![Jhansi Iskcon temple History Swami Prabhupada was Founder of Iskcon - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/6/iscan-temple.jpg.webp?itok=orHQOfwY)
ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని ఆలయాలు అనేకం ఉన్నాయి. శ్రీ కృష్ణుని భక్తిని, భగవద్గీత సందేశాన్ని ప్రపంచానికంతటికీ వ్యాప్తి చేయడానికి అనేక సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థలలో ఇస్కాన్ ఒకటి. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్‌నెస్. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా వేయికి పైగా ఆలయాలను నెలకొల్పింది. భారతదేశంలోనే ఇస్కాన్‌కు 400 కేంద్రాలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో కూడా 12 ఇస్కాన్ దేవాలయాలు ఉండటం విశేషం. ఇస్కాన్ సంస్థను స్థాపించాలనే ఆలోచన యూపీలోని వీరభూమి ఝాన్సీలో ఉద్భవించిందనే సంగతి మీకు తెలుసా? అవును.. ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీ మహారాజ్ ఈ ఆలయాన్ని ఝాన్సీలో నిర్మించాలకున్నారు.
భక్తివేదాంత స్వామి ప్రభుపాద తొలినాళ్లలో ఆయుర్వేద మందులను తయారు చేసేవారు. ఇందుకోసం ఆయన ఝాన్సీలోని ఆయుర్వేద కళాశాలకు తరచూ వచ్చేవారని ఇస్కాన్ కమిటీ సీనియర్ సభ్యుడు ఏనీర్ ప్రభు తెలిపారు. 1952 నుంచి ఆయన ఇక్కడికి క్రమం తప్పకుండా వచ్చేవారు. ఈ నేపధ్యంలో ఝాన్సీలో అతనికి ఇద్దరు స్థానికులు అనుచరులుగా మారారు. ఈ సందర్శనల సమయంలో స్వామి ప్రభుపాదుల దృష్టి ఇక్కడి రాధా బాయి స్మారక చిహ్నంపై పడింది. స్మారక చిహ్నంపై కృష్ణ మంత్రం రాసివుంది. ఆ సమయంలో తాను కృష్ణభక్తి సంస్థను ఇక్కడే స్థాపించనున్నట్లు స్వామి ప్రభుపాద తన అనుచరులకు తెలిపారు.
1957లో ప్రారంభమైన భక్తుల సంఘం
స్వామి ప్రభుపాద మొదట ఈ సంస్థకు భక్తుల సంఘం అని పేరు పెట్టారు. దీనిపై నాటి దినపత్రికల్లోనూ ప్రకటనలు ఇచ్చారు. ఈ సంస్థకు భగవద్గీత సందేశాన్ని ప్రపంచమంతటా చాటగల విద్యావంతులైన యువత అవసరం ఎంతైనా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థకు అంకితమయ్యే యువతకు సంబంధించిన ప్రయాణ ఖర్చులు, ఆహారం, దుస్తులను సంస్థ అందిస్తుందని తెలిపారు. స్వామి ప్రభుపాద 1957లో ఈ సంస్థను స్థాపించాలనుకున్నారు. అయితే ఆయన అనుచరులు, కొందరు రాజకీయ నేతలు వివాదాలు సృష్టించారని చెబుతారు. ఫలితంగా ఆలయం అధికారికంగా ఝాన్సీలో నిర్మాణం కాలేదు.
ఇస్కాన్ 1966లో స్థాపితం
అనంతర కాలంలో స్వామి ప్రభుపాద బృందావనానికి తరలివెళ్లారు. అక్కడ ఆయన 16 సంవత్సరాల పాటు ఉన్నారు. పిమ్మట అమెరికాకు వెళ్లారు. అక్కడ అధికారికంగా 1966లో ఇస్కాన్‌ను స్థాపించాడు. న్యూయార్క్ నగరంలో 1966, జూలై 13న తొలి ఇస్కాన్ ఆలయం నిర్మించారు. తొలి రోజుల్లో స్వామి ప్రభుపాద అక్కడ సమాజం నుండి బహిష్కృతులైన హిప్పీలను ఇస్కాన్‌కు అనుసంధానించారు. భగవద్గీత సారాశం ఇస్కాన్ ద్వారా ప్రపంచ ప్రజలకు చేరువయ్యింది. ప్రస్తుతం ఇస్కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అనుచరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: యుగాంతానికి అందిన హెచ్చరికలు!
Comments
Please login to add a commentAdd a comment