
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పర్యాటకులు, తీర్థయాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
విశాఖ–అరకు–విశాఖ (రైల్ కం రోడ్ )
ఈ టూర్ ప్రతిరోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్‌లో అరకు వ్యాలీ (ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, ధింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరి అదేరోజు రాత్రి విశాఖపట్నానికి చేరుస్తారు.
తిరుమల దర్శన్ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు)
ఈ టూర్ ప్రతిశుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్‌లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి తీసుకువెళ్లి, మళ్లీ అదే రైలులో విశాఖ తీసుకొస్తారు.
సదరన్ డివైన్ టెంపుల్ టూర్ (ఫ్లైట్ ప్యాకేజీ)
ఈ టూర్ ఆగష్టు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మొత్తం 5రాత్రులు, 6పగళ్లు ఉంటుంది. ఈ టూర్‌లో దక్షిణాదిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, త్రివేండ్రం వంటి దర్శనీయ స్థలాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబర్ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో గానీ, 0891–2500695, 8287932318 నంబర్లలో గానీ సంప్రదించాలని చంద్రమోహన్ సూచించారు.