తాడేపల్లి: ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు హడావుడి చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బీజేపీని తిట్టిన నోటితోనే చంద్రబాబు మళ్లీ పొగుడుతున్నారని మండిపడ్డారు. పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలని, పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదన్నారు సజ్జల.
పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదు
ప్రకటించిన మేనిఫెస్టో ఏంటో టీడీపీ వారికే గుర్తులేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు బపూన్కు ఎక్కువ .. జోకర్ కు తక్కువ అని దుయ్యబట్టారు. 2019 వరకు చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేయడానికి చంద్రబాబే సిద్ధంగా లేరని అన్నారు. ఆనాడు ప్రధాని మోదీ కుటుంబం గురించి చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు.. ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ , బీజేపీని కీర్తిస్తున్నారని చెప్పారు. పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదని అన్నారు.
'నడ్డాతో చంద్రబాబు వంగి వంగి.. నంగి నంగి మాట్లాడారు. బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నారు. చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలే రావడం లేదు. ప్రజలను భ్రమలో పెట్టాలనుకుని వారే భ్రమలో బతుకుతున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ ను అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ నాణెం పేరిట లక్ష్మీపార్వతిని పిలవకుండా అయన ఆత్మకు క్షోభ పెట్టారు. ఈసారి రెండు వెన్నుపోట్లు చంద్రబాబు పొడిచారు.
చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి కలిసి బీజేపీతో కలిసేందుకు పైరవీలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై 70 శాతం మంది ప్రజలు పాజిటివ్ గా ఉన్నారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారు. టీడీపీ సొంతంగా ఎందుకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదు. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ గా మారారు.' అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
ఇదీ చదవండి: పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్ పాలిటిక్స్: వెల్లంపల్లి వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment