పుట్టుకతో మనిషీ, మనసూ వేరువేరు. అవి అనివార్యంగా మిళితం కావాలన్నా.. ఒకదానితో ఒకటి మమేకమై, ముందుకు సాగాలన్నా..ఆదర్శవంతమైన మార్గదర్శి వెన్నంటే ఉండాలి. తొలి తొలిగా తల్లి వెచ్చని పొత్తిళ్లు ప్రేమానుబంధాలను వల్లెవేస్తాయి. ఆపై, తండ్రి గుండె చప్పుళ్లు నిశ్చింతగా బుడిబుడి నడకలను నేర్పిస్తాయి. కాస్త ఊహ తెలిసి, ఊసులెరిగి, ఉబలాటంతో ఊగిసలాడే పసిమనసుకి..కళ్లెం వేసినట్లు, కంచె కట్టినట్లు.. అప్పుడు ఎదురొస్తారు గురువులు. మొక్కను వంచి మానును చేస్తారు. ఈ లోకంలో కాలం మెచ్చిన ఆదర్శగురువులెందరో.. గురువును మించిన శిష్యులూ అందరే! అదే గురువు ఘనతకు ప్రతీతి.
ఓం సహనావవతు, సహనౌభునక్తు,
సహవీర్యం కరవావహై! తేజస్వి నావధీతమస్తు
మా విద్విషావహై!
భావం: గురుశిష్యుల మధ్య బంధాన్ని తెలిపే శ్లోకమిది. ఒకప్పటి గురువుల ఆశ్రమాల్లోనూ.. ఇప్పటికీ కొన్ని గురుకులాల్లో గురుశిష్యులు కలసి చెప్పుకునే శాంతి మంత్రమిది.
‘ఆ భగవంతుడు గురుశిష్యులమైన మనిద్దరినీ రక్షించును గాక.. మనిద్దరినీ వృద్ధి చేయును గాక.. మనిద్దరికీ ఈ అధ్యయనానికి అవసరమైన శక్తిని పెంపొందించు గాక.. మనం చదివేది, నేర్చుకునేది మనిద్దరికీ వెలుగుని ఆపాదించు గాక.. మన మధ్యలో విభేదాలు తలెత్తకుండా ఉండు గాక’ ఇదే ఈ శ్లోకతాత్పర్యం.
దీన్ని బట్టి బోధన అనేది ఎంతటి పవిత్రతను ఆపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు!‘మనిషి తలరాతలను రాసేవాడు విధాత. తరాల తలరాతలను మార్చగలిగేవాడు విజ్ఞానదాత’ అనేది లోకోక్తి. ‘నీ కులమేదైనా, నీ మతమేదైనా నువ్వు చదువుకున్నవాడివైతే చాలు.. ఈ సమాజం నీకో కుర్చీ వేసి కూర్చోబెడుతుంది’ అంటారు సమాజోద్ధారకులు. ‘గురువు, దేవుడు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే, దేవుడ్ని నాకు పరిచయం చేసింది నా గురువే కనుక’ అన్నాడు రామభక్తుడైన కబీర్ దాస్. ఇవన్నీ కేవలం సూక్తులు కాదు గురుబోధలు. తరచి చూస్తే ఈ ప్రపంచం మొత్తం గురుకృపతోనే నిండి ఉంది. ప్రతి అణువూ జ్ఞానాన్నే పంచుతుంది. దాన్ని ఆస్వాదించే వినమ్రత మనలో ఉండాలంతే!
గురుచరిత్ర
మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునులను అసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. అరణ్యపర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలో యక్షుడు ‘మనిషి మనీషిగా ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తే ‘గురువు కారణంగా, అధ్యయనంతో మాత్రమే’ అని బదులిచ్చాడు. గురువు శక్తి అంత గొప్పది. పాశ్చాత్య నాగరిక చరిత్రను తిరగేస్తే.. గ్రీకు దేశానికి చెందిన సోక్రటీస్ తత్వబోధకు ఆద్యుడు. గురువుగా ఆయన ప్రభావం ప్లాటో మీదే కాదు.. ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్‌పైన కూడా ఎంతో ఉంది. ఈ గురుపరంపరలోని అరిస్టాటిల్ వద్ద జగజ్జేత అలెగ్జాండర్ చదువుకున్నాడు.
భరతఖండంలో వేదాల వ్యాప్తి మొదలైనప్పటి నుంచి గురుబోధన కొనసాగింది కాబట్టే నాటి జ్ఞానం నేటికీ తార్కాణమైంది. హరప్పా నాగరికత బయటపడిన తర్వాత సింధు లిపి, శాసనాలు కూడా గురుప్రస్థానానికి నిదర్శనమేనని చెప్పుకోవాలి. శివాజీ అనే వీరుడ్ని సమర్థ రామదాసు చెక్కితే, ఆధ్యాత్మిక శిఖరమైన వివేకానందుడ్ని రామకృష్ణ పరమహంస మలచారు.
అలా పుట్టుకొచ్చాయి పంచతంత్ర కథలు
మౌర్యరాజ్య స్థాపకుడు చంద్రగుప్తుని గురువు చాణక్యుడు. ఆనాటి నలంద విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. ఆ సమయంలోనే ఆయన చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన ‘అర్థాన్ని’ గురించి అర్థశాస్త్రాన్ని రచించాడు. మరోవైపు 5, 6 శతాబ్దాల్లో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు బౌద్ధుల విజ్ఞాన కేంద్రాలుగా విరాజిల్లాయి. ఆ రెండు విశ్వవిద్యాలయాల్లో చదివినవాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధిగాంచారు. కొన్ని వేలమంది విదేశీ విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వచ్చేవారు. అమరశక్తి అనే దక్షిణ భారత రాజు.. తన పుత్రులకు విద్యాబుద్ధులు నేర్పించమని వృద్ధుడైన విష్ణుశర్మని కోరడంతోనే ‘పంచతంత్ర కథలు’ పుట్టుకొచ్చాయి. అవి ఎన్నో ప్రపంచ భాషలలోకి తర్జుమా అయి, ఎంతో ప్రాచుర్యం పొందాయి.
బ్రిటిష్‌కాలంలో ఆధునిక విద్యాలయాలు మొదలైనా, ఆ కాలంలోనూ మన దేశంలో సంప్రదాయబద్ధమైన గురుకులాలు చాలానే నడిచేవి. నిజాం రాజ్యంలో ‘అఘోరనాథ ఛటోపాధ్యాయ’ నిజాం కాలేజ్ తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దేశంలో స్త్రీ విద్య కోసం తప్పించిన తొలిగురువు సావిత్రిబాయ్ పూలే. ఆమె బోధన కృషిని తరతరాలూ స్మరించుకుని తీరాల్సిందే. కట్టమంచి రామలింగారెడ్డి నాటి విద్యావేత్తల్లో ప్రసిద్ధుడు. మైసూరు విశ్వవిద్యాలయ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్‌చాన్సలర్‌గా పనిచేశారు.
రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోనే ఎందరో ప్రముఖులు ఆరితేరారు. భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన మౌలానా అబుల్‌కలాం ఆజాద్ స్వయంగా కవి, పండితుడు. ఆయన అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ వంటి భాషలలో ప్రవీణుడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖమంత్రిగా పనిచేసి గుర్తింపు పొందారు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లంతా ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.సర్వేపల్లి ఘనత
సర్వేపల్లి ఘనత
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టిన ఘనుడు. సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజునే మనం టీచర్స్‌డేగా జరుపుకుంటున్నాం. భారతదేశపు అత్యంత క్లిష్టకాలమైన చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధ సమయాల్లో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. చేపట్టిన పదవులు, పొందిన గౌరవాలు, రాసిన రచనలే సర్వేపల్లిని ఉన్నతంగా నిలబెట్టాయి. భారతరత్న పురష్కారం ఆయన్ని వరించింది. ‘తత్వం అనేది జీవితాన్ని అర్థం చేసుకునే ఒక మార్గం’ అంటారు ఈయన. ‘భారతదేశ మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి.బోధకుడే కాదు, శిక్షకుడు కూడా..
బోధకుడే కాదు శిక్షకడు కూడా..
పురాణాల్లో అవతారపురుషుడైన పరశురాముడు.. కుంతీపుత్రుడైన కర్ణుడికి గురువు. అయితే తన దగ్గర సకల అస్త్రాల ప్రయోగాలు నేర్చుకున్న కర్ణుడు కౌరవుల పక్షాన, అధర్మం వైపు నిలబడ్డాడని తెలిసి శపించాడు. విద్యాబుద్ధులు నేర్పే సమయంలో కర్ణుడి తెలివికి, గుణానికి మెచ్చి.. బ్రహ్మాస్త్రాన్నీ గురువరంగా ఇచ్చిన పరశురాముడు.. కర్ణుడి తప్పిదాన్ని ముందుగానే భవిష్యత్ దర్శనంలో చూసి ఆగ్రహించాడు.
మొదట దుర్యోధనుడితో స్నేహం వదులుకోమని హెచ్చరించాడు. కర్ణుడు వినకపోవడంతో.. అత్యవసర సమయాల్లో అస్త్ర ప్రయోగ మంత్రాలు గుర్తుకురావని శపించాడు. అలా అధర్మ పక్షం వహించిన కర్ణుడిని అదుపు చేయగలిగాడు. స్వార్థం లేకుండా తన జ్ఞానాన్ని పంచే గురువు.. తన శిష్యుడు దారి తప్పితే గుర్తించి శిక్షిస్తాడని, అవసరమైతే శపిస్తాడని చెప్పే గాథ ఇది.
(చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు)
Comments
Please login to add a commentAdd a comment