-పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు
హన్మకొండ(వరంగల్ జిల్లా)
ప్రపంచలోనే ప్రసిద్ధ కట్టడంగా కాళోజి కళా కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు చెప్పారు. హన్మకొండలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించి ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం హరిత కాకతీయ హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. 4.5 ఎకరాల్లోని 12,900 చదరపు మీటర్ల స్థలంలో 207 పిల్లర్లు, నాలుగు అంతస్థుల(జీ ప్లస్ 4)తో 70 అడుగులో ఎత్తులో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 1150 మంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మిస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు 115 పిల్లర్ల నిర్మాణం పూర్తరుుందని చెప్పారు. మరో ఏడాదిలో పూర్తవుతుందని తెలిపారు. ఈనెల 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాల కోసం పర్యాటకుల సౌకర్యార్థం నాగార్జునసాగర్‌లో రెండు ఏసీ బోట్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీ పుష్కరఘాట్ నుంచి నాగార్జున కొండ మధ్య వీటిని నడుపుతామన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా సోమశిలలోని శ్రీ లలిత సోమేశ్వర దేవస్థానం పుష్కరఘాట్ వద్ద కూడా ఏసీ బోట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ బోట్‌లో శ్రీశైలం డ్యాం వరకు వెళ్లి రావచ్చని, ఇందులో రెస్టారెంట్ సౌకర్యం ఉందని చెప్పారు. ఆలంపూర్‌లో పర్యాటకుల సౌకర్యార్థం తుంగభద్ర నది సమీపాన హరిత ఆలంపూర్‌ను నిర్మించినట్లు తెలిపారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రవేశ పెట్టిందన్నారు. ఆయన వెంట రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ కత్తి నాథన్, డీఈ సామ్యేల్, ఏఈ రామకృష్ణ ఉన్నారు.