NTR birth anniversary
-
ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం.. ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ, సాక్షి: తెలుగు చలన చిత్ర నట దిగ్గజం, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్మరించుకున్నారు. ‘‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన.. ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ధరించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను ప్రజలు ఇప్పటికీ తలచుకుంటారు. ఎన్టీఆర్ కలలుగన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు .…— Narendra Modi (@narendramodi) May 28, 2024 -
ఎన్టీఆర్ స్మరణలో కుటుంబ సభ్యులు.. 101 జయంతికి ఘాట్ వద్ద నివాళులు (ఫొటోలు)
-
జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి
హైదరాబాద్, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం! -
NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ
సాక్షి, విజయవాడ: నందమూరి తారక రామారావును చంపినవాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తుంటే అంతకన్నా పెద్ద జోక్ మరొకటి లేదన్నాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆదివారంనాడు విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆర్జీవీ మాట్లాడుతూ.. 'మీకు ఒక సీరియస్ జోక్ చెప్పడానికి వచ్చాను. ఎవరూ నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. అది ఎంత పెద్ద జోక్ అంటే స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావుగారు నవ్వాలో, ఏడ్వాలో తెలియని జోక్. ఇక్కడ ఇంటి అల్లుడు అయిన వ్యక్తి(చంద్రబాబు) ఎన్టీఆర్‌ను దారుణంగా టార్చర్ చేసి ఏడిపించి ఏడిపించి చంపారు. మళ్లీ ఇప్పుడు ఆయనే దండలు వేయడం జోక్. ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీపార్వతి ఆయనకు సేవలు చేశారు. అయినా సరే చాలామంది ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి మాయలో పడ్డారంటున్నారు.. అంటే ఆయనకు అవగాహన లేదా? అలాంటప్పుడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారు? రజనీకాంత్ కూడా చంద్రబాబు పక్కన కూర్చుని వాళ్లను పొగడటం అంటే ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే! నందమూరి తారకరామారావుగారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఒక్కడే తాతమీదున్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదు. అందుకు తారక్‌కు నేను థ్యాంక్స్ చెప్తున్నా' అన్నాడు రామ్‌గోపాల్ వర్మ. చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు 3 సార్లు గుండెపోటు అప్పుడు వరకట్నం కేసు పెట్టి, ఇప్పుడేమో మాజీ భర్తతో చెట్టాపట్టాల్ -
తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
హీరోలు పాత్రల్లో నటిస్తారు. కానీ కొందరు నటిస్తే ఆ పాత్రలే పరిపూర్ణమవుతాయి. ఆయా పాత్రల్లో వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలాంటి దిగ్గజ దివంగత నటుడే నందమూరి తారక రామారావు. 'మన దేశం'తో మొదలైన ఆయన ప్రయాణం 'మేజర్ చంద్రకాంత్' వరకు సాగింది. ఈ ప్రయాణంలో దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు, పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెరపై తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. నేడు(మే 28) ఆయన శతజయంతి . ఈ సందర్భంగా తాతను తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ చివర్లో తన సంతకాన్ని జత చేశాడు. మా గుండెలను మరొక్కసారి తాకిపోండి తాతా అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని తన ట్వీట్లో యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/veKcoCWamx — Jr NTR (@tarak9999) May 28, 2023 చదవండి: ఆరు పడవల ప్రయాణం.. దటీజ్ ఎన్టీఆర్ -
NTR Birth Anniversary: దటీజ్ ఎన్టీఆర్.. రెండుసార్లు ఫ్రాక్చర్ అయినా..
శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు, భీముడు.... ‘శ్రీమద్విరాట పర్వము’లో ఈ ఐదు భిన్న పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం చూసి, తెలుగు ప్రేక్షకులు ఆనందించారు.. నటన మాత్రమే కాదు... తెరపై ఆ అందగాడిని చూసి ఆనందించారు. అదే అందగాడు కురూపిగా కనిపించినా ఆనందించారు.. ఆ నటన అలాంటిది. 44ఏళ్ల సినీ కెరీర్లో ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చిన నటుడు ‘నటనానంద తారకరాముడు’ (ఎన్.టి.ఆర్). ఈ తారక దేశంలోనే వంద చిత్రాలు పూర్తి చేసిన తొలి ఘనుడు.. ఆ తర్వాత ఎనిమిదేళ్లల్లో 200 సినిమాలు పూర్తి చేసి, రాష్ట్రంలో రెండొందల సినిమా మార్క్ చేరుకున్న నటుడు. 300 మార్కు కూడా ఈ నటుడి సొంతమే. 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలు చేసి, తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. తొలి చిత్రం ‘మనదేశం’తో మొదలుకొని, చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్ ’ వరకూ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. వాటిలో 140 వందరోజుల చిత్రాలు కాగా, 33 రజతోత్సవ చిత్రాలు కావడం విశేషం. ఈ ‘నటనానంద తారక’ ‘శత జయంతి’ నేడు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాల్లో కొన్ని ఈ విధంగా... పౌరాణికం శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, దుర్యోధనుడు, భీముడు, యముడు, రావణాసరుడు... ఎలా ఉంటారు? ‘ఇలా ఉంటారు?’ అని ఎన్టీఆర్ తన పాత్రలతో చూపించారు. పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక చిత్రాల్లో ఎప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977). ఎన్టీఆర్ ఆరు పడవల ప్రయాణం ఈ సినిమా. అంటే..నటన, దర్శకత్వం, నిర్మాణం.. ఈ మూడు బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు... మూడు పాత్రలను చేయడం అంటే ఆరు పడవల ప్రయాణమే కదా. మేకప్ వేయడానికి మూడు గంటలు, తీయడానికి రెండు గంటలు పట్టేదట. మూడు పాత్రల అభినయానికి, దర్శకుడిగా తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర కోసం అక్కినేని నాగేశ్వర రావుని సంప్రదిస్తే.. ‘కృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూసిన కళ్లతో ప్రేక్షకులు నన్ను చూడలేరు’ అంటూ చేయనని చెప్పారట. దీంతో కర్ణుడి పాత్ర అయినా చేయమని కోరితే.. ‘ఆ పాత్రకి నా ఆహార్యం సరిపోదు’ అంటూ సున్నితంగా తిరస్కరించారట ఏఎన్ఆర్. శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకునేలా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ‘ఇద్దరు పెళ్లాలు’ (1954) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి కృష్ణునిగా కనిపించారు. ఆ తర్వాత ‘మాయాబజార్’ (1957), ‘వినాయకచవితి’ (1957), ‘దీపావళి’ (1960), ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1963), ‘శ్రీకృష్ణ తులాభారం’ (1966) ఇలా... పలు చిత్రాల్లో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. ఆయన్ని అపర శ్రీకృష్ణునిగా నిలిపిన చిత్రం ‘మాయాబజార్’. ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆరే శ్రీకృష్ణునిగా నటించి, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఇక ‘శ్రీకృష్ణ తులాభారం’లో మరోమారు కృష్ణుని పాత్రలో జీవించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రధారి అయిన ఎన్టీఆర్‌ని సత్యభామ పాత్రధారి జమున కాలితో తన్నే సన్నివేశం ఉంటుంది. అంత పెద్ద స్టార్ హీరో అయినా భేషజాలకు పోకుండా, అభిమానులు, ప్రేక్షకులు ఏమనుకుంటారో? అని ఆలోచించకుండా కథకి అవసరం మేరకు ఆ సన్నివేశంలో నటించి, ‘దట్ ఈజ్ ఎన్టీఆర్’ అనిపించుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఒదిగిపోయిన ఎన్టీఆర్.. శ్రీరామునిగానూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ‘చరణదాసి’ (1956) చిత్రంలో తొలిసారి శ్రీరామునిగా కనిపించారు. ఆ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’ (1958)లో తొలిసారి పూర్తి స్థాయిలో శ్రీరామునిగా నటించారాయన. ‘లవకుశ’ (1963) చిత్రంలో శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఆ తర్వాత ‘శ్రీరామ పట్టాభిషేకం’ (1978)తో పాటు మరికొన్ని చిత్రాల్లో శ్రీరామునిగా ప్రేక్షకులను అలరించారు. సౌమ్యుడైన శ్రీరాముడు పాత్రకు పూర్తి వ్యతిరేకమైన రావణాసురుడి పాత్రలోనూ ఎన్టీఆర్ ఒదిగిపోయిన వైనం అద్భుతం. ‘భూకైలాస్’ (1958) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి రావణబ్రహ్మ పాత్రలో నటించి, మెప్పించారు. ఆ తర్వాత ‘సీతారామ కళ్యాణం’ (1961), ‘శ్రీరామపట్టాభిషేకం’ (1978) వంటి పలు సినిమాల్లో రావణబ్రహ్మగా శభాష్ అనిపించుకున్నారు. అదే విధంగా ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ (1960)లో తొలిసారి వెంకటేశ్వర స్వామి పాత్ర చేశారు ఎన్టీఆర్. అలాగే ‘పాండవ వనవాసము’ (1965)లో భీమునిగా, ‘ఉమ్మడి కుటుంబం’ (1967)లో తొలిసారి ‘యముడి’ పాత్రలో ఆకట్టుకున్నారాయన. ఇక ‘నర్తనశాల’ (1963)లో బృహన్నల పాత్రలో తన నటనా ప్రతిభను మరోసారి చూపించారు ఎన్టీఆర్. ఇలా పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. జానపదం ఎన్టీఆర్ నటించిన తొలి జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (1950). ఈ చిత్రంలో క్రూరమైన ఎద్దుతో ఎన్టీఆర్ పోరాడే యాక్షన్ సీన్ ఉంది. చిత్రదర్శకుడు బీఏ సుబ్బారావు ఎద్దు కొమ్ములను పట్టుకుంటే చాలని ఎన్టీఆర్‌తో అన్నారు. కానీ, ఎన్టీఆర్ ఆ ఎద్దుతో నిజంగానే పోరాడారు. ఆ యాక్షన్ సీన్ అప్పుడు రెండుసార్లు ఫ్రాక్చరయింది. డాక్లర్టు విశ్రాంతి సూచించినా ‘నో’ అన్నారు ఎన్టీఆర్. కట్టు కనిపించకుండా పొడవు చేతుల చొక్కా ధరించి, నటించారు. ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైన మరుసటి సంవత్సరం ‘పాతాల భైరవి’ (1951)లో చేసిన తోటరాముడి పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. ఈ పాత్రకు ఎన్టీఆర్‌ని తీసుకోవాలని నిర్మాతలు నాగిరెడ్డి–చక్రపాణి అనుకుంటే... పెద్దగా ఇమేజ్ లేని నటుణ్ణి అంత పెద్ద పాత్రకా? అనుకున్నారు దర్శకుడు కేవీ రెడ్డి. సరిగ్గా అదే టైమ్‌కి టెన్నిస్ ఆడుతున్న ఎన్టీఆర్ రెండు పాయింట్లు కోల్పోవడంతో బంతిని విసిరి కొట్టారు. అంతే.. జానపద నాయకుడి లక్షణం ఉందని తోటరాముడిగా ఎన్టీఆర్‌ని ఫిక్స్ చేశారు కేవీ రెడ్డి. ఈ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయి నటించారు. ఇంకా ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, ‘అలీబాబా నలభై దొంగలు’, ‘చిక్కడు దొరకడు’, ‘మంగమ్మ శపథం’, ‘గండికోట రహస్యం’... ఇలా దాదాపు యాభై జానపద చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. సాంఘికం హీరోగా పట్టుమని పది సినిమాలు పూర్తి చేయకుండానే సందేశాత్మక సినిమాలు చేయాలనుకున్నారు ఎన్టీఆర్. వరకట్నం తీసుకోవడం సరైంది కాదని, యువతలో చైతన్యం నింపేలా, అభ్యుదయ భావాలు రేకెత్తించేలా ‘పెళ్లి చేసి చూడు’ (1952)ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ తర్వాత 1970లో స్వీయ దర్శకత్వంలో వరకట్నం ప్రధానాంశంగానే ‘వరకట్నం’ సినిమా తెరకెక్కించి, నటించారాయన. ఇక అప్పటి సాంఘిక దురాచారాల్లో ప్రముఖంగా వినిపించే మరో అంశం ‘కన్యాశుల్కం’. ఈ విషయంలో ప్రజల ఆలోచనా సరళిలో మార్పు రావాలనే ఉద్దేశ్యంతో ‘కన్యాశుల్కం’లో గిరీశంగా కనిపించి, మెప్పించారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్ చేసిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రాలే కాదు.. ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను తెలియజేసేలా, ‘ఉమ్మడి కుటుంబం’, కుటుంబ సంబంధాలకు అద్దంపట్టేలా ‘తల్లా? పెళ్లామా?’ చిత్రం, ఈ కోవలోనే ‘కోడలు దిద్దిన కాపురం’, ‘తాతమ్మ కల’, ‘ఇంటిగుట్టు’ సినిమాలు చేశారు ఎన్టీఆర్. ముఖ్యంగా 1969–1970 దశకంలో ఎన్టీఆర్ నుంచి ఎక్కువగా సాంఘిక చిత్రాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘వరకట్నం, తల్లా? పెళ్లామా?, కొడుకులు దిద్దిన కాపురం’ సినిమాల్లో నటించి, స్వీయ దర్శకత్వం వహించారు ఎన్టీఆర్. ఈ చిత్రాలే కాదు.. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయాలని గ్రామీణ యువకులను ప్రోత్సహించే విధంగా ‘పల్లెటూరు’, ‘రైతుబిడ్డ’ వంటి వ్యవసాయ ఆధారిత సినిమాల్లో నటించారు. అలాగే వ్యవసాయ రంగంలో పెత్తందార్లను ప్రశ్నించేలా ‘పెత్తందార్లు’లో నటించారు. ఇంకా సమాజంలోని అసమానతను తెలిపేలా ‘రాజూ పేద’, మహిళలకు సమాజంలో దక్కాల్సిన గౌరవాన్ని గుర్తు చేసేలా ‘నాదీ ఆడ జన్మే’, ‘స్త్రీ జన్మ’ వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు ఎన్టీఆర్. అలాగే దేశభక్తిని చాటేలా ‘బొబ్బిలిపులి’, ‘నా దేశం’, ‘జస్టిస్ చౌదరి, ‘మేజర్ చంద్రకాంత్’, కులమతాలకు అతీతంగా ‘ఒకే కుటుంబం’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ప్రయోగాత్మకం ‘పిచ్చి పుల్లయ్య’ (1953), ‘బండరాముడు’ (1959), ‘తిక్క శంకరయ్య’ (1968).. ఇవన్నీ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల టైటిల్సే. వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్‌కు కథ నచ్చితే ఎలాంటి సాహసానికైనా సై అంటారని. అందుకే 31ఏళ్ల