బక్రీ ఈద్‌గా పిలిచే ఈద్ ఉల్ అధా ఈ ఏడాది ఇవాళే(జూన్ 17) బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇది త్యాగానికి గుర్తుగా జరుపుకునే విందు. అబ్రహం ప్రవక్త కొడుకు ఇస్మాయిల్‌ని బలి ఇవ్వమని కోరడం..దేవుడు జోక్యం చేసుకుని బలిగా పొట్టేలుని ఇవ్వడం గురించి ఖురాన్‌లో ఒక కథనం ఉంటుంది. అందుకు గుర్తుగా ఈ రోజున పొట్టేలు(మేక) బలి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ..ఒక వ్యక్తి స్థానంలో మరోక జీవిని బలి ఇవ్వడం అనేది.. త్యాగం లేదా ఖుర్బానీ చరిత్రను గౌరవించేందుకు గుర్తుగా ఈ రోజుని ముస్లింలంతా జరుపుకుంటారు. ఈ రోజు మాంసంతో కలిపి వండే బిర్యానీని తయారు చేసి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పంచుకుని తింటారు. ఈ పండుగ పురుస్కరించుకుని అసలు ఈ బిర్యానీ ఎక్కడ పుట్టింది..? ఎలా మన భారతదేశానికి పరిచయం అయ్యింది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!
భారతదేశంలో అత్యంత మంది ఎక్కువగా ఆర్డర్ చేసే వంటకంగా ప్రసిద్ధ స్థానంలో ఉంది బిర్యానీ. కుల మత భేదాలు లేకుండా ప్రజలంతా ఇష్టంగా తినే వంటకం కూడా బిర్యానీనే. ఇంతలా ప్రజాధరణ కలిగిన ఈ వంటకం చరిత్ర గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!. బిర్యానీ అన్న పదం 'బిరింజ్ బిరియాన్' (ఫ్రైడ్ రైస్) అనే పర్షియన్ పదం నుంచి పుట్టింది. అందుకే బిర్యానీ ఇరాన్‌లో పుట్టలేదన్న వాదనా వినిపిస్తుంటుంది. కానీ ఇరాన్‌లో ధమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర.
ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపైన చాలా సేపు దాన్ని ఉడికించి, ఆ మాంసంలోని సహజసిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి, ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీ తయారుచేస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బిర్యానీ మొఘల్ చక్రవర్తుల ద్వారానే భారత్‌లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి సరైన ఆధారాలు లేవు. అంతేగాదు దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులూ, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందన్నది ఎక్కుమంది చెబుతున్న వాదన. ఏదీఏమైనా..నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ, నెమ్మదిగా తన రూపం మార్చుకుంది.
భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా విభిన్న సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కమ్మని రుచితో చేరువైంది. ఇక చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం..ఈ బిర్యానీ వంటకం మొఘల్ శకం, చక్రవర్తి షాజహాన్ భార్య బేగం ముంతాజ్ మహల్ కాలం నాటిదని ప్రసిద్ధ కథనం. ఆమె ఒకసారి పోషకాహార లోపంతో కనిపించిన సైనిక అధికారులను చూసి, వారి కోసం పోషకమైన, చక్కటి సమతుల్య భోజనాన్ని తయారు చేయమని తన రాజ ఖన్సామాలను (వంటచేసేవాళ్లుకు) ఆదేశించింది. దాని ఫలితంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ బిర్యానీ వంటకం రూపొందిందని చెబుతుంటారు.
మరో కథనం ప్రకారం..1398లో టర్క్-మంగోల్ విజేత తైమూర్ భారత సరిహద్దులను చేరుకున్నప్పుడు అతని సైన్యం కోసం ఈ బిర్యానీని వినియోగించారిని చెబుతారు. సైనికులు కోసం బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంతో నిండిన కుండను వేడి గొయ్యిలో పాతి పెట్టేవారట. కొంత సమయం తర్వాత తీసి చూడగా బిర్యానీ తయారయ్యి ఉండేదట. ఇది యోధులకు మంచి పోషకాహార భోజనంగా ఉండేదట. ఎక్కువ సేపు ఆకలిని తట్టుకుని ఉండేవారట. ఇక పర్షియన్ పదంలో బిరియన్ అనే పదానికి అర్థం కాల్చడం. బిరింజ్ అంటే అన్నం. పూర్వకాలంలో చాలమంది గొప్ప పండితులు పర్షియా దేశం నుంచి భారతదేశానికి రావడం వల్లే ఈ ప్రత్యేకమైన వంటకం మనకు పరిచయమయ్యిందని చెబుతారు.
అయితే మన దేశంలో మాత్రం ఈ బిర్యానీ మాంసం, బియ్యం సుగంధ ద్రవ్యాలతో కూడిన బిర్యానీని మాన్సోదన్ అని పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశం అంతటా అనేక రూపాల్లో బిర్యానీ లభిస్తుంది. మన హైదరాబాద్ బిర్యానీ ఉత్తర, దక్షిణ అంశాలను టర్కిష్ ప్రభావాన్ని మిళితం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, లక్నోలలో బాస్మతీ వంటి పొడవైన బియ్యంతో తయారు చేయగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీరగ సాంబ లేదా కైమా బియ్యం వంటి పొట్టి ధాన్యాలతో తయారు చేస్తారు. ప్రతి బిర్యానీ సుగంధ్ర ద్రవ్యాలు, మాంసంతో ఆయా ప్రాంతాలకు అనుగుణమైన శైలిలో రూపొందుతుంది. ఈ బిర్యానీ వంటకం ఎలా ఏర్పడిందన్నది తెలియకపోయిన మన రోజూవారీ ఆహారంలో అందర్భాగం అయ్యింది. ముఖ్యంగా ఇలాంటి ఈద్ సమయంలో ప్రతి ముస్లిం ఇంట ఘుమఘమలాడే మటన్ బిర్యానీ ఉండాల్సిందే.
(చదవండి: Eid Al-Adha 2024: మౌలిక విధులు..)
Comments
Please login to add a commentAdd a comment