ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ పర్యటనలనునిర్వహించే ఐఆర్‌సీటీసీ కోవిడ్ దెబ్బకు కుదేల్ అయింది.లాక్‌డౌన్ కారణంగా ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు పూర్తీగా రద్దయ్యాయి. ప్రస్తుతం నిబంధనలను సడలించడంతో స్థానిక పర్యటనలపై అధికారులు దృష్టి సారించారు.
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్థానిక పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు త్వరలో ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సైట్ సీయింగ్‌తోపాటు, భద్రాచలం, శ్రీశైలం, విశాఖ, తిరుపతి వంటి పర్యటనలకే పరిమితం కానున్నారు. సాధారణంగా ఐఆర్‌సీటీసీ దేశీయ పర్యటనల కోసం రైళ్లను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో పర్యటన వారం నుంచి 15 రోజుల వరకు కూడా కొనసాగుతుంది. అయితే కోవిడ్ దృష్ట్యా రోడ్డు మార్గంలోనే పర్యటనలు ఏర్పాటు చేయనున్నారు. 30 మంది ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సుల్లో 20 మంది టూరిస్టుల చొప్పున తీసుకెళ్లనున్నట్లు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టిన వెంటనే పర్యాటక ప్యాకేజీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా స్థానిక పర్యటనలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థతో పాటు ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. కోవిడ్ ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ సైతం లోకల్ టూర్ రంగంలోకి ప్రవేశించడం గమనార్హం. ప్రజల అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా పర్యటనలను రూపొందించి నిర్వహించేందుకు అధికారులు వ్యూహరచన చేస్తున్నారు.
50 ప్యాకేజీలు రద్దు...
వేసవి సెలవుల్లో నగరవాసులు పెద్ద ఎత్తున జాతీయ అంతర్జాతీయ పర్యటనలకు వెళ్తారు. ఊటీ, సిమ్లా, కులుమనాలి, గోవా, జమ్ము కశ్మీర్, న్యూఢిల్లీ, ఆగ్రా, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిర్వహించే సుమారు 50కి పైగా ప్యాకేజీలు రద్దు కావడంతో 10 వేల మందికి పైగా తమ పర్యటనలను ఉపసంహరించుకున్నారు. జాతీయ పర్యటనలతోపాటు చైనా, శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, నేపాల్ తదితర దేశాలకు సైతం వేసవిలో నిర్వహించే పర్యటనలను ఐఆర్‌సీటీసీ ఈ ఏడాది రద్దు చేసింది. సుమారు రూ. 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ కారణంగా అంతర్జాతీయ, జాతీయ పర్యటనల స్థానంలో స్థానిక పర్యటనలపైన అధికారులు తాజాగా దృష్టి సారించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment