కాశీగా పేరొందిన వారణాసి మహా శివుని ఆవాసమని అంటారు. ప్రపంచంలోని పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఈ నగరంలో నిరంతరం శివనామస్మరణ మారుమోగుతుంటుంది. మోక్షదాయినిగా భావించే గంగా నది ఒడ్డున నిర్మించిన మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్‌తో సహా 80 ఘాట్‌లు ఇక్కడున్నాయి.
అయితే వారణాసికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. ఈ నగరం గత పదేళ్లుగా భారత రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు అనూహ్య విజయాన్ని నమోదు చేసిన ప్రధాని మోదీ మరోమారు ఇక్కడి నుంచే తన నామినేషన్ దాఖలు చేశారు. 2014లో తొలిసారిగా ఇక్కడి నుంచి విజయం సాధించిన ప్రధాని మోదీ గంగానదికి తల వంచి నమస్కరించారు. తనకు కాశీతో గాఢమైన అనుబంధం ఉందని, ఈ నగరాన్ని తన తల్లిలా భావిస్తానని, గంగామాత తనను ఇక్కడికి పిలిచిందని ప్రధాని మోదీ చెబుతుంటారు.
2014లో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ కాశీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై 371,784 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పుడు నరేంద్ర మోదీకి 581,022 ఓట్లు రాగా, అరవింద్ కేజ్రీవాల్‌కి 209,238 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్‌కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. అజయ్‌రాయ్ ఇప్పుడు తిరిగి వారణాసి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు.
ఠాకూర్ రఘునాథ్ సింగ్ వారణాసి నుంచి ఎంపికైన తొలి ఎంపీ. ఆయన 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన 1957, 1962లో కూడా ఇక్కడి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1967లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన సత్యనారాయణ సింగ్ ఈ స్థానంలో గెలిచారు. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన రాజారాం శాస్త్రి, 1977లో జనతా పార్టీకి చెందిన చంద్రశేఖర్, 1980, 1984లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలపతి త్రిపాఠి, 1989లో జనతాదళ్‌కు చెందిన అనిల్ శాస్త్రి ఈ స్థానం నుంచి గెలిచి ఎంపీలు అయ్యారు.
భారతీయ జనతా పార్టీ 1991, 1996, 1998, 1999 సంవత్సరాల్లో వరుసగా నాలుగు సార్లు ఈ స్థానాన్ని గెలుచుకుంది. 2004లో ఈ సీటును కాంగ్రెస్ గెలుపొందగా, 2009 నుంచి 2019 వరకు బీజేపీ విజయం సాధిస్తూ వచ్చింది. 2009లో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014, 2019లలో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఎంపీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment