‘పర్వతాలు పిలుస్తాయి... వెళ్లాలి’ అంటారు పర్వతారోహకులు. మనకున్న ఎన్నో హాబీల్లో పర్వతారోహణ ఒకటి. చిన్న గుట్టలతో మొదలయ్యే హాబీ కొండలకు పర్వతాలకు ఎదిగి ఆఖరకు ‘ఎవరెస్ట్’ అధిరోహించడంతో ముగుస్తుంది. పర్వతారోహణ చేసేవారు జీవితంలో ఒక్కసారైనా పర్వతారోహణ చేయాలని కోరుకుంటారు. కొంతమంది ఏడు ఖండాల్లోని ప్రతి ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాలనుకుంటారు. ఇంతకూ పర్వతారోహణ వల్ల ఏమవుతుంది?
పర్వతాలు ఎక్కే క్రమంలో ప్రకృతి పెట్టే పరీక్షలను ఓర్చడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శిఖరం వరకూ చేరాక భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది.
జీవితం అంటే చిన్న చిన్న విషయాలు కాదు ఉదాత్తమైనవి ఉన్నతమైన విషయాలను సాధించడం అని తెలుస్తుంది. ‘పర్వతం వంటి వ్యక్తి’, ‘శిఖరం వంటి వ్యక్తి’ అని కొందరిని కోలుస్తారు. అంటే ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో వారు అత్యున్నత విజయాన్ని సాధించినవారన్నమాట. శాస్త్రవేత్తలలో ఐన్‌స్టీన్ శిఖరం వంటి వాడు. సినిమా నటులలో అమితాబ్ బచ్చన్ శిఖరం వంటి వాడు. మనం ఒక చిత్రకారులం కావాలనుకుంటే పికాసో అంతటి వాళ్లం కావాలని లక్ష్యం పెట్టుకోవాలి. అలాంటి స్ఫూర్తి పర్వతారోహణ వల్ల కలుగుతుంది.
అబ్బాయిల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదు అని ఆత్మవిశ్వాసం తెచ్చుకోవడానికి అమ్మాయిలకు పర్వతారోహణ ఒక మంచి మార్గం.
పర్వతారోహణలో వీపు వెనుక బరువు వేసుకుని ఎక్కాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనడం పెద్ద కష్టం కాదని ఈ కష్టం పడినప్పుడు తెలుస్తుంది. పర్వతారోహణలో పోదుపుగా తెలుస్తుంది. తీసుకెళ్లిన ఆహారాన్ని పోదుపుగా వాడుకోవాలి. నీళ్లను ΄÷దుపుగా వాడుకోవాలి. జీవితంలో కూడా ఉన్న నిధులను ఎలా జాగ్రత్త చేసుకోవాలో దీని వల్ల తెలుస్తుంది.
అహం (ఇగో) కొన్నిసార్లు మేలు చేస్తుంది. కొన్నిసార్లు హాని చేస్తుంది. అంత ఎత్తయిన పర్వతం మౌనంగా ఉన్నప్పుడు ఆరడుగుల మనిషి ఎందుకు మిడిసి పడాలి. ఎదిగేకొద్దీ వొదగడం పర్వతం నేర్పిస్తుంది. వినయం విజయానికి తొలి మెట్టు.
ఉదయాన్నే లేచి స్కూలుకు వెళుతున్నాం, ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్నాం అనుకుంటాంగాని కొండనో పర్వతాన్నో ఎక్కితేనే మనం ఎంత ఫిట్‌గా ఉన్నామో తెలుస్తుంది. మన ఊపిరితిత్తులు, మోకాళ్లు, పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో పర్వతారోహణ తెలియచేస్తుంది. ఈ హాబీని ఫాలో అయ్యేవారు ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరిన్ని పర్వతాలు ఎక్కేందుకు మరింత ఫిట్‌గా ఉంటారు. కాబట్టి పర్వతారోహణ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment