కాళోజీ ఆశయాన్ని సాధించిన కేసీఆర్
కరీంనగర్ రూరల్ : తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సాధించారని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుకలను మండలంలోని రేకుర్తిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ విగ్రహానికి మంత్రి రాజేందర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్, ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమైక్యవాదుల పరిపాలనలో తెలంగాణ భాష, యాస కరువైందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళోజీ శతజయంతిని అధికారికంగా నిర్వహించి గుర్తింపునిచ్చిందన్నారు. ఇంటర్మీడియేట్‌లో ఉండగా కాళోజీ అధ్యక్షతన ఏర్పడిన మూమెంట్ ఆఫ్ స్టూడెంట్ ఫెడరేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అదృష్టం తనకు కలిగిందన్నారు. తెలంగాణ కోసం, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అప్పటి సీఎం వెంగళరావును ఓడించాలని కాళోజీ ఇచ్చిన పిలుపు రాజకీయవర్గాల్లో సంచలనం కలిగించిందన్నారు.
కేసీఆర్ తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ను స్థాపించినపుడు కాళోజీ ఆశీర్వదించినట్లు చెప్పారు. సమానత్వం, ఆకలి లేని సమాజం కోసం తపించిన కాళోజీ ఆశయసాధనకు ప్రతీఒక్కరు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నందెల్లి పద్మ- ప్రకాశ్, ఎంపీటీసీ రాజశేఖర్, తహశీల్దార్ జయచంద్రారెడ్డి, నాయకులు రహీం, నరేశ్, కిష్టయ్య, అనిల్‌కుమార్, మనోహర్ పాల్గొన్నారు.
అవినీతి రహిత సమాజమే నివాళి: ఉమ
కరీంనగర్ : అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడమే ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు ని జమైన నివాళి అని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తు ల ఉమ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మం దిరంలో మంగళవారం కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం, తెలంగాణ సాధన కోసం గళమెత్తిన మహామనిషి కాళోజీ అని జెడ్పీ చైర్‌పర్సన్ పేర్కొన్నారు. ఈ సభలో జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, సీఈవో సదానందం, జెడ్పీటీసీలు సదయ్య, శరత్‌బాబు, అంబటి గంగాధర్, సరోజ, విమల, నార బ్రహ్మయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి అన్నవరం దేవేందర్ కాళోజీపై కవితలు చదివి వినిపించారు.
ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి : జేసీ
కరీంనగర్‌కల్చరల్ : ప్రతి ఒక్కరు అన్యాయాన్ని ఎదిరిస్తూ, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కవికాళోజీ నారాయణరావు శత జయంతి వేడుకలను మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
కాళోజీ అనే మూడు అక్షరాలు మూడు తరాలకు, మూడు ఉద్యమాలకు, మూడు కళలకు ప్రతీక అని సాహితీవేత్త గండ్ర లక్ష్మణ్‌రావు కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో టి.వీరబ్రహ్మయ్య, డీపీఆర్వో ప్రసాద్, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, సీపీఓ సుబ్బారావు, డీఈవో కె.లింగయ్య, జిల్లా ఉపాధి కల్పనాధికారి రవీందర్‌రావు, సాహితీ గౌతమి కార్యదర్శి దాస్యం సేనాధిపతి, మాడిశెట్టి గోపాల్, ఉద్యోగులు పాల్గొన్నారు.