రైల్వే ‘విదేశీ టూర్'
* మలేసియా, సింగపూర్‌లకు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు
* హైదరాబాద్, వైజాగ్‌ల నుంచి పర్యటించే సదుపాయం
హైదరాబాద్: భారతీయ రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీ టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో థాయ్‌లాండ్ పర్యటనతో విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఐఆర్‌సీటీసీ ఈసారి మలేసియా, సింగపూర్ పర్యటనలకు ప్రణాళికలను సిద్ధం చేసింది. హైదరాబాద్, విశాఖపట్నంల నుంచి ఈ అవకాశాన్ని పర్యాటకులు వినియోగించుకోవచ్చు. సెప్టెం బర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు ఆరు రాత్రులు, ఐదు పగళ్లతో ఈ యాత్ర సాగుతుంది.
ఆసక్తిగల వారు వివరాలను ఐఆర్‌సీటీసీ వద్ద నమోదు చేసుకోవచ్చు. ఈ టూర్‌లో మలేసియాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాసాక్ అండ్ మ్యూజియం, ట్విన్ టవర్స్, పార్లమెంట్ హౌస్ తదితర ప్రాంతాలు.. సింగపూర్‌లోని నైట్ సఫారి, సిటీ టూర్, లయన్ సిటీ, సివిక్ డిస్ట్రిక్ట్, పడాంగ్, క్రికెట్ క్లబ్, పార్లమెంట్ హౌస్ తదితర ప్రాంతాలను చూడొచ్చు. టూర్ లో భాగంగా పర్యాటకులకు త్రీస్టార్ హోటల్‌లో వసతి కల్పిస్తారు. ఈ పర్యటనకు హైదరాబాద్ నుంచి వె ళ్లేవారు ఒకరికి రూ.72,040 (డబుల్‌ఆక్యుపెన్సీ) నుంచి రూ.87,350 (సిం గిల్ ఆక్యుపెన్సీ) వరకు చార్జీలు వసూలు చేస్తారు. పిల్లలకు రూ.57,410 చొప్పున చార్జీ ఉంటుంది. వైజాగ్ నుంచి రూ.72,760 నుంచి రూ.88,070 చార్జీ లుంటాయి. పిల్లలకు రూ.58,126 చార్జీ ఉంటుంది.
థాయ్‌లాండ్ పర్యటన..
వచ్చే ఆగస్టు 22 నుంచి 26 వరకు అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండు విడతలుగా సాగే థాయ్‌లాండ్ పర్యటన సదుపాయం హైదరాబాద్ నుంచి మాత్రమే ఉంది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగే ఈ పర్యటనలో బ్యాంకాక్‌లో రెండు రాత్రులు, పట్టాయిలో రెండు రాత్రులు ఉంటారు. టైగర్ జూపార్కు, ఆల్కజార్ షో, కోరల్ ఐలాండ్, నాంగ్‌చూక్ ట్రాఫికల్ గార్డెన్, జెమ్స్ గ్యాలరీ, వాట్‌ఫో (బుద్ధ దేవాలయం), మార్బుల్ టెంపుల్ తదితర ప్రాంతాలను ఈ పర్యటనలో చూడొచ్చు. ఈ ప్యాకేజీకి ఒక్కోరికి రూ.43,460 (డబుల్ ఆక్యుపెన్సీ) నుంచి రూ.47,340 (సింగిల్ ఆక్యుపెన్సీ) వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. పిల్లలకు రూ.37,440 చొప్పున చార్జీ ఉంటుంది.
ప్రత్యేక రైలు యాత్రలు: ఐదు రాత్రులు, ఆరు పగళ్లపాటు కొనసాగే ప్రత్యేక రైలుయాత్రలో రామేశ్వరం, కన్యాకుమారి, మధురై యాత్రలుంటాయి. జూలై 29న కాచిగూడ నుంచి రైలు బయలుదేరుతుంది. ఆగస్టు 3న తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ పర్యటన చార్జీలను రూ.13,600 (డబుల్ ఆక్యుపెన్సీ), రూ.15,940 (సింగిల్ ఆక్యుపెన్సీ), రూ.13, 160(ట్రిపుల్ ఆక్యుపెన్సీ)గా నిర్ణయించారు. పిల్లలకు రూ.10,880 తీసుకుంటారు. వివరాలకు 040-27702407, 040-27800580 నంబర్ ఫోన్లలో సంప్రదించవచ్చు.