పిల్లలూ! వీడియో గేమ్స్ ఆడటమంటే మీకు చాలా ఇష్టమా? సెలవుల్లో ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఆడుతుంటారా? మరి వాటి చరిత్రేమిటో తెలుసుకుందామా?
వీడియో గేమ్స్ పుట్టి దాదాపు 66 ఏళ్లు దాటుతోంది. 1958లో విలియం ఆల్ఫ్రెడ్ హిగిన్ బోతమ్ అనే అమెరిన్ భౌతిక శాస్త్రవేత ‘టెన్నిస్ ఫర్ టూ’ అనే వీడియోగేమ్ తయారు చేశారు. 1960 తర్వాత కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న సమయంలో కంప్యూటర్ శాస్త్రవేత్తలు గ్రాఫిక్స్ ఆధారంగా గేమ్స్ తయారు చేశారు. అనంతరం 1962లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ‘స్టార్‌వార్’ అనే వీడియో గేమ్ తయారు చేశారు. ఆ తర్వాత 1970లో ఇళ్లల్లో వీడియో గేమ్స్ ఆడుకునేందుకు గేమ్ కన్సోల్‌ని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ వీడియో గేమ్స్ అమెరికా అంతటా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలు సైతం కొత్తగా వీడియోగేమ్స్ తయారు చేశాయి.
వీడియో గేమ్స్ ప్రధానంగా పిల్లల కోసమే తయారు చేసినా పెద్దలు కూడా వీటిని ఇష్టపడుతున్నారని కంపెనీలు గుర్తించాయి. మరిన్ని కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఒకానొక దశలో చాలా గేమ్స్‌కి కాపీలు, పైరసీ వెర్షన్లు వచ్చేశాయి. దీంతో జనానికి నాణ్యమైన గేమ్స్ అందుబాటులో లేకుండా ΄ోయాయి. 1983 నుంచి 1985 మధ్యలో అమెరికాలోని వీడియో గేమ్స్ తయారీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.
ఆ తర్వాత వీడియో గేమ్స్ మార్కెట్లోకి జ΄ాన్ దూసుకొచ్చింది. కొత్త కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడేలా చేసింది. దీంతో సంస్థలు కొత్త టెక్నాలజీ ఉపయోగించి మరిన్ని నాణ్యమైన, క్రియేటివ్ గేమ్స్ తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇంటర్‌నెట్ వాడకం మొదలయ్యాక వీడియోగేమ్స్ మరింతగా అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్ వచ్చాక అందరూ సులభంగా వీడియో గేమ్స్ ఆడేస్తున్నారు. వీటికోసం ప్రత్యేకమైన యాప్స్ కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్స్ మార్కెట్ రూ.1.5 లక్షల కోట్లతో నడుస్తోంది. వేల మంది ఈ రంగంలో పని చేస్తున్నారు. వీడియో గేమ్స్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా గేమ్ డిజైనర్లు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రెండు వేల వీడియో గేమింగ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో వీడియో గేమింగ్ తయారీ గురించి నేర్పిస్తారు. వీడియో గేమ్స్‌లో ఎక్కువమంది యాక్షన్, స్పోర్ట్స్, సాహసయాత్రలు వంటివి ఇష్టపడుతుంటారు
అయితే చదువు పక్కన పెట్టి వీడియో గేమ్స్ ఆడటం ఏమాత్రం మంచిది కాదు. గంటల తరబడి ఆడటం కూడా చాలా ప్రమాదకరం. అదొక వ్యసనం అవుతుంది. రాత్రి పగలూ ఆడాలనిపిస్తుంది. భవిష్యత్తుకే ప్రమాదం. కాబట్టి సెలవు రోజుల్లో కొద్దిసేపు మాత్రమే వీడియో గేమ్స్ ఆడండి. సరేనా?
Comments
Please login to add a commentAdd a comment