వయసులోనే ‘తోడుదొంగలు’ (1954)లో వృద్ధ పాత్రకి ఓకే అన్నారు. అలాగే నాలుగుపదుల వయసు దాట కుండానే ‘భీష్మ’ (1962) చిత్రంలో కురు వృద్ధుడైన భీష్మ పాత్ర చేశారు. అదే విధంగా ‘కులగౌరవం’లో కుటుంబ పెద్దగా వృద్ధ పాత్రలో మరోసారి ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టించారు. ‘తోడు దొంగలు’ వచ్చిన ఏడాదే ‘రాజూ పేద’ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి డీ గ్లామరస్ రోల్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అదే ఏడాది రిలీజైన మరో చిత్రం ‘పరివర్తన’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ అభినయిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారే కానీ నెగటివ్‌గా తీసుకోలేదు. ఇంకా ‘పిచ్చి పుల్లయ్య’లో మానసిక పరిస్థితి బాగాలేని పుల్లయ్యగా, ‘తిక్క శంకరయ్య’లో శంకరయ్యగా.. ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘ఆరాధన’ వంటి చిత్రాల్లో దివ్యాంగుడిగా ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ఇవే కాదు.. ‘దాసి’లో జట్కా బండి రామయ్యగా... చెప్పుకుంటూ పోతే... ‘బడిపంతులు, ఆత్మ బంధువు, గుడిగంటలు’... ఇలా పలు చిత్రాల్లో ఎన్టీఆర్ కథలోని పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చారు. చారిత్రకం ‘నందామయ.. గురుడ నందామయ..’ స్క్రీన్ మీద కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామిగా సాత్వికంగా కనిపించారు ఎన్టీఆర్. ఒక యాక్షన్ హీరో అంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలనుకోవడం ఓ సాహసం. ఎన్టీఆర్‌కి సాహసాలు ఇష్టం. అందుకే బ్రహ్మంగారి కథతో ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ తీయాలనుకున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమా తీయాలనుకోవడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే... ఓసారి ఎన్టీఆర్ కడప జిల్లా సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఈ కాలజ్ఞాని చెప్పిన విషయాలు ఆయన్ను ఆకర్షించాయి. అందుకే వీరబ్రహ్మం పాత్ర చేయాలనుకున్నారు... దర్శకత్వం–నిర్మాణం కూడా ఎన్టీఆరే. షూటింగ్ సమయంలో కొన్ని ఆటుపోట్లు ఎదురయితే, పూర్తయ్యాక కొన్ని కారణాలతో మూడేళ్ల పాటు సెన్సార్ అనుమతి లభించలేదు. చివరికి ఆ సమస్య పరిష్కారమై 1984 నవంబరు 29న విడుదలై, ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో ఈ చిత్రానిది ప్రముఖ స్థానం కాగా, ఈ సినిమాకన్నా దాదాపు ముప్పై ఏళ్ల ముందు చేసిన చారిత్రాత్మక చిత్రం ‘తెనాలి రామ కృష్ణ’ (1956)లో శ్రీకృష్ణ దేవరాయలుగా రాజసం చూపించారు ఎన్టీఆర్. కొంచెం తారాగణం మార్పుతో తెలుగు, తమిళ (‘తెనాలి రామన్’) భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలోనూ శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను ఎన్టీఆర్ చేయగా, తెనాలి రామకృష్ణగా శివాజీ గణేశన్ నటించారు. తెలుగులో ఈ పాత్రను ఏఎన్నార్ చేశారు. రాజదర్బారులో న్యాయమైన తీర్పు ఇచ్చిన దేవరాయలుకి ప్రేక్షకులు కూడా మంచి తీర్పు ఇచ్చి, ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు. అన్నట్లు ‘మహా మంత్రి తిమ్మరసు’లోనూ శ్రీకృష్ణ దేవరాయలుగా మెప్పించారు. ఇంకా ‘అక్బర్ సలీం అనార్కలి’లో అక్బర్ పాత్రలో ఒదిగిపోయారు. ఎన్టీఆర్ ఇష్టపడి చేసిన పాత్రల్లో అశోకుడు ఒకటి. ‘సామ్రాట్ అశోక్’తో అది నెరవేర్చుకున్నారు. ఇంకా ‘చాణక్య చంద్రగుప్త’ (చంద్రగుప్తుడు పాత్ర), ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’ (శ్రీనాథుడు పాత్ర)... ఇలా ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో చరిత్రలో నిలిచిపోయినవి చాలా ఉన్నాయి. -
ఎల్. విజయలక్ష్మికి ఎన్టీఆర్ అవార్డు
అలనాటి అందాల తార, ప్రముఖ నర్తకి ఎల్. విజయలక్ష్మిని ఎన్టీఆర్ అవార్డు వరించింది. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శితమవుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతి నెలా ఎన్టీఆర్ కుటుంబం నుండి ఒకరు పాల్గొంటారు. ఎన్టీఆర్‌తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్‌కు ప్రతి నెలా అవార్డు, గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారు. అక్టోబర్ నెలకిగాను ఎన్టీఆర్ పురస్కారానికి ఎల్. విజయలక్ష్మి ఎంపికయ్యారు. బాలనటిగా ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ‘జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తనశాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు–భీముడు, భక్త ప్రహ్లాద’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో సుమారు 15 సినిమాలకు పైగా నటించారు విజయలక్ష్మి. 50 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా అమెరికాలో స్థిరపడ్డారామె. ఈ నెల 30న తెనాలిలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి ఆమె ఇక్కడికి రానున్నారు. కాగా ‘ఎన్టీఆర్ శతజయంతి’ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ, అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బుర్రా సాయిమాధవ్ వ్యవహరిస్తున్నారు. -
‘తెలుగువారందరిదీ ఒకటే కులం’
-
‘తెలుగువారందరిదీ ఒకటే కులం’
హైదరాబాద్: ఎన్టీఆర్ జయంతి తెలుగు ప్రజలకు పర్వదినమని ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన వారసులు ఆదివారం నివాళులు అర్పించారు. పెద్దాయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. తెలుగువారంతా ఒకటే కులమని.. మానవ కులమని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు తన తాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ఎన్ని తరాలు గడిచినా ఎన్టీఆర్ ఖ్యాతిని తెలుగు జాతి మర్చిపోదని హీరో కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. -
తెలుగుతేజానికి చంద్రగ్రహణం
సందర్భం నేడు ఎన్టీఆర్ జయంతి ‘అందరూ పుడతారు ఎందుకో తెలియదు. కొందరే పుడతారు అందరికీ తెలిసేలా’ అని ఒక మహాకవి చెప్పిన మాట ప్రకారం కోటికి కూడా దొరకని అపూర్వమైన జననం ఒక సాధారణ గ్రామంలో జరిగిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. 1923 మే నెల 28వ తేదీ కృష్ణా జిల్లా, నిమ్మకూరు గ్రామంలో వెంకట్రావమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకు ప్రథమ సంతానంగా పుట్టి, ఇంతై వటుడింతై అన్నట్లు పుట్టిన నేలకే కాక దేశం గర్వించతగిన నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వ శిఖరం నందమూరి తారక రామారావు. చిన్నప్పటినుంచి స్వయంకృషితో తనకు తానుగా ఎదిగి, ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్న కుటుంబాన్ని రక్షించుకోవటానికి బి.ఎ. డిగ్రీ తీసుకుని సబ్ రిజి స్ట్రార్ ఉద్యోగంలో చేరారు. కొద్దికాలంలోనే అక్కడి అవినీతిని భరించలేక మిత్రుల ప్రోద్బలంతో 1947లో చెన్నై రైలు ఎక్కిన ఆయన జీవితం రైలు గమనంలా ముందుకే సాగిపోయింది. 1947 మే 21 ఎల్.వి. ప్రసాద్ ఆధ్వర్యంలో శోభనాచల స్టూడియో వేదికగా మొదటి స్క్రీన్‌టెస్ట్ జరిగింది. ‘మన దేశం’ చిత్రంలో చిన్న ఎస్సై పాత్ర ద్వారా పరిచయమై, డి. సుబ్బారావు ‘పల్లెటూరి పిల్ల’లో ఏయన్నార్‌తో పాటు మరో కథానాయకుడిగా ఎదిగి, తరువాత మూడేళ్లు ఏ సినిమాలు లేక కొన్నిరోజులు పస్తులుండి కూడా పట్టు దలతో అవకాశాలు సాధించుకున్నారు. జీవితంలో ముందుకు వెళ్లటమేతప్ప పిరికిగా పారిపోకూడదనే ఆయన సిద్ధాంతానికి చిత్రసీమ తలవంచి అక్కున చేర్చుకుంది. నాగిరెడ్డి- చక్రపాణి గారి రూపంలో అదృష్టం వరించింది. విజయా సంస్థతో చేసుకున్న నాలుగు చిత్రాల ఒప్పందం తర్వాత ఆయనంతట ఆయన విడిచిపెట్టే వరకు సినిమా రంగం ఎన్టీఆర్‌ను విడిచిపెట్టలేదు. కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, ఎల్వీ ప్రసాద్, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’, ‘పెళ్లిచేసి చూడు’, ‘చంద్రహారం’ చిత్రాలు వీరిని సినీ వినీలా కాశంలో ఒక ధ్రువతారగా నిలబెట్టాయి. 1951 నుంచి వీరి వలన సినీ రంగ పరిస్థితే మారిపోయింది. ఎన్టీఆర్ నటించిన ప్రతి ఐదు చిత్రాలకు మూడు చిత్రాలు బాక్సాఫీసు రికార్డు సాధించాయి. పురాణ పాత్రలయితే చెప్పనక్కర లేదు. తెలుగునాట పురాణ దేవతలను కొత్తతేజంతో ప్రతిష్టించిన ఘనత వీరిదే. 1982 వరకు దాదాపు 300 సినిమాల్లో నటించి అనేక విజయాలు సాధించారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు శత దినోత్సవాలు, రజతో త్సవాలు ఘనంగా జరుపుకున్నాయి. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ - పురాణ పురుష - కళాప్రపూర్ణ - డాక్టర్ - నటరత్న - కలియుగ రామకృష్ణ వంటి ఎన్నో బిరుదులు పోటీపడి ఆయనను ఆశ్రయించాయి. నటించిన పాత్రల స్ఫూర్తితో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. నాటివరకు ఆంధ్రప్రదేశ్‌ను అప్రతిహతంగా పాలిస్తున్న కాంగ్రెసు పార్టీ కంచు ఢక్కాను కేవలం 9 నెలల కాలంలో ముక్కలుకొట్టి ప్రభుత్వాన్ని స్థాపించేసరికి దేశమంతా నివ్వెరపోయి చూచింది. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్.. ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగారు. ఆ విజయం దేశ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేసి ‘నేషనల్ ఫ్రంట్’ స్థాపనకు కారణమయ్యింది. ఎన్టీఆర్ చైర్మన్‌గా నేషనల్ ఫ్రంట్ రాజీవ్‌గాంధీని ఓడించి కేంద్రంలో అధికారంలోకి రావటంతో ఆయన పేరు మార్మోగింది. సినీ రంగంలోలాగే, రాజకీయంలో కూడా తన సొంత విధానంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయాలకే ఒక నూతన పంథా సృష్టించారు. తాను పోషించిన పాత్రలే ప్రేరణగా, తన గుండెలో నిండిన ఆశయాలే స్ఫూర్తిగా పాలన సాగించారు తప్ప ఏ నాయకుడిని ఆదర్శంగా తీసుకోలేదు. సినీ రంగంలో చేసిన ప్రయోగాలకు మల్ల్లే రాజకీయాల్లో కూడా ఆయన పథకాలన్నీ ఫలవంతమయ్యాయి. అక్కడ నటన కావచ్చు. ఇక్కడ రాజకీయం కావచ్చు. కానీ ఎన్నుకునే విధానం వెనుక సంస్కార పూరితమైన, నిస్వార్థమైన ఆలోచనా సరళి ఆయ నను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఆయన ప్రజల్నే నమ్ముకున్నారు తప్ప విలువల్ని అమ్ముకోలేదు. చివరి క్షణం వరకు పేద మధ్య తరగతి వర్గాల శ్రేయస్సు కోసమే తపించారు. పోరాటాలన్నీ ఆకలినుంచే పుట్టాయన్న ‘మార్క్స్’ సిద్ధాంతాన్ని అనుభవంతో ఆకళింపు చేసుకుని 1 కోటి 25 లక్షల కుటుంబాలకు కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రారంభించారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది మొదటి పేదల పథకంగా ప్రసిద్ధికెక్కింది. కూడు- గూడు-గుడ్డ అనే సామాన్యుడి ఎజెండాతో పుట్టిన తెలుగుదేశం అచిర కాలం లోనే సమాజంలోని అన్నివర్గాలకు దగ్గర కాగలిగింది. రాజకీయాల్లోని కుళ్లు కడిగేయటానికి ఆయన విద్యావంతులైన కొత్తవారికి ఎందరికో అవకాశం కల్పించారు. పార్లమెంటు చరిత్రలో 103 మంది సభ్యులచేత రాజీనామా చేయించిన పవర్ ఆయనది. మొదటిసారి 1984 ఆగస్టులో వెన్నుపోటుకు గురైనప్పుడు గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అలుపెరగ కుండా రాష్ట్రమంతా పర్యటించి తిరిగి అధికారాన్ని పునస్థాపించుకున్న మహా యోధ. మండల వ్యవస్థ - పటేల్-పట్వారీ రద్దు లాంటి సాహస నిర్ణయాలు చేసి కింది వర్గాల గుండెల్లో శాశ్వత స్థానం పొందారు. తన ఏడున్నర సంవత్సరాల పరిపాలనా కాలంలో కుల మతాతీత వ్యవస్థకు పెద్ద పీట వెయ్యటమేకాదు. కిందివర్గాల వారికి రాజకీయంగా కూడా ఉన్నత స్థానం కల్పించి తెలుగుదేశం పార్టీకి శాశ్వత చిరునామా ఏర్పరచిన ఆ మహానుభావుని జీవిత చరమాంకం అత్యంత దయనీయంగా ముగియటం దురదృష్టం. అల్లుడి అధికార కాంక్ష అనే విష నాగు కాటుకు అంతటి మహావృక్షం ఒరిగిపోయిన తీరు రాజకీయ చరిత్రనే ప్రశ్నిస్తుంది. దాదాపు 70 ఏళ్ల వయస్సులో తన అనారోగ్య స్థితిలో తోడు కోసం ద్వితీయ వివాహం చేసుకుని పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ భార్యతో కలసి 1994 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి పట్టుదలగా పార్టీని గెలిపించుకుని కూడా పొంచివున్న తోడేళ్ల చేతిలో హతమైపోయారు. 55 శాతం ఓట్లు, మిత్ర పక్షాలతో కలిపి 257 సీట్లు గెలిచి రాజకీయంలో అరుదైన రికార్డు సాధించి కూడా అధికార వ్యామోహి అయిన అల్లుడు చంద్రబాబు వెన్నుపోటుకు బలవటం దురదృష్టం కాక మరేమిటి? ప్రజలకిచ్చిన హామీల మేరకు రూ. 3,121 కోట్ల భారం ప్రభుత్వంపైన పడ్డా వెనుదీయక తిరిగి 2 రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని, సంపూర్ణ మద్యనిషేధాన్ని, రైతులకు హార్స్‌పవర్‌కి రూ.50లతో విద్యుత్ పథకాన్ని చిత్తశుద్ధితో అమలుచేసి కూడా, ముష్కరుల కుటిల రాజకీయాలకు అకాల మరణం చెందటమేమిటి? ఇది నీచ రాజకీ యానికి పరాకాష్ట కాదా? ప్రజాస్వామ్యాన్ని గేలిచేస్తూ అధికారానికి అర్రులు చాచే గబ్బిలాలు, విషం చిమ్మిన సమాచార సర్పాలు, డబ్బుకు అమ్ముడు బోయిన నిర్లజ్జ శాసనసభ్యులు, తలరాతలను మార్చిన నల్లకోటుల శాస నాలు.. ఒకటేమిటి, ఆ యోధుడ్ని కూల్చటానికి గవర్నరు వ్యవస్థ కూడా గులాంగా మారిందంటే రాజకీయాన్ని అది ఎంత పతనావస్థకు దిగజార్చిందో ఆ కాలాన్ని చరిత్ర ఎలా మర్చిపోతుంది? 1995 ఆగస్ట్ 27న ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తొలగించి, చంద్రబాబు తననుతాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఇదేం న్యాయ మని అడగటానికి వెళ్లిన ఎన్టీఆర్ మీద చెప్పులేసి అవమానించారు. ప్రత్యేక విమానంలో స్పీకరు యనమలను రప్పించి ఫోర్జరీ సంతకాలతో బలపరీక్ష చేయించి గవర్నరుకు పంపారు. ఆ రోజే ఎన్టీఆర్ కంటతడి పెట్టి ‘నేను ఈ రోజే మరణించాను’ అని ఆవేదనతో చెప్పిన మాటలు స్మరించుకోవాలి. పదవి పోగొట్టుకుని అనారోగ్యంతోపాటు, అవమానంతో రగిలిపోతూ ఎన్టీఆర్.. చంద్రబాబుమీద యుద్ధం ప్రకటించారు. అతని దుర్మార్గాలను, అవినీతిని ‘జామాతా దశమగ్రహం - జెమినీ టీవీలో ధర్మపీఠం’ కార్యక్రమం ద్వారా ఎలుగెత్తి చాటారు. చివరకు ప్రజల్లోకెళ్లి ఇతని ఆకృత్యాలను చెప్ప టానికి విజయవాడలో దేవినేని నెహ్రూ ద్వారా బహిరంగ సభకు సిద్ధమ య్యారు. అది తెలిసి చంద్రబాబు జనవరి 17, 1996న ఎన్టీఆర్ ఖాతా ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ మీద స్టే ఆర్డరు తెచ్చి ఖాతాను స్తంభింప చేయటంతో ఆ తెల్లవారు జామున గుండెపోటుకు గురై ఎన్టీఆర్ మరణిస్తే, బాబు పత్రికలు అదంతా ఆయన భార్యవల్లనే అని చాటింపు చేశాయి. ఎన్టీఆర్‌ను మోసంచేసి, ఆయన ఆశయాలను నిలువునా పాతిపెట్టి, అవి నీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలుచేస్తూ నీచ రాజ కీయ వ్యవస్థకు తెర తీసిన ఈ పెద్ద మనిషిని భావి చరిత్ర క్షమించదు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద వర్గాలది. ఇతడు నడిపే తెలుగుదేశం పెద్దవాళ్లది. నిష్కళంక చరిత్ర ఆయనది. అవకాశవాద పొత్తులతో ప్రజల్ని ఏమార్చి అధికారాన్ని పొందే నయవంచన చంద్రబాబుది. నమ్మి అల్లుడిగా చేసుకున్నం దుకు పార్టీని, అధికారాన్ని చివరకు ప్రాణాల్నే హరించిన నీచ రాజకీయ వేత్తకు శిక్ష పడేవరకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూనే ఉంటుందన్న సత్యం మర్చిపో కూడదు. నీతిబాహ్య విధానాలతో ఎమ్మెల్యేల్ని కొనుక్కునే దుష్ట సాంప్రదా యానికి తెరతీసి తెలుగుదేశం మూల విధానాల్నే దెబ్బతీసిన ఇతడు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించటానికి కూడా అనర్హుడే. ఇతడి రాజకీయ చరిత్రంతా అబద్ధా లతో, అవినీతితో మకిలీ పట్టి దుర్గంధాన్ని వెదజల్లుతూ నిజమైన రాజకీయ విలువలు దగ్గరకు పోలేనంత అసహ్యాన్ని కలిగిస్తున్నది. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి, స్వార్థ రాజకీయాలకు అడ్డాగా మారిన ఇతడి జీవితం ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు. ఆ రోజే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి. నందమూరి లక్ష్మీ పార్వతి వ్యాసకర్త సాహితీవేత్త, ఎన్టీఆర్ సతీమణి -
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి
* మహానాడులో మరోసారి తీర్మానం * టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు * ఎన్టీఆర్ పేరుతో చీర, ధోవతి స్కీమ్ * తెలుగు ప్రజల అభివృద్ధే మా ఆశయం * ఇరు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి * పార్టీ కోసం మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరు తూ మహానాడులో మరోసారి తీర్మానం చేశా రు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని గురువారం రెండోరోజు మహానాడు వేదికపై ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వేది కపై కేక్ కట్‌చేసి, ఆయన సేవలను కొనియాడా రు. చేనేత కార్మికులకు ఉపయుక్తంగా ఉండేలా ఏపీలో ఎన్టీఆర్ పేరుతో చీర, ధోవతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఏడాది దసరా పండుగ నుంచి రూ.400 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజమండ్రిలో గోదావరి గట్టున ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ గొప్ప మానవతావాది అని కొనియాడారు. రాయలసీమలో కరువు సంభవించినపుడు జోలెపట్టి విరాళాలు సేకరించి ఆదుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చారని, దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసిన ఘనత ఆయనదేనన్నారు. ఎక్కడున్నా తెలుగు ప్రజల అభివృద్ధే తమ ఆశయమని చెప్పారు. తెలంగాణకు తాము విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆ ప్రభుత్వం మాత్రం వ ద్దం టోందన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏ సమస్యనైనా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం పార్టీ కోసం కష్టపడుతూ మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. గత ఏడాది మహానాడుకు హాజరై తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అందచేశారు. ఈ మహానాడుకు హాజరై బుధవారం గుండెపోటు తో మరణించిన రాయుని చెన్నయ్య కుటుం బానికి పార్టీ పరంగా రూ. పది లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలను ఆదుకోవటం, తెలంగాణలో ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలో ప్రతినిధులు సూచించాలని కోరారు. వాటి ఆధారంగా తా ను శుక్రవారం నవసూత్రాలను ప్రకటిస్తానని చెప్పారు. పేదల గుండెల్లో ఎన్టీఆర్‌ది సుస్థిరస్థానమని ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయటం తమ అదృష్టమని కేం ద్రమంత్రి పి. అశోక్ గజపతిరాజు తెలిపారు. ద్రోహులను చేర్చుకున్న కేసీఆర్: ఎర్రబెల్లి ఏడాది గడిచినా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వేదిక నుంచి పార్టీ తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణ ద్రో హులకు మంత్రివర్గంలో ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్, ఉద్య మంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎప్పుడూ పోరాటం చేయలేదని, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్ ‘జై తెలంగాణ’ అని ఎప్పు డూ అనలేదని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ రాయకుండా చం ద్రబాబును అడ్డుకుంది శ్రీనివాసయాదవ్ అని వెల్లడించారు. తనను గవర్నర్ చేస్తానని చంద్రబాబు అంటున్నారని, తాను ఆ పదవిని అధిష్టించినా లేకపోయినా కేసీఆర్‌ను ఓడించటమే లక్ష్యంగా పని చేస్తానని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. మీరు గవర్నర్ అయితే ఇక్కడ అరిచే వారుండరని చంద్రబాబు వ్యాఖ్యానిం చగా... మీరు ఎలా వాడుకున్నా, ఏది చెప్పినా తూచా తప్పకుండా చేస్తానని నర్సింహులు చెప్పారు. చంద్రబాబును కీర్తిస్తూ హేమమాలిని అనే బాలిక వినిపించిన కవిత ప్రతినిధులను ఆకట్టుకుంది. రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రభుత్వం దీక్షతో యజ్ఞంలా పనిచేస్తుంటే కొందరు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. అలాంటివారు రాక్షసుల్లానే మిగిలిపోతారని చె ప్పారు. అమరావతి నిర్మాణాన్ని ఎవరైనా విమర్శిస్తే ఎన్టీఆర్ స్ఫూర్తితో బుల్లెట్లా వారిపై దూసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహానాడు రెండో రోజు గురువారం చేసిన ఏడు తీర్మానాల్లో నూతన రాజధాని నిర్మాణంపై తీర్మానం కూడా ఉంది. చంద్రబాబు మాట్లాడుతూ ఎంతమంది అడ్డం పడినా రాజధాని నిర్మాణం, అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు. సోనియా గాంధీ వ్యతిరేకించినా రైతులు భూములిచ్చారని, వారికి అన్యాయం జరగనివ్వబోమని తెలిపారు. రాజధాని నిర్మాణానికి జూన్ ఆరో తేదీన భూమి పూజ చేస్తామని, దసరా నాడు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. చారిత్రక నేపధ్యం ఉన్నందునే రాజధానికి అమరావతి అని పేరు పెట్టామని, అమరావతి అంటే మృత్యువులేని నగరం అని అర్థమని వివరించారు. బాబు మనవడి పేరు దేవాంశ్ తన మనవడికి దేవాంశ్ అని పేరు పెట్టినట్లు మహానాడు వేదిక నుంచి చంద్రబాబు ప్రకటిం చారు. తన కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి దంపతులకు కొడుకు పుట్టాడని, ఆ బాలుడికి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టిన రోజునాడే దేవాంశ్ అని పేరు పెడుతున్నట్లు చెప్పారు. లోకేశ్, బ్రహ్మణి కూడా తమ కుమారుడిని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను ట్విటర్లో పోస్టు చేశారు. జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు చంద్రబాబు ఇకనుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో పార్టీలో కొత్తగా జాతీయ అధ్యక్ష పదవి ఏర్పాటు చేయగా, అందుకోసం మహానాడులో ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. చంద్రబాబు తరఫున ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన ఎన్నికను శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు విడిగా అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే వారితోపాటు మిగిలి పదవులన్నింటికీ ఎంపిక చేసే అధికారాన్ని బాబుకు కట్టబెడుతూ శుక్రవారం మహానాడులో తీర్మానం చేయనున్నారు. పార్టీలో ఇప్పటివరకు తొమ్మిదిసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు శుక్రవారం నుంచి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారు.