Sr NTR 100th Birth Anniversary: Sakshi Special Story On Sr NTR Filmography - Sakshi
Sakshi News home page

NTR Birth Anniversary: తెలుగు తెరపై చెరగని ముద్ర.. ఆరు పడవల ప్రయాణం..

Published Sun, May 28 2023 2:17 AM | Last Updated on Sun, May 28 2023 3:32 PM

NTR Centenary birth celebrations: NTR Movie Biography Of Sakshi Special Story

శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు, భీముడు....  ‘శ్రీమద్విరాట పర్వము’లో ఈ ఐదు భిన్న పాత్రల్లో ఎన్టీఆర్‌ అభినయం చూసి, తెలుగు ప్రేక్షకులు ఆనందించారు.. నటన మాత్రమే కాదు... తెరపై ఆ అందగాడిని చూసి ఆనందించారు. అదే అందగాడు కురూపిగా కనిపించినా ఆనందించారు.. ఆ నటన అలాంటిది. 44ఏళ్ల సినీ కెరీర్‌లో ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చిన నటుడు ‘నటనానంద తారకరాముడు’ (ఎన్‌.టి.ఆర్‌).

ఈ తారక దేశంలోనే వంద చిత్రాలు పూర్తి చేసిన తొలి ఘనుడు.. ఆ తర్వాత ఎనిమిదేళ్లల్లో 200 సినిమాలు పూర్తి చేసి, రాష్ట్రంలో రెండొందల సినిమా మార్క్‌ చేరుకున్న నటుడు. 300 మార్కు కూడా ఈ నటుడి సొంతమే. 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలు చేసి, తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్‌. తొలి చిత్రం ‘మనదేశం’తో మొదలుకొని, చివరి చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌ ’ వరకూ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. వాటిలో 140 వందరోజుల చిత్రాలు కాగా, 33 రజతోత్సవ చిత్రాలు కావడం విశేషం. ఈ ‘నటనానంద తారక’ ‘శత జయంతి’ నేడు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాల్లో కొన్ని ఈ విధంగా...



పౌరాణికం
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, దుర్యోధనుడు, భీముడు, యముడు, రావణాసరుడు... ఎలా ఉంటారు? ‘ఇలా ఉంటారు?’ అని ఎన్టీఆర్‌ తన పాత్రలతో చూపించారు. పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు ఎన్టీఆర్‌. ఆయన నటించిన పౌరాణిక చిత్రాల్లో ఎప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977). ఎన్టీఆర్‌ ఆరు పడవల ప్రయాణం ఈ సినిమా. అంటే..నటన, దర్శకత్వం, నిర్మాణం.. ఈ మూడు బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు... మూడు పాత్రలను చేయడం అంటే ఆరు పడవల ప్రయాణమే కదా.

మేకప్‌ వేయడానికి మూడు గంటలు, తీయడానికి రెండు గంటలు పట్టేదట. మూడు పాత్రల అభినయానికి, దర్శకుడిగా తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర కోసం అక్కినేని నాగేశ్వర రావుని సంప్రదిస్తే.. ‘కృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూసిన కళ్లతో ప్రేక్షకులు నన్ను చూడలేరు’ అంటూ చేయనని చెప్పారట. దీంతో కర్ణుడి పాత్ర అయినా చేయమని కోరితే.. ‘ఆ పాత్రకి నా ఆహార్యం సరిపోదు’ అంటూ సున్నితంగా తిరస్కరించారట ఏఎన్‌ఆర్‌.  శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్‌ అనుకునేలా ఆ పాత్రకు వన్నె తెచ్చారు.

‘ఇద్దరు పెళ్లాలు’ (1954) చిత్రంలో ఎన్టీఆర్‌ తొలిసారి కృష్ణునిగా కనిపించారు. ఆ తర్వాత ‘మాయాబజార్‌’ (1957), ‘వినాయకచవితి’ (1957), ‘దీపావళి’ (1960), ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1963), ‘శ్రీకృష్ణ తులాభారం’ (1966) ఇలా... పలు చిత్రాల్లో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. ఆయన్ని అపర శ్రీకృష్ణునిగా నిలిపిన చిత్రం ‘మాయాబజార్‌’. ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆరే శ్రీకృష్ణునిగా నటించి, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు.

ఇక ‘శ్రీకృష్ణ తులాభారం’లో మరోమారు కృష్ణుని పాత్రలో జీవించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రధారి అయిన ఎన్టీఆర్‌ని సత్యభామ పాత్రధారి జమున కాలితో తన్నే సన్నివేశం ఉంటుంది. అంత పెద్ద స్టార్‌ హీరో అయినా భేషజాలకు పోకుండా, అభిమానులు, ప్రేక్షకులు ఏమనుకుంటారో? అని ఆలోచించకుండా కథకి అవసరం మేరకు ఆ సన్నివేశంలో నటించి, ‘దట్‌ ఈజ్‌ ఎన్టీఆర్‌’ అనిపించుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఒదిగిపోయిన ఎన్టీఆర్‌.. శ్రీరామునిగానూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

‘చరణదాసి’ (1956) చిత్రంలో తొలిసారి శ్రీరామునిగా కనిపించారు. ఆ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’ (1958)లో తొలిసారి పూర్తి స్థాయిలో శ్రీరామునిగా నటించారాయన. ‘లవకుశ’ (1963) చిత్రంలో శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్‌ జీవించారు. ఆ తర్వాత ‘శ్రీరామ పట్టాభిషేకం’ (1978)తో పాటు మరికొన్ని చిత్రాల్లో శ్రీరామునిగా ప్రేక్షకులను అలరించారు. సౌమ్యుడైన  శ్రీరాముడు పాత్రకు పూర్తి వ్యతిరేకమైన రావణాసురుడి పాత్రలోనూ ఎన్టీఆర్‌ ఒదిగిపోయిన వైనం అద్భుతం. ‘భూకైలాస్‌’ (1958) చిత్రంలో ఎన్టీఆర్‌ తొలిసారి రావణబ్రహ్మ పాత్రలో నటించి, మెప్పించారు.

ఆ తర్వాత ‘సీతారామ కళ్యాణం’ (1961), ‘శ్రీరామపట్టాభిషేకం’ (1978) వంటి పలు సినిమాల్లో రావణబ్రహ్మగా శభాష్‌ అనిపించుకున్నారు. అదే విధంగా ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ (1960)లో తొలిసారి వెంకటేశ్వర స్వామి పాత్ర చేశారు ఎన్టీఆర్‌. అలాగే ‘పాండవ వనవాసము’ (1965)లో భీమునిగా, ‘ఉమ్మడి కుటుంబం’ (1967)లో తొలిసారి ‘యముడి’ పాత్రలో ఆకట్టుకున్నారాయన. ఇక ‘నర్తనశాల’ (1963)లో బృహన్నల పాత్రలో తన నటనా ప్రతిభను మరోసారి చూపించారు ఎన్టీఆర్‌. ఇలా పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ చెరగని ముద్ర వేశారు.

జానపదం
ఎన్టీఆర్‌ నటించిన తొలి జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (1950). ఈ చిత్రంలో క్రూరమైన ఎద్దుతో ఎన్టీఆర్‌ పోరాడే యాక్షన్‌ సీన్‌ ఉంది. చిత్రదర్శకుడు బీఏ సుబ్బారావు ఎద్దు కొమ్ములను పట్టుకుంటే చాలని ఎన్టీఆర్‌తో అన్నారు. కానీ, ఎన్టీఆర్‌ ఆ ఎద్దుతో నిజంగానే పోరాడారు. ఆ యాక్షన్‌ సీన్‌ అప్పుడు రెండుసార్లు ఫ్రాక్చరయింది. డాక్లర్టు విశ్రాంతి సూచించినా ‘నో’ అన్నారు ఎన్టీఆర్‌.

కట్టు కనిపించకుండా పొడవు చేతుల చొక్కా ధరించి, నటించారు. ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైన మరుసటి సంవత్సరం ‘పాతాల భైరవి’ (1951)లో చేసిన తోటరాముడి పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. ఈ పాత్రకు ఎన్టీఆర్‌ని తీసుకోవాలని నిర్మాతలు నాగిరెడ్డి–చక్రపాణి అనుకుంటే... పెద్దగా ఇమేజ్‌ లేని నటుణ్ణి అంత పెద్ద పాత్రకా? అనుకున్నారు దర్శకుడు కేవీ రెడ్డి.

సరిగ్గా అదే టైమ్‌కి టెన్నిస్‌ ఆడుతున్న ఎన్టీఆర్‌ రెండు పాయింట్లు కోల్పోవడంతో బంతిని విసిరి కొట్టారు. అంతే.. జానపద నాయకుడి లక్షణం ఉందని తోటరాముడిగా ఎన్టీఆర్‌ని ఫిక్స్‌ చేశారు కేవీ రెడ్డి. ఈ పాత్రలో ఎన్టీఆర్‌ రెచ్చిపోయి నటించారు. ఇంకా ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, ‘అలీబాబా నలభై దొంగలు’, ‘చిక్కడు దొరకడు’, ‘మంగమ్మ శపథం’, ‘గండికోట రహస్యం’... ఇలా దాదాపు యాభై జానపద చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్‌.

