మూడు దారులు..! ఎన్నో గుర్తులు..!! | Rachapalem Chandrasekhara Reddy Written A Book On Political Leaders | Sakshi
Sakshi News home page

మూడు దారులు..! ఎన్నో గుర్తులు..!!

Published Mon, Feb 19 2024 5:29 PM | Last Updated on Mon, Feb 19 2024 5:31 PM

Rachapalem Chandrasekhara Reddy Written A Book On Political Leaders - Sakshi

"నడిచి పోయిన చరిత్రను రాయడం చాలా సులభం. నడుస్తున్న చరిత్రను రాయడం చాలా కష్టం. గతకాలపు చరిత్ర ఆకారాలు కష్టపడి సంపాదించాలి. అవి దొరికితే చరిత్ర రాయడం సులభం. వాటిని అధ్యయనం చేసి, వివరించి, ఒక నిర్ణయానికి రావడం, కొన్ని సూత్రీకరణలు చేయడం సులభం. ఆచరిత్ర నిర్మాతలు మన కళ్ళముందు ఉండరు. ఆ పాత్రలు మనతో మాట్లాడవు. మనం రాసింది వాళ్ళు చూడరు. నడుస్తున్న చరిత్రకు ఆకారాలు అపారంగా దొరుకుతాయి."

ఆ చరిత్ర నిర్మాతలు మనకళ్ళముందు కదలాడుతుంటారు. మనతో మాట్లాడుతుంటారు. కలిసి జీవిస్తుంటారు. ఈ చరిత్రను తెలిసిన వాళ్ళుకూడా మన చుట్టూ ఉంటారు. ఈ ఆకారాలను ఏరుకొని, అధ్యయనం చేసి, వివరించి, సూత్రీకరించడం చాలా కష్టం. చారిత్రక వాస్తవాలు ఉటంకించడం సులభం. వాటిని వ్యాఖ్యానించడం కత్తిమీద సాము వంటిది. గత చరిత్ర రాసినవాళ్ళకు ఏ ప్రశ్నలూ ఎదురుకావని కాదు. అయితే వాటికి సమాధానం చెప్పడం సులభం. నడుస్తున్న చరిత్ర రాసినవాళ్ళకు చాలా ప్రశ్నలు ఎదురౌతాయి. వాటికి సమాధానాలు సమకూర్చుకోవడం అదనపు శ్రమ.

గత చరిత్రను రాయడంలో విషయలోపమున్నా, విధానంలోపమున్నా అనంతరకాలంలో సవరించుకోవచ్చు. నడుస్తున్న చరిత్ర రచనలో ఆ రెండు లోపాలు ఉంటే సమాజంలో తక్షణస్పందన రచయితను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నడిచి పోయిన చరిత్రతో చరిత్ర రచయితకు సయోధ్య లేకపోయినా చెప్పడం సులభం. నడుస్తున్న చరిత్రతో రచయితకు సయోధ్య కుదరని సందర్భాలను వ్యాఖ్యానించడం అంత సులభం కాదు. సృజనసాహిత్యంలోనైతే రచయిత కల్పనను గొప్ప ఆయుధంగా వాడుకొని గట్టెక్కవవచ్చు. చరిత్ర రచనలో కల్పనకు అవకాశమే లేదు. చరిత్రలో రచయిత చరిత్రంతా చెప్పాలి. చరిత్ర తప్ప ఇంకేమీ చెప్పకూడదు. 

దేవులపల్లి అమర్ గారు ఇవన్నీ తెలిసినవారు. ఆయన రాసిన "మూడు దారులు" నడుస్తున్న చరిత్ర. ఆ చరిత్రకు కారకులు మనందరికీ తెలిసినవారు. మనం చూసిన వాళ్ళు. మన ముందు ఉండినవారు, ఉన్నవారు. వాళ్ళ సమాచారం గుట్టలకొలదీ లభిస్తున్నది. అమర్ గారు ఆ సమాచారం గుట్టలు తవ్వి తాను రాయదలచుకున్న చరిత్ర రచనకు అవసరమైన అంశాలను జాగ్రత్తగా ఎన్నుకొని వాస్తవిక దృక్పథంతో ఈ రచన చేశారు. వాస్తవాల విజ్ఞానం, వాస్తవిక దృష్టి, వాస్తవాభివ్యక్తినిబద్ధత, నిస్సంకోచం ఈ గ్రంథంలోని విశేషాలు.
        నాలుగున్నర దశాబ్దాలలో తెలుగునాట రాజకీయరంగాన్ని నడిపిన ముగ్గురి జీవితాల వ్యాఖ్యానం ఈ గ్రంథం. చరిత్రకారులు మేధావులు. సద్దలు తిని సద్దలు విసర్జించరు. సామాజిక వాస్తవాలను జీర్ణించుకొని సామాజిక వాస్తవికతను మనకందిస్తారు. అమర్ గారు ఈ పని ఫలవంతంగా చేశారు. చరిత్రలో రచయిత ఆమోదించే అంశాలు చెప్పడం సులభం. ఆమోదం లేని అంశాలను చెప్పడానికి చిత్తశుద్ధి ఉంటే చాలదు. నిజాయితీ ఉండాలి. దానికి మించి ధైర్యం ఉండాలి.

ధైర్యం ఎందుకంటే అనామోద ఆంశాలను చెప్పినప్పుడు అనేక పార్శ్వాలనుండి అనేక  సవాళ్ళు ఎదురౌతాయి. వాటికి సమాధానం చెప్పడానికి, వాటిని ఎదుర్కోవడానికి ధైర్యం అవసరం. అమర్గారిలో ఈ గుణాలు ఉన్నాయి. చరిత్రలో చరిత్ర రచయిత ఆమోదించినవీ, ఆమోదించనివీ ఆ రచయిత వ్యక్తిగత అభిరుచులుగా ఉండకూడదు. వాటికి కూడా ఒక హేతుబద్ధత, ప్రామాణికత ఉండాలి. అవి సామాజిక సత్యాలని రుజువుచేసే సత్తా చరిత్రకారునికుండాలి. అమర్ గారిలో అవి ఉన్నాయి. 

1978లో తెలుగు నాట రాజకీయ రంగప్రవేశం చేసిన డా. వై యస్ రాజశేఖరరెడ్డిగారు, నారా చంద్రబాబు నాయుడుగారు,  వాళ్ళ తర్వాత 2004లో రాజకీయాల్లోకి వచ్చిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిగారు.. ఈ ముగ్గురి వ్యక్తిత్వాలను, జీవితాలను, పాలనా విధానాలను మూడు దారులుగా నిర్వచించి, విస్తరించి రాశారు అమర్ గారు.

రాజకీయాలలో విశ్వసనీయతా విశ్వసనీయతలు, నిబద్ధానిబద్ధతలు ఎలా ఉంటాయో రుజువు చేశారు. ప్రజాస్వామ్యయుగంలోకూడా భూస్వామ్య యుగ రాజకీయ స్వభావం, ఎత్తుగడలు ఎలా కొనసాగుతున్నాయో అమర్ గారు చక్కగా వివరించారు. సాధారణంగానే రాజకీయ చరిత్ర ఎత్తుగడలు మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎత్తుగడలు ప్రజానుకూలంగా ఉంటే పాలన ఎలా ఉంటుందో, ప్రజావ్యతిరేకంగా ఉంటే పాలన ఎలా ఉంటుందో అమర్‌గారు దృష్టాంతాలుతో స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వ్యాపారబుద్ధి చొరబడితే పాలన ఎంత ప్రజాకంటకంగా ఉంటుందో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా అమర్‌గారు నిరూపించారు.

చరిత్రకారునికి విషయం పరిజ్ఞానం ఉండడం ఎంత ముఖ్యమో, విషయ వ్యక్తీకరణ సామర్థ్యం ఉండడం కూడా అంతే ముఖ్యం. అమర్‌గారిలో ఈ రెండు శక్తులు సమానస్థాయిలో ఉన్నాయి. మూడు దారులు గ్రంథం చదువుతుంటే నాలుగున్నర దశాబ్దాల తెలుగు నేల చరిత్ర మీద వచ్చిన ఒక నవలను చదువుతున్న అనుభవం, అనుభూతి కలుగుతాయి. సామాన్య పాఠకులకు కూడా వర్తమాన రాజకీయాలు ఎలా ఉన్నాయో ఈ గ్రంథం సులభంగా తెలియజేస్తుంది.


– రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement