది. స్లీపర్‌క్లాస్–10,400/–, థర్డ్ ఏసీ–17,330/–(ఒక్కొక్కరికి) జీఎస్టీతో కలిపి ఈ టూర్ చార్జీలు ఉంటాయి. మహాలయ పిండదాన్ తర్పణ్ ఈ యాత్ర మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈయాత్రలో వారణాసి, ప్రయాగరాజ్, గయ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమై అక్టోబరు 1వ తేదీతో ముగుస్తుంది.ఈ టూర్లో చేరాలనుకునేవారు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బ్రహ్మపూర్లలో రైలెక్కవచ్చు. ఈ టూర్లో స్లీపర్‌క్లాస్–6620/–, థర్డ్ ఏసీ–11,030/–(ఒకొక్కరికి) జీఎస్టీతో కలిపి చార్జీలు నిర్ణయించారు. ఈ స్పెషల్ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారికి రైలెక్కినది మొదలు దిగే వరకు అన్ని ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. స్లీపర్‌క్లాస్ వారికి హాల్స్, ధర్మశాలలు, డార్మెటరీలలోవసతి కల్పిస్తారు. థర్డ్ ఏసీ వారికి డబులు, లేదా త్రిబుల్ షేరింగ్ హోటల్లో రూంలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం,సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, సైట్ సీయింగ్ అన్నిప్యాకేజీలు పైన నిర్ణయింన ధరలలోనే ఉంటాయన్నారు. -
హైదరాబాద్ నుంచి గోవా టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
పర్యాటకం పంథా మారింది. ఎక్కడికైనా సరే రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేందుకు పర్యాటక ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో పర్యాటకుల అభిరుచి మారింది. గంటలు, రోజుల తరబడి బస్సులు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకొని ఎక్కువ ప్రాంతాలను సందర్శించే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. గోవా, కాశ్మీర్, హంపీ తదితర ప్రాంతాలతో పాటు కొత్తగా లద్దాక్, లేహ్, డార్జిలింగ్ వంటి ఇతర ప్రాంతాలపైనా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ఐఆర్సీటీసీ ఎయిర్ప్యాకేజీలను అందజేస్తోంది. సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రియులు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకు విమాన ప్రయాణానికే ఓటేస్తున్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ అనంతరం గత 2 నెలల్లో సుమారు 20 ఎయిర్ ప్యాకేజీలను నిర్వహించినట్లు ఐఆర్సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ నర్సింగ్‌రావు తెలిపారు. కోవిడ్ మొదటి ఉధృతి అనంతరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 38 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. 2019లో హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఏకంగా 175 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వేలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అదే సమయంలో రైల్ టూర్లు, ఉత్తర, దక్షిణాది పర్యాటక రైళ్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇవిగో ఎయిర్‌ప్యాకేజీలు... గోవా టూర్ సెప్టెంబర్ 24న ప్రారంభంకానుంది. విమాన ప్రయాణంతో పాటు రోడ్డు, రవాణా, గోవాలో హోటల్ సదుపాయం, తదితర అన్ని ఏర్పాట్లు ఐఆర్సీటీసీ అందజేస్తుంది. ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ గోవాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ (మూడు రాత్రులు..నాలుగు పగళ్లు)ఒక్కరికి ర.15,780 చొప్పున ఉంటుంది. ♦ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పర్యటన ప్యాకేజీ(ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) విలువ ర.23,150. అక్టోబర్ 1వ తేదీన ఈ పర్యటన మొదలవుతుంది. అహ్మదాబాద్, ద్వారక, సోమ్‌నాథ్ ఆలయాలతో పాటు సర్ధార్ వల్లభ్‌బాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించవచ్చు. ♦ హౌస్‌బోట్ సదుపాయంతో కూడిన కశ్మీర్ పర్యటన సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో( ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గావ్, సోన్మార్గ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ ప్యాకేజీ రూ.24.480 చొప్పున ఉంటుంది. ♦ రాయల్ రాజస్థాన్ యాత్ర (ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. జైపూర్, జోథ్‌పూర్, పుష్కర్, ఉదయ్‌పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ర.23,900 చొప్పున ఈ పర్యటన ప్యాకేజీ ఉంటుంది. ఉత్తరభారత యాత్ర... ♦ ట్రైన్లో వెళ్లే పర్యాటకుల కోసం ఉత్తర భారత యాత్ర, వారణాసి–గయ–ప్రయాగ్‌రాజ్, దక్షిణభారత యాత్ర రైళ్లను సిద్ధం చేసింది. ఉత్తర భారత యాత్ర, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, హరిద్వార్, దిల్లీ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఒక్కొక్కరికి అన్ని సదుపాయాలతో ర.10,400 చొప్పున ఉంటుంది. ♦ దక్షిణభారత యాత్ర అక్టోబర్ 19న ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుచురాపల్లి, తంజావూరు,రామేశ్వరం, మధురై, కన్యాకువరి, మహాబలిపురం, కాంచీపురం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీ రూ.6,620 చొప్పున ఉంటుంది. -
ఐఆర్సీటీసీ.. ఇక లోకల్ టూర్స్
ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ పర్యటనలనునిర్వహించే ఐఆర్సీటీసీ కోవిడ్ దెబ్బకు కుదేల్ అయింది.లాక్డౌన్ కారణంగా ఐఆర్సీటీసీ ప్యాకేజీలు పూర్తీగా రద్దయ్యాయి. ప్రస్తుతం నిబంధనలను సడలించడంతో స్థానిక పర్యటనలపై అధికారులు దృష్టి సారించారు. సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్థానిక పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు త్వరలో ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సైట్ సీయింగ్‌తోపాటు, భద్రాచలం, శ్రీశైలం, విశాఖ, తిరుపతి వంటి పర్యటనలకే పరిమితం కానున్నారు. సాధారణంగా ఐఆర్సీటీసీ దేశీయ పర్యటనల కోసం రైళ్లను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో పర్యటన వారం నుంచి 15 రోజుల వరకు కూడా కొనసాగుతుంది. అయితే కోవిడ్ దృష్ట్యా రోడ్డు మార్గంలోనే పర్యటనలు ఏర్పాటు చేయనున్నారు. 30 మంది ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సుల్లో 20 మంది టూరిస్టుల చొప్పున తీసుకెళ్లనున్నట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టిన వెంటనే పర్యాటక ప్యాకేజీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా స్థానిక పర్యటనలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థతో పాటు ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. కోవిడ్ ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఆర్సీటీసీ సైతం లోకల్ టూర్ రంగంలోకి ప్రవేశించడం గమనార్హం. ప్రజల అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా పర్యటనలను రూపొందించి నిర్వహించేందుకు అధికారులు వ్యూహరచన చేస్తున్నారు. 50 ప్యాకేజీలు రద్దు... వేసవి సెలవుల్లో నగరవాసులు పెద్ద ఎత్తున జాతీయ అంతర్జాతీయ పర్యటనలకు వెళ్తారు. ఊటీ, సిమ్లా, కులుమనాలి, గోవా, జమ్ము కశ్మీర్, న్యూఢిల్లీ, ఆగ్రా, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిర్వహించే సుమారు 50కి పైగా ప్యాకేజీలు రద్దు కావడంతో 10 వేల మందికి పైగా తమ పర్యటనలను ఉపసంహరించుకున్నారు. జాతీయ పర్యటనలతోపాటు చైనా, శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, నేపాల్ తదితర దేశాలకు సైతం వేసవిలో నిర్వహించే పర్యటనలను ఐఆర్సీటీసీ ఈ ఏడాది రద్దు చేసింది. సుమారు రూ. 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ కారణంగా అంతర్జాతీయ, జాతీయ పర్యటనల స్థానంలో స్థానిక పర్యటనలపైన అధికారులు తాజాగా దృష్టి సారించడం గమనార్హం. -
తిరుపతి, శ్రీనగర్లకు ఐఆర్సీటీసీ ఫ్లయిట్ ప్యాకేజీలు
హైదరాబాద్ : పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా విమాన సర్వీసులను ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఆ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీనగర్లకు వెళ్లే పర్యాటకుల కోసం తాజాగా రెండు ఫ్లయిట్ ప్యాకేజీలను ఆ సంస్థ గురువారం ప్రకటించింది. తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని శీఘ్రదర్శనం ప్యాకేజీలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో తీసుకెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించే సదుపాయం కల్పిస్తారని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు నెలలో రెండు దఫాలుగా అంటే 6, 27వ తేదీల్లో ఈ పర్యటన ఉంటుందని తెలిపింది. ఈ పర్యటన చార్జీ రూ.9,152 గా నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా కాణిపాకం దేవాలయం, శ్రీనివాస మండపం, తిరుమల హిల్స్, శ్రీ వెంకటేశ్వర శీఘ్రదర్శనం ఉంటాయని చెప్పింది. ఈ పర్యటనలో హైదరాబాద్- తిరుపతి- హైదరాబాద్ విమాన సదుపాయంతో పాటు, ఒక రాత్రి ఏసీ హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తదితర సదుపాయాలన్నీ ఉంటాయి. జమ్ము, శ్రీనగర్ పర్యటన... ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండే ఈ పర్యటన హైదరాబాద్ నుంచి ఆగస్టు 13వ తేదీన ప్రారంభమవుతుంది. శ్రీనగర్-గుల్మార్గ్ ,పహల్గామ్, సోన్మార్గ్, తదితర ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతుంది. ఒక గ్రూపులో 15 మంది పర్యాటకులు ఉంటారు. ఈ పర్యటన ప్యాకేజీ రూ.32,442 ఉంటుంది. శ్రీనగర్‌లో హౌస్‌బోట్, దాల్ సరస్సులో బోట్ రైడింగ్, శంకరాచార్య టెంపుల్ దర్శనం, మొఘల్ గార్డెన్స్ సందర్శన తదితర ప్రాంతాలు ఉంటాయి. హోటల్ వసతి, గైడ్, తదితర అన్ని సదుపాయాలతో ఈ ప్యాకేజీని రూపొందించారు. వివరాలు, బుకింగ్ కోసం పర్యాటకులు ఫోన్ : 040-277012407, 040-23800580, 9701360647 నంబర్లను సంప్రదించవచ్చు. -
రైల్వే ‘విదేశీ టూర్'
* మలేసియా, సింగపూర్‌లకు ఐఆర్సీటీసీ ప్యాకేజీలు * హైదరాబాద్, వైజాగ్‌ల నుంచి పర్యటించే సదుపాయం హైదరాబాద్: భారతీయ రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్సీటీసీ) పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీ టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో థాయ్‌లాండ్ పర్యటనతో విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఐఆర్సీటీసీ ఈసారి మలేసియా, సింగపూర్ పర్యటనలకు ప్రణాళికలను సిద్ధం చేసింది. హైదరాబాద్, విశాఖపట్నంల నుంచి ఈ అవకాశాన్ని పర్యాటకులు వినియోగించుకోవచ్చు. సెప్టెం బర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు ఆరు రాత్రులు, ఐదు పగళ్లతో ఈ యాత్ర సాగుతుంది. ఆసక్తిగల వారు వివరాలను ఐఆర్సీటీసీ వద్ద నమోదు చేసుకోవచ్చు. ఈ టూర్లో మలేసియాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాసాక్ అండ్ మ్యూజియం, ట్విన్ టవర్స్, పార్లమెంట్ హౌస్ తదితర ప్రాంతాలు.. సింగపూర్‌లోని నైట్ సఫారి, సిటీ టూర్, లయన్ సిటీ, సివిక్ డిస్ట్రిక్ట్, పడాంగ్, క్రికెట్ క్లబ్, పార్లమెంట్ హౌస్ తదితర ప్రాంతాలను చూడొచ్చు. టూర్ లో భాగంగా పర్యాటకులకు త్రీస్టార్ హోటల్లో వసతి కల్పిస్తారు. ఈ పర్యటనకు హైదరాబాద్ నుంచి వె ళ్లేవారు ఒకరికి రూ.72,040 (డబుల్ఆక్యుపెన్సీ) నుంచి రూ.87,350 (సిం గిల్ ఆక్యుపెన్సీ) వరకు చార్జీలు వసూలు చేస్తారు. పిల్లలకు రూ.57,410 చొప్పున చార్జీ ఉంటుంది. వైజాగ్ నుంచి రూ.72,760 నుంచి రూ.88,070 చార్జీ లుంటాయి. పిల్లలకు రూ.58,126 చార్జీ ఉంటుంది. థాయ్‌లాండ్ పర్యటన.. వచ్చే ఆగస్టు 22 నుంచి 26 వరకు అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండు విడతలుగా సాగే థాయ్‌లాండ్ పర్యటన సదుపాయం హైదరాబాద్ నుంచి మాత్రమే ఉంది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగే ఈ పర్యటనలో బ్యాంకాక్‌లో రెండు రాత్రులు, పట్టాయిలో రెండు రాత్రులు ఉంటారు. టైగర్ జూపార్కు, ఆల్కజార్ షో, కోరల్ ఐలాండ్, నాంగ్చూక్ ట్రాఫికల్ గార్డెన్, జెమ్స్ గ్యాలరీ, వాట్ఫో (బుద్ధ దేవాలయం), మార్బుల్ టెంపుల్ తదితర ప్రాంతాలను ఈ పర్యటనలో చూడొచ్చు. ఈ ప్యాకేజీకి ఒక్కోరికి రూ.43,460 (డబుల్ ఆక్యుపెన్సీ) నుంచి రూ.47,340 (సింగిల్ ఆక్యుపెన్సీ) వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. పిల్లలకు రూ.37,440 చొప్పున చార్జీ ఉంటుంది. ప్రత్యేక రైలు యాత్రలు: ఐదు రాత్రులు, ఆరు పగళ్లపాటు కొనసాగే ప్రత్యేక రైలుయాత్రలో రామేశ్వరం, కన్యాకుమారి, మధురై యాత్రలుంటాయి. జూలై 29న కాచిగూడ నుంచి రైలు బయలుదేరుతుంది. ఆగస్టు 3న తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ పర్యటన చార్జీలను రూ.13,600 (డబుల్ ఆక్యుపెన్సీ), రూ.15,940 (సింగిల్ ఆక్యుపెన్సీ), రూ.13, 160(ట్రిపుల్ ఆక్యుపెన్సీ)గా నిర్ణయించారు. పిల్లలకు రూ.10,880 తీసుకుంటారు. వివరాలకు 040-27702407, 040-27800580 నంబర్ ఫోన్లలో సంప్రదించవచ్చు.