సాంఘికం
హీరోగా పట్టుమని పది సినిమాలు పూర్తి చేయకుండానే సందేశాత్మక సినిమాలు చేయాలనుకున్నారు ఎన్టీఆర్‌. వరకట్నం తీసుకోవడం సరైంది కాదని, యువతలో చైతన్యం నింపేలా, అభ్యుదయ భావాలు రేకెత్తించేలా ‘పెళ్లి చేసి చూడు’ (1952)ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ తర్వాత 1970లో స్వీయ దర్శకత్వంలో వరకట్నం ప్రధానాంశంగానే ‘వరకట్నం’ సినిమా తెరకెక్కించి, నటించారాయన. ఇక అప్పటి సాంఘిక దురాచారాల్లో ప్రముఖంగా వినిపించే మరో అంశం ‘కన్యాశుల్కం’.

ఈ విషయంలో ప్రజల ఆలోచనా సరళిలో మార్పు రావాలనే ఉద్దేశ్యంతో ‘కన్యాశుల్కం’లో గిరీశంగా కనిపించి, మెప్పించారు ఎన్టీఆర్‌. ఈ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్‌ చేసిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రాలే కాదు.. ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను తెలియజేసేలా, ‘ఉమ్మడి కుటుంబం’,  కుటుంబ సంబంధాలకు అద్దంపట్టేలా ‘తల్లా? పెళ్లామా?’ చిత్రం, ఈ కోవలోనే ‘కోడలు దిద్దిన కాపురం’,  ‘తాతమ్మ కల’, ‘ఇంటిగుట్టు’ సినిమాలు చేశారు ఎన్టీఆర్‌.

ముఖ్యంగా 1969–1970 దశకంలో ఎన్టీఆర్‌ నుంచి ఎక్కువగా సాంఘిక చిత్రాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘వరకట్నం, తల్లా? పెళ్లామా?, కొడుకులు దిద్దిన కాపురం’ సినిమాల్లో నటించి, స్వీయ దర్శకత్వం వహించారు ఎన్టీఆర్‌. ఈ చిత్రాలే కాదు.. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయాలని గ్రామీణ యువకులను ప్రోత్సహించే విధంగా ‘పల్లెటూరు’, ‘రైతుబిడ్డ’ వంటి వ్యవసాయ ఆధారిత సినిమాల్లో నటించారు.

అలాగే వ్యవసాయ రంగంలో పెత్తందార్లను ప్రశ్నించేలా ‘పెత్తందార్లు’లో నటించారు. ఇంకా సమాజంలోని అసమానతను తెలిపేలా ‘రాజూ పేద’, మహిళలకు సమాజంలో దక్కాల్సిన గౌరవాన్ని గుర్తు చేసేలా ‘నాదీ ఆడ జన్మే’, ‘స్త్రీ జన్మ’ వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు ఎన్టీఆర్‌. అలాగే దేశభక్తిని చాటేలా ‘బొబ్బిలిపులి’, ‘నా దేశం’, ‘జస్టిస్‌ చౌదరి, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, కులమతాలకు అతీతంగా ‘ఒకే కుటుంబం’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

ప్రయోగాత్మకం
‘పిచ్చి పుల్లయ్య’ (1953), ‘బండరాముడు’ (1959), ‘తిక్క శంకరయ్య’ (1968).. ఇవన్నీ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన సినిమాల టైటిల్సే. వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్‌కు కథ నచ్చితే ఎలాంటి సాహసానికైనా సై అంటారని. అందుకే 31ఏళ్ల వయసులోనే ‘తోడుదొంగలు’ (1954)లో వృద్ధ పాత్రకి ఓకే అన్నారు. అలాగే నాలుగుపదుల వయసు దాట కుండానే ‘భీష్మ’ (1962) చిత్రంలో కురు వృద్ధుడైన భీష్మ పాత్ర చేశారు.

అదే విధంగా ‘కులగౌరవం’లో కుటుంబ పెద్దగా వృద్ధ పాత్రలో మరోసారి ఆడియన్స్‌తో క్లాప్స్‌ కొట్టించారు. ‘తోడు దొంగలు’ వచ్చిన ఏడాదే ‘రాజూ పేద’ చిత్రంలో ఎన్టీఆర్‌ పూర్తి డీ గ్లామరస్‌ రోల్‌ చేస్తే ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేశారు. అదే ఏడాది రిలీజైన మరో చిత్రం ‘పరివర్తన’లో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఎన్టీఆర్‌ అభినయిస్తే ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేశారే కానీ నెగటివ్‌గా తీసుకోలేదు.

ఇంకా ‘పిచ్చి పుల్లయ్య’లో మానసిక పరిస్థితి బాగాలేని పుల్లయ్యగా, ‘తిక్క శంకరయ్య’లో శంకరయ్యగా.. ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘ఆరాధన’ వంటి చిత్రాల్లో దివ్యాంగుడిగా ఎన్టీఆర్‌ ఒదిగిపోయారు. ఇవే కాదు.. ‘దాసి’లో జట్కా బండి రామయ్యగా... చెప్పుకుంటూ పోతే... ‘బడిపంతులు, ఆత్మ బంధువు, గుడిగంటలు’... ఇలా పలు చిత్రాల్లో ఎన్టీఆర్‌ కథలోని పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చారు.

చారిత్రకం
‘నందామయ.. గురుడ నందామయ..’ స్క్రీన్‌ మీద కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామిగా సాత్వికంగా కనిపించారు ఎన్టీఆర్‌. ఒక యాక్షన్‌ హీరో అంత సాఫ్ట్‌ క్యారెక్టర్‌ చేయాలనుకోవడం ఓ సాహసం. ఎన్టీఆర్‌కి సాహసాలు ఇష్టం. అందుకే బ్రహ్మంగారి కథతో ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ తీయాలనుకున్నారు. ఎన్టీఆర్‌ ఈ సినిమా తీయాలనుకోవడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే... ఓసారి ఎన్టీఆర్‌ కడప జిల్లా సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్లారు.

అక్కడ ఈ కాలజ్ఞాని చెప్పిన విషయాలు ఆయన్ను ఆకర్షించాయి. అందుకే వీరబ్రహ్మం పాత్ర చేయాలనుకున్నారు... దర్శకత్వం–నిర్మాణం కూడా ఎన్టీఆరే. షూటింగ్‌ సమయంలో కొన్ని ఆటుపోట్లు ఎదురయితే, పూర్తయ్యాక కొన్ని కారణాలతో మూడేళ్ల పాటు సెన్సార్‌ అనుమతి లభించలేదు. చివరికి ఆ సమస్య పరిష్కారమై 1984 నవంబరు 29న విడుదలై, ఘనవిజయం సాధించింది.

ఎన్టీఆర్‌ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో ఈ చిత్రానిది ప్రముఖ స్థానం కాగా, ఈ సినిమాకన్నా దాదాపు ముప్పై ఏళ్ల ముందు చేసిన చారిత్రాత్మక చిత్రం ‘తెనాలి రామ కృష్ణ’ (1956)లో శ్రీకృష్ణ దేవరాయలుగా రాజసం చూపించారు ఎన్టీఆర్‌. కొంచెం తారాగణం మార్పుతో తెలుగు, తమిళ (‘తెనాలి రామన్‌’) భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలోనూ శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను ఎన్టీఆర్‌ చేయగా, తెనాలి రామకృష్ణగా శివాజీ గణేశన్‌ నటించారు. తెలుగులో ఈ పాత్రను ఏఎన్నార్‌ చేశారు.

రాజదర్బారులో న్యాయమైన తీర్పు ఇచ్చిన దేవరాయలుకి ప్రేక్షకులు కూడా మంచి తీర్పు ఇచ్చి, ఈ చిత్రాన్ని సూపర్‌ హిట్‌ చేశారు. అన్నట్లు ‘మహా మంత్రి తిమ్మరసు’లోనూ శ్రీకృష్ణ దేవరాయలుగా మెప్పించారు. ఇంకా ‘అక్బర్‌ సలీం అనార్కలి’లో అక్బర్‌ పాత్రలో ఒదిగిపోయారు. ఎన్టీఆర్‌ ఇష్టపడి చేసిన పాత్రల్లో అశోకుడు ఒకటి. ‘సామ్రాట్‌ అశోక్‌’తో అది నెరవేర్చుకున్నారు. ఇంకా ‘చాణక్య చంద్రగుప్త’ (చంద్రగుప్తుడు పాత్ర), ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’ (శ్రీనాథుడు పాత్ర)... ఇలా ఎన్టీఆర్‌ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో చరిత్రలో నిలిచిపోయినవి చాలా ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement