
పద్యానవనం: ...అలా నడచుకుంటే సరి!
పట్టపగటింటి సూర్యుని పగిది కర్ణు
డుగ్ర మూర్తియై చెలరేగుచున్నవాడు
మాధవా! మన రథమిప్డు మరలనిమ్ము
బతికి యుండిన సుఖముల బడయవచ్చు!
కాలం కలిసిరానప్పుడు భరిస్తూనయినా కాచుకొని ఉండాలె అని చెబుతూ, ‘‘...కాలమ్ము రాగానె కాటేసి తీరాలె’’ అంటాడు ప్రజాకవి కాళోజి నారాయణరావు ఉరఫ్ కాళన్న. కాటేసే సంగతెలా ఉన్నా, కలిసి రానప్పుడు కాస్త ఒకడుగు వెనక్కి తగ్గి ఉండటంలో తప్పు లేదన్నది చారిత్రక సత్యం. రాజ్యానికి వ్యతిరేకంగా సాగే సాయుధ పోరాటాల్లో కూడా ఈ ఎత్తుగడ ఉంది. చిన్న చిన్న ఓటములకు కూడా మనసు చిన్న బుచ్చుకోకుండా, మంచి తరుణం కోసం నిరీక్షించాలనే నీతి ఇందులో దాగుంది.
బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో అనేక గణరాజ్యాలుండేవి. ఒకరి మీద ఒకరి దండయాత్రల్లో ఆయా రాజుల మధ్య దాడులు, దండయాత్రలు, యుద్ధాలు తరచూ జరిగేవి. తమకు బలమున్నప్పుడు అవతలి వారి రాజ్యభాగాలపై దండెత్తి కొంతో, సాంతమో సొంతం చేసుకునే వారు రాజులు. బలం లేనప్పుడు ప్రత్యర్థులు దాడులకు తెగబడితే... వీలయితే ఎదురొడ్డి పోరాడ్డం, కాకుంటే ఏదో విధంగా బతికి బట్టగట్టే ప్రయత్నం చేసేవారు. అలా దెబ్బతిన్న వాళ్లు, మళ్లీ ఏదోలా తంటాలు పడి, పుంజుకొని శక్తి కూడగట్టుకొని ఎదురు దాడులు చేసేవారు. అందులోనూ విజయమో, వీరస్వర్గమో అన్నట్టు పోరాట్టం ద్వారా ఎడనెడ తాము పోగొట్టుకున్న రాజ్యాల్ని తిరిగి స్వాధీనపరచుకున్న ఉదంతాలూ ఉన్నాయి. పనిలో పనిగా పోగొట్టుకున్నదానికి ఎన్నోరెట్లు అధికంగా పొందినవారూ ఉన్నారు.
అంతిమ విజేతలకు కూడా ఒకోసారి పోరాటం మధ్యలో, ‘అయ్యో! ఏంటి నా పరిస్థితి? ఇదేంటి, ఇలా అయిపోతోంది!’ అని ఆందోళన కలిగించే సందర్భాలూ వస్తాయి. అటువంటి సందర్భం మహాభారతంలోనూ ఉంది. ఆ మాటకొస్తే, మహాభారతంలో ఉండి నిజజీవితంలో ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఓ సారి జరగందంటూ ఏమీ లేదంటారు. అలాగే జీవితంలో జరిగేవన్నీ ఎక్కడో ఓ చోట ఏదో రూపంలో మహాభారతంలో జరిగినవే, ఉన్నవే అనీ అంటారు పండితులు. మన జీవితాలతో ఆ ‘పంచమవేదం’ అంతగా ముడివడి ఉందన్నమాట. మహాభారతంలో అత్యధిక భాగం తెలుగించిన తిక్కన నాటకోచిత రచనా పటిమకు మచ్చుతునక ఈ చిన్న పద్యం.
కురుక్షేత్ర రణభూమిలో యుద్ధం జోరుగా సాగుతోంది. కర్ణుడు విజృంభిస్తున్నాడు. విజయుడని పేరున్న అర్జునుడే బెంబేలెత్తిపోతున్నాడు. చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్న కర్ణుడ్ని చూసి జడుసుకున్నాడేమో అర్జునుడు తన రథసారథి అయిన బావ కృష్ణుడితో ‘‘బావా! బతికుంటే బలుసాకులు తిని సుఖపడవచ్చు, ముందు మనమిక్కడ్నుంచి జారుకుందాం, అదుగో ఆ కర్ణుడ్ని చూడు మిట్ట మధ్యాహ్నపు సుర్యుడిలాగా మండిపోయి ఉగ్రరూపంలో చెలరేగుతున్నాడు, ఇప్పటికైతే రథాన్ని వెనక్కి మలుపు’’ అని బతిమాలుతాడు. కృష్ణుడంత తేలిగ్గా సరే అంటాడా? అప్పటికే ఓ పేద్ద గీతాసారాన్ని బామ్మర్దికి బోధించి ఉన్నాడు. మళ్లీ నాలుగు ఊతమిచ్చే మాటలు చెప్పి విజయుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు. సాఫీగా యుద్ధం సాగిపోతుంది. కర్ణ వధా జరుగుతుంది. అదో పెద్ద కథ!
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, కష్టాలు మనుషులకు కాకుండా రాళ్లకొస్తాయా? ధైర్యంతో తట్టుకోవాలి. ముందుకు పురోగమించడానికి, వ్యూహాత్మకంగా అవసరమైతే ఓ అడుగు వెనక్కి వేయాలి. ‘అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా?’ అంటాడు యోగివేమన. పరిస్థితుల్ని చూసుకొని మెదలాలి. అన్ని వేళలూ ఒక్కలా ఉండవు. అధికారం చేజారడమైనా, ఆశించింది లభించకపోవడమైనా, రాష్ట్రం విడిపోవడమైనా, రాజధాని ప్రాభవం తగ్గడమైనా, ఆర్థిక లోటుపాట్లయినా, ఇంకోటైనా, మరోటైనా... అనుకూల, ప్రతికూల సకల యత్నాల తర్వాత కూడా కొన్ని అనివార్యంగా జరిగిపోయే పరిణామాలుంటాయి. వాటిని తట్టుకొని నిలవడం తప్ప వేరేగా చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకే మనసుకవి ఆత్రేయ అంటాడు ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’ అని. నిజాయితీగా నిష్కామకర్మను ఆచరించిన తర్వాత మంచి ఫలితం కోసం నిరీక్షించడం తప్ప నిరాశ చెందనవసరం లేదన్నదే నిజమైన జీవనసూత్రం.
- దిలీప్‌రెడ్డి