'‌ప్ర‌జాక‌వి కాళోజీ' సాహసంతో కూడుకున్న ప్రక్రియ | KTR Attended Prajakavi Kaloji Movie Launch Programme In Hyderabad | Sakshi
Sakshi News home page

'‌ప్ర‌జాక‌వి కాళోజీ' సాహసంతో కూడుకున్న ప్రక్రియ

Sep 9 2020 6:55 PM | Updated on Sep 9 2020 7:20 PM

KTR Attended Prajakavi Kaloji Movie Launch Programme In Hyderabad - Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌ : "ప్రజాకవి కాళోజీ" బయోపిక్ సినిమా తీయడమన్నది సాహసంతో కూడుకున్న ప్రక్రియని ఐటీశాఖ మంత్రి  కేటీఆర్ తెలిపారు. విజయలక్ష్మీ జైనీ నిర్మాణ సారథ్యంలో జైనీ క్రియేషన్స్ నిర్మిస్తున్న "ప్రజాకవి కాళోజీ" బయోపిక్ సినిమాకు సంబంధించి  బుధవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌  ముఖ్య అతిధిగా హాజరై కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టిన ప్రముఖ నవలా రచయిత, నంది అవార్డు గ్రహీత ప్రభాకర్ జైనీ అభినందనీయుడని కొనియాడారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళోజీ గారి 106 వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి సమర్పించే ఉద్దేశంతో ఒక వీడియో సాంగ్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.  కాళోజీ తెలంగాణా చైతన్య స్ఫూర్తి.  కళలకు కాణాచి అయిన వరంగల్ నుండి జయకేతనం ఎగురవేసి విశ్వమంతా ఖ్యాతినార్జించిన మహాకవి. తెలుగువారిలో సాహిత్య రంగంలో "పద్మ విభూషణ్" పొందిన ఏకైక వ్యక్తి కాళోజీ. కాళోజీ నారాయ‌ణ‌రావుపై సీఎం కేసీఆర్‌కు అపారమైన గౌరవం ఉంది. అందుకే కాళోజీ పేరు మీద హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించామని.. వరంగల్‌లో కాళోజీ స్మారక సభా మందిరం నిర్మిస్తున్నాం. ప్రతీ సంవత్సరం కాళోజీ జన్మదినాన్ని "తెలంగాణా భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాం. ప్రముఖ రచయితల‌ను కాళోజీ సాహితీ పురస్కారంతో సత్కరించుకుంటున్నాం 'అంటూ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా  పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉందని కొనియాడారు.  సినిమా నిర్మాణం త్వరగా పూర్తయ్యి విడుదల కావాలని.. ఘన విజయం సాధించాలని ఆయ‌న ఆకాంక్షించారు. ఈ సందర్బంగా సినిమా యూనిట్ సభ్యులను మంత్రి అభినందించారు. ఈ సినిమాకు కెమెరామెన్ గా రవికుమార్ నీర్ల పనిచేయగా.. రచయిత కళారత్న బిక్కి కృష్ణ ఈ చిత్రానికి పాట‌లు రాయగా,  యస్. యస్. ఆత్రేయ సినిమాకు సంగీతం అందించారు. కాళోజీ పాత్రలో మూలవిరాట్ న‌టించ‌నున్నారు. పీవీ గారి పాత్రలో వారి తమ్ముడు పీవీ మనోహర రావు నటించారు. వీరితో పాటు సినిమాలో కాళోజీ ఫౌండేషన్ సభ్యులు నటించడంతో పాటు చిత్ర నిర్మాణానికి త‌మ స‌హకార‌మందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement