భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వీర రాణా నియమితులయ్యారు. రాష్ట్ర సీఎస్‌గా గురువారం ఆమె అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. వీర రాణా ప్రస్తుతం మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రెండు సార్లు పొడిగింపుల తర్వాత పదవీ విరమణ చేయనున్న అవుట్‌గోయింగ్ సీఎస్ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ స్థానంలో 1988 బ్యాచ్‌కు చెందిన వీర రాణా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన బెయిన్స్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 మే 31 వరకూ మొదటిసారి పదవీ కాలాన్ని పొడిగించగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2023 జూన్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు మరోసారి పొడిగించారు.
రెండో మహిళగా రికార్డ్
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళగా వీర రాణా రికార్డు సృష్టించారు. 1990వ దశకం ప్రారంభంలో మధ్యప్రదేశ్‌కు తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి నిర్మలా బుచ్ నియమితులయ్యారు. ఈమె ఈ ఏడాది జూలైలో కన్నుమూశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం బెయిన్స్‌కు వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment