ఆ తండ్రికి కూతురంటే ఎనలేని ప్రేమ. ఆ కూతురికి వీడియో గేమ్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. తొమ్మిదేళ్లుంటాయి ఆ చిన్నారికి. మార్కెట్‌లోకి కొత్త గేమ్ రాగానే ముందుగా ఆమె దగ్గరికే ఆ గేమ్ వస్తుంది! అంతలా వీడియో గేమ్స్ మార్కెట్‌ని ఫాలో అవుతుంటాడు ఆ పాప కోసం తండ్రి. అయితే ఆ పాప వేళ్లకు పట్టు ఉండదు. పుట్టినప్పట్నుంచే ఏదో నరాల బలహీనత. జాయ్ స్టిక్స్‌ని సరిగా పట్టుకోలేదు. బటన్స్‌ని గట్టిగా నొక్కలేదు. కానీ గేమ్స్ ఆడటం ఇష్టం. అది గమనించిన తండ్రి.. ఆమె కోసమే ప్రత్యేకంగా ఒక జాయ్ స్టిక్స్ కంట్రోలర్‌ని తయారు చేశాడు.
అది ఆమె వేళ్ల శక్తికి అనుగుణంగా గేమ్‌ని యాక్టివేట్ చేస్తుంటుంది. ఇదంతా కూడా ఆయన విడిపరికరాలతోనే చేశాడు. కొంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది కాబట్టి.. కూతురికి అలా కస్టమైజ్‌డ్ గేమ్ కంట్రోలర్‌ని తయారు చేసి ఇవ్వగలిగాడు. ఇందుకు అతడు ఖర్చు చేసింది.. మన కరెన్సీలో పదివేల రూపాయలు! తన కూతురి సంతోషం కంటే డబ్బు ఎక్కువేం కాదు అంటున్న ఆ తండ్రి పేరు రోరీ స్టీల్. కూతురు అవా. వాళ్లుండేది ఫ్రాన్స్‌లోని జెర్సీ ప్రాంతంలో. ‘నా బిడ్డ కోసం ఆ మాత్రం చేయడంలో గొప్పేముంది?’ అని కూడా అంటున్నాడతను.
Comments
Please login to add a commentAdd a comment