కాలం... ఎవరి ప్రమేయం లేకుండా ముందుకు సాగిపోతుంటుంది. ఈ ప్రకియలో అన్నింటినీ తన గర్భం(కాలగర్భం)లో కలిపేసుకుంటుంది. ఈ విషయంలో గొప్ప కట్టడాలు, నిర్మాణాలకు మినహాయింపేమీ ఉండదు. మనదేశాన్ని బ్రిటీషర్లు పాలించిన కాలంలో వారు అనేక వంతెనలు, రైలు బ్రిడ్జిలను నిర్మించారు. స్వాతంత్య్రానంతరం రైల్వే బ్రిడ్జీలను నూతన టెక్నాలజీతో పునర్నిర్మిస్తున్నారు.
రైల్వే ట్రాక్‌లకు దన్నుగా నిలిచి..
ముంబైలోని బాంద్రాలోని మిథి నదిపై నిర్మించిన బ్రిటీష్ కాలంనాటి రైల్వే వంతెనను ఇప్పుడు పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వంతెనపై ఏర్పాటు చేసిన చివరి ఐరన్ స్క్రూ పైల్స్‌లో ఒకటి త్వరలో చరిత్రలో కలసిపోనుంది. దీని స్థానంలో సిమెంట్ కాంక్రీట్ గిర్డర్‌ను నిర్మించనున్నారు. ఈ వంతెన 1888 నుండి రైల్వే ట్రాక్‌లకు దన్నుగా నిలిచింది. సరిగ్గా ఇదే సమయంలో బాంద్రా రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.
ఇనుప స్తంభాల తొలగింపు
ఈ వంతెన ట్రాక్‌ల కింద ఎనిమిది స్తంభాలు ఉన్నాయి. వీటిని ఇనుముతో తయారు చేశారు. ఇవి 8 నుంచి 10 టన్నుల బరువును కలిగి ఉన్నాయి. అలాగే 15 నుంచి 20 మీటర్ల లోతున పునాదుల్లోకి ఉన్నాయి. ఈ స్తంభాల వ్యాసం సుమారు రెండు అడుగులు. వాటి మందం 50 మి.మీ. ఇవి స్టీల్ గిర్డర్‌లను, వాటి పైన ఉన్న రైల్వే లైన్ల బరువును మోస్తుంటాయి. ఈ స్తంభాలు దాదర్ ఎండ్‌లోని రాతి గోడకు ఆనుకుని ఉన్నాయి. వీటిని ఇప్పుడు కూల్చివేయనున్నారు.
ఇదే చివరి స్క్రూ పైల్
భారతీయ రైల్వేలో కాస్ట్ ఐరన్‌కి సంబంధించిన చివరి స్క్రూ పైల్ ఇదేనని పశ్చిమ రైల్వే ఇంజనీర్ తెలిపారు. అది నీటిలో మునిగిపోయి, బలహీనంగా మారినందున దానిని తీసివేయవలసి ఉంటున్నదన్నారు. ఇది రైలు కార్యకలాపాల భద్రతా సమస్యగా మారే అవకాశం ఉన్నదని, అందుకే ఇప్పుడు దానిని పునర్నిర్మిస్తున్నామన్నారు. ఈ ఎనిమిది ఇనుప స్తంభాలు 9-10 మీటర్ల పొడవుతో నాలుగు రైల్వే లైన్ల భారానికి దన్నుగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Year Ender 2024: ఈ 10 అంశాలపైనే అంతటా చర్చ
వంతెనకు దన్నుగా ఏడు సిమెంట్ గర్డర్లు
ఈ రైల్వే బ్రిడ్జి ఉత్తర-దక్షిణ దిశలో దాదాపు 50-60 మీటర్ల పొడవు కలిగివుంది. దీనికి ఏడు సిమెంట్ గర్డర్‌ల ద్వారా దన్ను దొరుకుతుంది. చర్చ్‌గేట్ చివరన నదిలో ఇనుప స్తంభాలు కూరుకుపోయాయి. మిగిలిన ఇనుప స్తంభాలు సిమెంటు కాంక్రీటు మధ్య ఉన్నాయి. స్క్రూ పైల్స్ చివరలు మాత్రమే పైన కనిపిస్తాయి. ప్రస్తుతం ఇంజనీర్లు నీటి ప్రవాహాన్ని ఆపడానికి మిథి నదికి తూర్పు, పడమర ఒడ్డున కాఫర్‌డ్యామ్‌లను ఏర్పాటు చేశారు. ఇనుప స్తంభాలను తొలగించేందుకు వీలుగా అక్కడ నిలిచిన నీటిని హైపవర్ పంపుల సాయంతో బయటకు తీస్తున్నారు.
కాసేపు రైళ్ల నిలిపివేత
జనవరిలో పశ్చిమ రైల్వే రెండు 9.5 గంటల రైలు బ్లాకులను (రైలు రాకపోకల నిలిపివేత) కొనసాగించనుంది. పశ్చిమ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బ్లాక్ జనవరి 24 నుంచి 26 వరకూ రాత్రివేళ 9.5 గంటల పాటు ఉండనుంది. ఈ బ్లాక్‌ల సమయంలో ఈ మార్గంలో నడిచే రైలు సర్వీసులను రద్దు చేయనున్నారు. ఈ రెండు బ్లాక్‌ల సమయంలో ఇంజనీర్లు ఇనుప స్తంభాల పైన ఉన్న స్టీల్ గిర్డర్‌లను తొలగించి, వాటి స్థానంలో 20 మీటర్ల పొడవైన కాంక్రీట్ గర్డర్‌లను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment